అమరులు ఇప్పుడు గుర్తుకొచ్చారా?

తె లంగాణ రాష్ట్ర  ప్రభుత్వం  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరుల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ఇన్నేండ్లుగా ఎన్నడూ అమరులను తలవని సర్కారు ఇప్పుడు ప్రత్యేకంగా స్మారక చిహ్నం కట్టి దినోత్సవం జరపడంలో అమరులపై ప్రేమ కన్నా స్వార్థ ప్రయోజనాలే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నది.  అనేకమంది విద్యార్థి, నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతోటే తెలంగాణ వచ్చింది.  

నీళ్లు, నియామకాలు, నిధులు అనే నినాదంతో తమ ప్రాణాలను, భవిష్యత్తును సైతం పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని ఉద్యమంలో కొట్లాడారు. పోలీసులలాఠీ దెబ్బలు, రబ్బర్ తూటాలకు ఎదురు నిలబడ్డ సందర్భాలు అనేకం. తెలంగాణ వస్తే భావితరాల భవిష్యత్తు మారుతుందని, ఉద్యోగాలు వస్తాయని భావించే.. శ్రీకాంతాచారి, యాదయ్య, ఇసాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య ఇలా 1300 మంది అమరవీరులయ్యారు.  కానీ తెలంగాణ అమరవీరుల త్యాగాలతో  అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం.. ఉద్యమాకారులను అవమానించిన, ఉరికించి కొట్టిన  పాడి కౌశిక్​రెడ్డి, దానం నాగేందర్​ లాంటి వారిని అందలమెక్కించి పదవులు కట్టబెట్టింది.  అమరవీరుల త్యాగాలను మరిచింది.

 ఉద్యమంలో పనిచేసిన వారందరినీ కూడా బీఆర్​ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసే కార్యక్రమానికి పూనుకున్నది. అందుకు నిదర్శనం సత్తుపల్లి పట్టణంలో తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం లేకపోవడం. కులానికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సండ్ర వెంకట వీరయ్య అన్ని కులాలను, వర్గాలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ సార్​ విగ్రహం ఏర్పాటు చేయలేకపోవడం ముమ్మాటికి కుట్రే.  కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే అమరవీరులకు క్షమాపణ చెప్పి,  ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని సత్తుపల్లి పట్టణంలో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి.
- బండి నరేష్, సత్తుపల్లి