అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా జరిపేందుకు విస్తృతంగా సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు సంఘ్ పరివార్ పెద్ద ఎత్తున అయోధ్య సంబురాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని కిందస్థాయి కార్యకర్త వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు. రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా..? బీజేపీకి ఓట్ల వర్షాన్ని కురిపిస్తుందా..? అనే విషయాలపై పలు ప్రముఖ సర్వే సంస్థలు అధ్యయనం చేస్తున్నప్పుడు పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమం బీజేపీకి రాబోయే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుస్తుందనే ప్రచారం ఉండడంతో ఇతర రాజకీయ పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మందిర నిర్మాణాన్ని బీజేపీ ‘రాజకీయ కార్యక్రమం’గా మార్చిందని, ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
హిందూ ఓటర్లపై బీజేపీ ప్రభావాన్ని పరిశీలిస్తే 2014, 2019 ఎన్నికల్లో పలు అంశాలతో వీరిని ప్రభావితం చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందనడంలో సందేహం లేదు. వచ్చే నెలలో 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్న నేపథ్యంలో దేశమంతా రామమయ వాతావరణం సృష్టించి ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ధార్మికత పెరుగుతున్న కొద్దీ బీజేపీకి ఓట్లు పెరుగుతున్నాయి
తెలంగాణలో ప్రభావం..
తెలంగాణలో బీజేపీ ఆశిస్తున్నట్టుగా హిందూత్వం, రామాలయం అంశాల ప్రభావంపై పీపుల్స్‌పల్స్ బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయగా అధికంగా ఉంటుందని 12 శాతం మంది, కొంచెం ప్రభావం ఉంటుందని 30 శాతం, ప్రభావం ఉండదని 30 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు.
బీజేపీ 50శాతం ఓట్లు సాధించేనా?
1950 నుండి ఇప్పటివరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా 50 శాతం ఓట్లతో కేంద్రంలో అధికారం చేపట్టలేదు. కేవలం 1984లో ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురయిన వెంటనే జరిగిన ఎన్నికల్లో సానుభూతి పవనాలతో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 50 శాతానికి మించి ఓట్లు పొందగలిగింది. ఇప్పుడు మొదటిసారిగా బీజేపీ రామమందిరం ప్రారంభోత్సవాన్ని అనుకూలంగా మల్చుకొని 2024లో 50 శాతం ఓట్లు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోదీ 11 రోజుల దీక్ష చేపట్టారు.
పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు అందరూ గల్లీ నుండి ఢిల్లీ వరకు విస్తృతంగా చేపడుతున్న పలు కార్యక్రమాలు ఎన్నికల్లో తమ మద్దతును గణనీయంగా పెంచుకోవడం కోసమే అని స్పష్టం చేస్తున్నాయి.
ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత
రామాలయం ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని అయోధ్యకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఇంటింటికి రాములోరి అక్షింతలు పంపిణీ చేయడం, ప్రారంభోత్సవం రోజున దేవాలయాలలో రామ భజనతో పాటు పలు కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ఇదే స్ఫూర్తితో రాబోయే రెండు నెలల్లో కూడా దేశవ్యాప్తంగా హిందువులను ఆధ్యాత్మికంగా క్రియాశీలకంగా ఉంచేందుకు బీజేపీ,
సంఘ్ పరివార్ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నికల సమయంలో హిందువులు మరింత ఎక్కువగా బీజేపీ పక్షాన మళ్లే విధంగా ఉంటాయని గత ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హిందువులను ‘అధిక ధార్మికులు’, ‘తక్కువ ధార్మికులు’ అంటూ రెండు విధాలుగా విభజించి పరిశీలిస్తే 2019 ఎన్నికల్లో అధిక ధార్మికులలో 53 శాతం మంది బీజేపీకి
10 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు తేలింది. రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ఓ పక్షం రోజులపాటు సంబరాలు, ప్రచారం కార్యక్రమాలను బీజేపీతో పాటు సంఘ్ పరివార్ చేపడుతోంది. ప్రధాని మోదీతో మొదలుపెట్టి అందరూ వీలు దొరికినప్పుడల్లా దేవాలయాల సందర్శన, హిందూ పండుగలు, ఉత్సవాలలో పాల్గొంటున్నారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్న సమయంలో ప్రతి ఇంట్లో ఐదు దీపాల ‘‘రామ జ్యోతి’’ని వెలిగిస్తూ దీపావళి మాదిరిగా సంబురాలు జరుపుకోవాలని సంఘ్ పరివార్ పిలుపిచ్చింది.
రెండు నెలల పాటు అయోధ్యకు యాత్రికుల తాకిడి
రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత కూడా మరో రెండు నెలల పాటు కార్యక్రమాలు నిర్వహించేలా విస్తృతమైన ప్రణాళికలు రూపొందించారు. ప్రతి రోజు సుమారు 50,000 మంది చొప్పున వచ్చే రెండు నెలలు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు అయోధ్యకు వచ్చి బాలరాముడిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అయోధ్యకు ప్రత్యేకంగా రైళ్లు, విమానాలతో పాటు హెలికాప్టర్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
భక్తులకు వివిధ స్థాయిల్లో సహాయ సహకారాలు అందించేందుకు జనవరి 22 తర్వాత బీజేపీ కార్యకర్తలతో బూత్ స్థాయిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. అయోధ్యలో భక్తులకు వసతి, ఇతర సదుపాయాలు సమకూర్చడంలో కూడా బీజేపీ కేడర్ సహాయకారిగా ఉంటారు. రామజన్మభూమి ఉద్యమానికి సంబంధించి ఒక బుక్‌లెట్‌తో పాటు కరసేవకులు, ఇతర కార్యకర్తలకు సంబంధించిన వివరాలను కూడా భక్తులకు అందించనున్నారు.
హిందువులపై బీజేపీ ప్రభావం ఎంత?
ఓ జాతీయ స్థాయి సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం దేవాలయానికి వెళ్లే హిందువులలో 28 శాతం మంది మాత్రమే 2009లో బీజేపీకి ఓటు వేయగా, వారి సంఖ్య 2014లో 45 శాతానికి, 2019లో 51 శాతానికి పెరిగింది. అయితే 2019లో అరుదుగా దేవాలయాలను సందర్శించేవారిలో 39 శాతం మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారు. అదేవిధంగా 2014 ఎన్నికలలో నిత్యం దైవ ప్రార్థన చేసేవారిలో 41 శాతం మంది బీజేపీకి ఓటు వేయగా, అరుదుగా దేవుడిని ప్రార్థన చేసేవారిలో 27 శాతం మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారు. నిత్యం దైవాన్ని ప్రార్థించే హిందువులు 2019లో బీజేపీకి 49 శాతం మంది ఓటు వేయగా
అరుదుగా దేవుడిని ప్రార్థించే వారు 35 శాతం మంది మాత్రమే బీజేపికి ఓటు వేశారు. హిందువులలో ‘ధార్మికత’ పెరిగిన కొద్దీ బీజేపీ ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఇటువంటి ధోరణి హిందువులలో ఎక్కువగా 2009 నుంచి 2019 మధ్య జరిగినట్లు పలు అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. ఈ ఉదాహరణలతో అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ సంబురాలు వచ్చే ఎన్నికలలో బీజేపీకి ఓట్ల పరంగా అనుకూలించే అవకాశాలున్నాయి.
మోదీ మాటనే గ్యారంటీ
అయోధ్యలో రామమందిరం ఏర్పాటు గురించి తామిచ్చిన హామీని నెరవేర్చామని, ఇది ఓటర్లపై విశేషంగా ప్రభావం చూపిస్తుందని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. రామాలయం నిర్మాణంలో తాము చేసిన కసరత్తుతో తమకు విజయం ఖాయమనే ధీమాతో బీజేపీ అగ్రనేతలు ఉన్నారు. ‘మోదీ ఓ మాట అన్నారంటే అది ప్రజలకు గ్యారంటీ ఇచ్చినట్టే’ అనే నినాదం వాస్తవ రూపం దాల్చిందని చెప్పడానికి రామాలయం నిర్మాణమే నిదర్శనమని బీజేపీ చెబుతోంది.
హిందూత్వ కార్డుతో ఇప్పటివరకు ప్రయోజనం పొందిన బీజేపీ మరోసారి రామాలయం నిర్మాణంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరింత లాభం పొందేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. బీజేపీ వ్యూహాలకు సంఘ్ పరివార్ కూడా తోడవడంతో రాబోయే ఎన్నికలు అయోధ్య రామాలయం చుట్టూ తిరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య రాముడు బీజేపీని ఏమేరకు కరుణిస్తాడో రాబోయే ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి.
- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ