
- కాళేశ్వరం కోసం 7,829 ఎకరాలు కేటాయింపు
- తాజాగా ఆసిఫాబాద్లో టీ ఫైబర్ కోసం 3.85 హెక్టార్లు,
- ప్రత్యామ్నాయంగా చెట్లు పెంచకపోవడంతో పర్యావరణానికి నష్టం
హైదరాబాద్, వెలుగు: అభివృద్ధి పనుల కోసం ప్రాజెక్టులు చేపడుతూ చెట్లు పెంచకపోవడంతో రాష్ట్రంలో అటవీ భూమి తగ్గుతూ వస్తున్నది. 2014-–15 నుంచి 2023–-24 వరకు అటవీ సంరక్షణ చట్టం ప్రకారం మౌలిక సదుపాయాలు, ప్రజా ప్రయోజనాల కోసం 4,28,437 లక్షల ఎకరాల భూమిని కేటాయించినట్లు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు వివిధ ప్రాజెక్టులు చేపడుతుండడంతో అటవీ విస్తీర్ణం తగ్గుతున్నది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 24.69 శాతం ఉన్నాయని సామాజిక, ఆర్థిక సర్వే 2024–-25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దేశంలో అడవులు 23.59 శాతం ఉండగా, రాష్ట్రంలో అంతకన్నా ఎక్కువే ఉన్నట్లు పేర్కొంది. అడవుల సగటు విస్తీర్ణంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. అదే స్థాయిలో తగ్గుదలలోనూ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం అడవులు 27,688 చదరపు కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. 2014 నుంచి 2024 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, అటవీయేతర ప్రయోజనాల కోసం 4,28,473 ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతాన్ని కేటాయించింది.
ఇందులో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 3,168.13 హెక్టార్ల (7,829 ఎకరాలు) అటవీ భూములను మళ్లించింది. మహదేవ్ పూర్, కరీంనగర్,- సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, బాన్సువాడ, నిర్మల్ వంటి 8 అటవీ డివిజన్లలోని కొంత భూమిని ప్రాజెక్టుల కోసం మళ్లించారు. వన్యప్రాణులు, అభయారణ్యాల భూమిని ఇందుకోసం వినియోగించారని అధికారులు తెలిపారు. మిషన్ భగీరథ, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేయడం, ఇతర ప్రాజెక్టులకు అటవీ భూములను మళ్లిస్తుండటం భవిష్యత్ తరాలకు పెనుముప్పుగా మారనుంది.
అడవుల పెంపుపై సర్కార్ ఫోకస్
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 27,688 చదరపు కిలోమీటర్లు ఉంది. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండేందుకు అడవుల పెంపునకు ప్రభుత్వం దృష్టిసారించింది. అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా సీఎం రేవంత్నేతృత్వంలోని ప్రభుత్వం 2025–-26 బడ్జెట్‌లో అటవీ శాఖకు రూ.1,023 కోట్లు కేటాయించింది. అడవుల విస్తీర్ణాన్ని 23 శాతం నుంచి 33 శాతానికి పెంచాలని టార్గెట్ పెట్టుకుంది.
2024–-25 సంవత్సరానికి 20.02 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటి వరకు 16.75 కోట్ల మొక్కలు (84 శాతం) నాటామని అధికారులు తెలిపారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరవన యోజన కింద రూ.18.09 కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. అయితే, ఆశించిన స్థాయిలో అడవుల విస్తీర్ణం పెరగడం లేదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
అభివృద్ధి పనులకు అటవీ భూమి మళ్లింపు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అభివృద్ధి పనులు, ఆఫ్టికల్ ఫైబర్ కేబుళ్లు, ఇతర అవసరాల కోసం అటవీ భూమిని మళ్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ డివిజన్ లో టీ-ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు 3.85 హెక్టార్లు, మెదక్ జిల్లాలోని మెదక్ డివిజన్లలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు 2.72 హెక్టార్ల అటవీ భూమిని ప్రభుత్వం మళ్లించింది.
ములుగు జిల్లా మంగపేట రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని నర్సయ్యగూడెం గ్రామం వద్ద బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్ కోసం 0.020 హెక్టార్లు, ములుగు అటవీ డివిజన్ లోని బండ్లపాడు గ్రామంలో బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్ ఏర్పాటు కోసం 0.020 హెక్టార్ల అటవీ భూమిని మళ్లిస్తూ అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్ ఉత్త ర్వులు జారీచేశారు. అభివృద్ధి, ఇతర అవసరాల కోసం అటవీ భూమిని మళ్లిస్తున్నా.. ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకం చేపట్టకపోవడంతో పర్యావరణానికి నష్టం కలుగుతున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
13 జిల్లాల్లో తగ్గిన అటవీ విస్తీర్ణం
రాష్ట్రంలో 100.42 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా.. 20 జిల్లాల్లో పెరిగింది. ఆదిలాబాద్లో అత్యధికంగా 115.50 చ. కి. మీ., భద్రాద్రి కొత్తగూడెంలో 95.55, నిర్మల్ జిల్లాలో 45.37 చ.కి.మీ.ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. జగిత్యాల జిల్లాలో 54.70 చ.కి.మీ.లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 50.33, మంచిర్యాల జిల్లాలో 34.96 చ.కి.మీ.ల మేర అడవుల విస్తీర్ణం పెరిగింది.