ఆర్ధిక వ్యవస్థలపై  రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, కరోనా ప్రభావం

ఆర్ధిక వ్యవస్థలపై  రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, కరోనా ప్రభావం

పెట్టుబడిదారీ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు తరచూ చక్రియ ప్రవాహానికి లోనవుతాయి. సరళీకరణ, ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాత ప్రపంచం ఆర్థిక సరిహద్దులు లేని ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది. కాబట్టి ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్, రష్యా – ఉక్రెయిన్ పై దాడి.. ఈ రెండు పరిణామాలు భారత్ తో పాటు ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటికే 69 దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.1929లో మొట్టమొదట అమెరికాలో  వచ్చిన ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అమెరికాలోని లేమన్ బ్రదర్స్ పెట్టుబడుల బ్యాంకు దివాలా తీసిన తర్వాత 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యానికి ముందు ఉన్న పరిస్థితులే ఇప్పుడు కూడా కనిపించడం గమనార్హం. స్విట్జర్లాండ్ లోని రెండో అతిపెద్ద పెట్టుబడుల బ్యాంక్ అయినా క్రెడిట్ స్విస్ జర్మనీలోని డ్యూటీస్ బ్యాంకులు దివాలా తీయబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయి. మరొకసారి ఆర్థికమాంద్యం అమెరికా నుంచే ప్రారంభమవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు రుణాత్మకంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలోకి జారుకుంటున్నట్లుగా భావించాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక మాద్యానికి ముందు వచ్చే తిరోగమన దశలో పయనిస్తున్నాయి. ముంచుకొస్తున్న మాంద్యం ముప్పు నుంచి భారత ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

తీవ్ర నష్టం మిగిల్చిన కరోనా..

రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసిన అంశాలు కరోనా వైరస్, రష్యా – ఉక్రెయిన్ పై దాడి. ఈ రెండు దేశాల దిగుమతులపై ఆధారపడిన భారత ఆర్థిక వ్యవస్థ కూడా కొంత ప్రతికూల ప్రభావానికి లోనైంది. కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు 52 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తి నష్టం జరిగిందని, ఈ నష్టాన్ని అధిగమించటానికి దేశానికి12 ఏండ్లు పడుతుందని ఆర్బీఐ అంచనా వేస్తున్నది. మరో వైపు రష్యా– ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వల్ల క్రూడ్ ఆయిల్, గ్యాస్ నూనెల ధరలు పెరిగాయి. ఆ ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. శ్రీలంక లాంటి ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి ఈ యుద్ధం కూడా ఒక కారణమే.  అంతర్జాతీయ పరిణామాల వల్ల భారత రూపాయి విలువ పడిపోయింది. ఆ ప్రభావం ఎగుమతులు, దిగుమతులపై పడి విదేశీ మారకద్రవ్య నిల్వలపై కూడా ఎఫెక్ట్​చూపే అవకాశం ఉంది. రూపాయి విలువ పతనం ఆర్థిక వ్యవస్థను బలహీన పరుస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి విలువ పతనాన్ని తద్వారా పెరిగే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు పర్యాయాలు రెపో రేటును పెంచింది. 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కీలకం

2008లో వచ్చిన ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థ నిలబడగలిగింది. రూపాయి మారకం విలువ 50 రూపాయలు దాటి పడిపోయినా, నిరుద్యోగం పెరిగినా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకులు ఇచ్చిన మద్దతుతో భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంను తట్టుకొని నిలబడగలిగింది. కానీ ప్రపంచంలో మరోసారి ఆర్థికమాంద్యం ఏర్పడే ఛాయలు కనిపిస్తున్న ఈ తరుణంలో పడిపోతున్న రూపాయి విలువ, వృద్ధిరేటు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో భారత ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు మాంద్యాన్ని తట్టుకొని నిలబడగలుగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మందగమనం ఏర్పడినా అది తాత్కాలికమే కానీ అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాలు మాంద్య ప్రభావానికి లోనైతే ఆ ప్రభావం మూడు నాలుగేండ్లు కొనసాగే అవకాశం ఉంటుంది. 2008 నాటి కంటే భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాం కాబట్టి ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ రోజురోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువ వృద్ధిరేటు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం నిరుద్యోగం లాంటి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యాన్ని సూచించే అండర్ వేర్ ఇండెక్స్ ప్రకారంగా లోదుస్తుల డిమాండు తగ్గడం లేదు. అలాగే ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గడం లేదు. కాబట్టి ఆర్థికమాంద్యం రాకపోవచ్చు అని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముందస్తు చర్యలు అవసరం

భారతదేశంలో  కరోనా సంక్షోభ కాలంలో రుణాత్మక వృద్ధిరేటు నమోదైనా, వ్యవసాయరంగం ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. రాబోయే మాంద్య పరిస్థితులను ఎదుర్కోవడానికి వ్యవసాయ, ఉత్పత్తి రంగాలు అండగా నిలుస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది. తిరోగమన దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థలను మాంద్య దశలోకి జారిపోకుండా ఉత్పత్తిని పెంచడంతోపాటు, పన్నులను తగ్గించి ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా చూడటం అవసరం. పొదుపు పెట్టుబడులను పెంచి ముఖ్యంగా ‘కీన్స్’ చెప్పినట్లు పంపు ప్రైమింగ్ విధానం ద్వారా స్వయం ప్రేరిత  పెట్టుబడులతో మాంద్యం ముప్పు నుంచి బయటపడాలి. భారత ప్రభుత్వం ఇప్పటికే కరోనా సమయంలో వివిధ రంగాలను ఆదుకోవడానికి 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ భారత్ కింద ప్యాకేజీని ప్రకటించింది. కానీ దేశంలో ఇంకా పేదరికంలోనే మగ్గుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సమయంలో  పేదలైన వారిలో 80 శాతం మంది భారత్ లోనే ఉన్నారని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో వెల్లడించింది. కాబట్టి పేదరికంపై కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది.  ప్రస్తుతం చమురు సంస్థలను ఆదుకోవడానికి 22 వేల కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించి ముందస్తు చర్యలు చేపడుతున్నది. పెట్టుబడిదారులకు, మదుపరులకు, వినియోగదారులకు భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోదనే నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

తాజా నివేదికల ప్రకారం..

అంతర్జాతీయ  ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజా నివేదిక ప్రపంచ వృద్ధి రేటుతోపాటు, భారత వృద్ధి రేటును గతంతో పోలిస్తే తక్కువగా అంచనా వేసింది. ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6.8 శాతానికే పరిమితమవుతుందని నివేదికలో తెలిపింది. జులైలో ఐఎంఎఫ్‌ ప్రకటించిన అంచనా 7.4 శాతం కన్నా ఇది 0.6 శాతం తక్కువ. అయితే ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్‌ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నదని నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఐఎంఎఫ్‌ ఎకనామిక్‌ కౌన్సిలర్‌, పరిశోధనా విభాగం డైరెక్టర్‌ పియరీ- ఆలివియెర్‌ గోరించాస్‌ వ్యాఖ్యానించారు. కేవలం ప్రపంచ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే వృద్ధి రేటు అంచనాను తగ్గించినట్టు చెప్పారు. దీని ప్రకారం మిగతా దేశాలతో పోలిస్తే భారత్​మెరుగైన స్థితిలోనే ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. 

– డా.తిరునామరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ