
మొదట్లో ప్రజాస్వామ్య సాధనంగా పేరొందిన సోషల్ మీడియా క్రమంగా రాజకీయాలు, క్రీడలు, వినోద రంగాల నుంచి మహిళలను వెలివేయడానికి కారణమవుతున్నాయి. భారత్ పార్లమెంటు ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదించినప్పటికీ, సామాజిక మాధ్యమాలు మహిళా నేతల ఎదుగుదలలో ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. సింట్ మార్టెన్ మాజీ ప్రధాని సిల్వేరియా ఇ. జాకబ్స్ పేర్కొనట్టుగా.. మహిళలపై వ్యక్తిగత దాడుల ద్వారా వారిని రాజకీయాల నుంచి తరిమికొట్టవచ్చని కొందరు భావిస్తారు. సోషల్ మీడియా సాధనాల ద్వారా మహిళలను అన్ని కీలక రంగాల నుంచి దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అజ్ఞాతంగా కామెంట్ చేయగలిగే అవకాశం ఉండటంతో ట్రోలర్లు ధైర్యంగా రాస్తున్నారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే మహిళలు ప్రజాక్షేత్రంలోకి, పరిపాలనా రంగంలోకి రావడానికి ముందుకు రాకపోవచ్చు. ఇందు కోసం ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిగా ‘ఇ- సేఫ్టీ కమిషనర్’ వ్యవస్థను ‘ఆన్‌లైన్ సేఫ్టీ చట్టం 2021’ ప్రకారం నియమించింది. ట్రోలింగ్‌పై సులభంగా ఫిర్యాదు చేయడానికి, త్వరగా వాటిని తొలగింపజేయడానికి 'ఇ -సేఫ్టీ కమిషనర్' సమర్థవంతమైన వ్యవస్థగా ఖ్యాతి గడించింది.
సోషల్ మీడియా యాజమాన్యానికి ఉండే వ్యాపార ధోరణి, - అల్గారిథమ్‌తో - పోస్టు చేసే రాతలను, అభిప్రాయాలను కాలక్రమానుసారం కాకుండా, అమర్యాదగా ఆవేశపూరితంగా ఉండే పోస్టులను పైన ప్రదర్శించడం- తద్వారా చదువరులు ఎక్కువ సమయం తమ మీడియాలోనే గడిపేటట్టు చేస్తారు. కాలిఫోర్నియాలో 2027 నుంచి అమలులోకి వచ్చే ‘సోషల్ మీడియా వ్యసనం నుంచి బాలలను రక్షించే చట్టం’ (Protecting Our Kids from Social Media Addiction Act) ఆమోదించింది. పోస్టులను వరుసగా కాలక్రమానుసారం మాత్రమే సోషల్ మీడియా సంస్థలు ప్రదర్శించాల్సి ఉంటుంది.
వాట్సప్ ద్వారా సైబర్ నేరాలు
మరోవైపు, కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక 2023 ప్రకారం వాట్సాప్ ద్వారానే అధిక సైబర్ నేరాలు జరుగుతున్నట్టు వెల్లడయింది. 2024 తొలి త్రైమాసికంలో వాట్సాప్ ద్వారా 43,797, టెలిగ్రామ్ ద్వారా 22,680, ఇన్స్టాగ్రామ్ ద్వారా 19,800, ఫేస్ బుక్ ద్వారా 20,766, యూట్యూబ్ ద్వారా 3,882 సైబర్ నేరాలు జరిగాయి. అభ్యంతరకర ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేస్తుండగానే గమనించి తొలగించగల సామర్థ్యం యూట్యూబ్ కలిగి ఉంది. ఇందుకు కృతిమ మేధస్సుతో కూడిన సాంకేతికతతోపాటు మానవ పర్యవేక్షణను కూడా ఉపయోగిస్తోంది. కానీ, వాట్సాప్‌లో గోప్యతకు పెద్దపీట వేయడం వల్ల అభ్యంతరకర వీడియోలను గమనించే అవకాశం ఉండదు.
వాట్సాప్ ఖాతాల రద్దు
సందేశాలు ఎన్‌క్రిప్ట్ చేయటం వల్ల వాటిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా అసాధ్యం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, చివరి ఐదు సందేశాలు మాత్రమే వాట్సాప్ కు పంపడం జరుగుతుంది. అప్పుడు వాట్సాప్ ఆయా ఖాతాలపై ఆంక్షలు విధిస్తుంది. కానీ, ఎవరూ ఫిర్యాదు చేయకపోతే అభ్యంతరకర వీడియోలు, చిత్రాలు నిరంతరంగా ఫార్వార్డ్ చేసే ప్రమాదం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021 ప్రకారం చట్ట విరుద్ధమైన సమాచారాన్ని తీసివేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు చర్యలు తీసుకోవాలి.
అభ్యంతరకర ఫొటో, వీడియోలపై వ్యక్తిగత ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఫిర్యాదు అధికారిని నియమించి, 24 గంటల్లో చర్య తీసుకోవాలి. ఉదాహరణకు, వాట్సాప్ ఫిర్యాదు అధికారికి జనవరి నెలలో 9,474 ఫిర్యాదులు అందాయి. స్వయంగా తనిఖీ చేసి 99,67,000 హానికరమైన ఖాతాలను వాట్సాప్ ఒక్క నెలలోనే రద్దు చేసింది.
గేమింగ్ డిజార్డర్
ఆస్ట్రేలియా పార్లమెంటు ‘ఆన్‌లైన్ భద్రతా సవరణ (సోషల్ మీడియా కనీస వయస్సు) బిల్లు 2024’ను ఆమోదించింది. దీని ద్వారా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయకుండా నిరోధించే చర్యలను అమలు చేయడం తప్పనిసరి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఈ చట్టం ప్రకారం, బాలలను అనుమతించినందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు 32 మిలియన్ల డాలర్ల వరకు జరిమానా విధించవచ్చు. ‘మా పిల్లలకు బాల్యం ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఆ తర్వాత విలేకరులతో అన్నారు.
15 ఏళ్లలోపు వారు సోషల్ మీడియాను ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి అవసరమని ఫ్రాన్స్‌లోనూ ఒక చట్టం ఉంది. అయితే, వయస్సు ధ్రువీకరణ ఒక సవాలు అవుతుంది. ఆన్‌లైన్ గేమింగ్ కూడా ఆందోళనకరంగా మారింది. భారత విద్యా మంత్రిత్వ శాఖ ‘గేమింగ్ డిజార్డర్’గా గుర్తించిన గేమింగ్ వ్యసనం కూడా పిల్లల శ్రేయస్సును ప్రమాదంలో పడేస్తుందని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియటరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు రూపొందించింది.
ఆన్లైన్ హింస వల్ల 38% మహిళలు నెట్వాడటం లేదు
సాంకేతిక (డిజిటల్) ఆధారిత జెండర్ హింస మహిళలను ఆర్థికంగా కూడా కుంగదీస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ‘ఉమెన్స్ జెండర్ స్నాప్‌షాట్ 2022’ నివేదిక ప్రకారం - ప్రపంచవ్యాప్తంగా 38% మంది మహిళలు ఆన్‌లైన్ హింస వల్ల అంతర్జాలం ఉపయోగించలేకపోతున్నారు. ఇందువల్ల తక్కువ-, మధ్య ఆదాయ దేశాలు తమ జీడీపీలో ఇప్పటికే ఒక ట్రిలియన్ డాలర్ల మేరకు నష్టపోయాయి. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకర వీడియోలను, చిత్రాలను మొదట పోస్టు చేసేవారు, ఫార్వర్డ్ చేసేవారిని శిక్షించేందుకు ఆస్ట్రేలియా వలె కఠిన చట్టాలు ఆమోదించాల్సిన అవసరం ఉంది.
బాలల్లో నేర ప్రవృత్తి
2021 చట్టప్రకారం పిల్లలకు హానికరమైన, చట్టవిరుద్ధమైన సమాచారాన్ని తొలగించడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌లు త్వరితగతిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు చిన్న వయసులోనే పొర్నోగ్రఫీ చూడడం వల్ల బాలల భావోద్వేగ, మానసిక, సామాజిక, శారీరక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతున్నట్లు ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిషియన్స్’ హెచ్చరిస్తోంది. ఇది బాలలలో నేర ప్రవృత్తికి, కుంగుబాటుకు దారి తీస్తోంది. ‘బాలల హక్కుల కన్వెన్షన్’ ప్రకారం హానికరమైన కంటెంట్ నుంచి పిల్లలను రక్షించేలా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష
భారత ప్రభుత్వం ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (1930)ను ఏర్పాటు చేసింది. కానీ, ఆర్థిక నేరాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తుండడంతో ఈ పోర్టల్ నగ్న చిత్ర వేధింపులపై తగినంత దృష్టి పెట్టలేకపోవచ్చు. మెక్సికో ‘ఒలింపియా’ చట్టాన్ని అమలుచేస్తోంది. ‘ఒలింపియా మెలో’ అనే ధీర వనిత తన అభ్యంతరకర వీడియో షేర్ అయినప్పటికీ కుంగిపోకుండా సాంకేతిక హింస నుంచి రక్షణ కోసం చేసిన ఉద్యమ ఫలితమే ఒలింపియా చట్టం. ఒలింపియా చట్టం డిజిటల్ హింసను నియంత్రించడానికి, ముఖ్యంగా వ్యక్తిగత సమ్మతి లేని సంబంధిత చిత్రాలు, వీడియోల పంపిణీని నిరోధించడానికి రూపొందించిన చట్టం.
వ్యక్తిగత సమ్మతిలేకుండా భాగస్వామ్యం చేసిన చిత్రాలు లేదా వీడియోలను తీవ్ర నేరంగా పరిగణిస్తోంది. ఉల్లంఘనలకు 3 నుంచి 6 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇది బ్రెజిల్ వంటి ఇతర దేశాలకు కూడా ప్రేరణగా నిలిచింది. జర్మనీ నెట్‌వర్క్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చట్టం ప్రకారం హానికరమైన కంటెంట్ 24 గంటలలో తొలగించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా తక్షణ చర్య తీసుకోవడం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యత. విఫలమైతే భారీ జరిమానాలు విధించడం జరుగుతుంది. ప్రతి సోషల్ మీడియా సంస్థ తన వాడుకదారుల నుంచి ఫిర్యాదులను నమోదు చేసుకుని ప్రతిస్పందించడానికి 24–48 గంటల గడువు ఉంటుంది.
శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకుడు