ప్లాస్టిక్‌ని ఎక్కువగా వాడొద్దంటున్నా ప్రజలు పట్టించుకోవట్లేదు. ఫ్యాషన్ సింబల్‌గా మార్చేసుకున్నారు. రూల్స్ పాటించని వ్యాపారులు జరిమానాలు కట్టడానికైనా సిద్ధపడుతున్నారు. ప్లాస్టిక్ వేస్ట్‌ని పద్ధతి ప్రకారం వదిలించు కోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెబుతున్నా రాష్ట్రాలు వినిపించుకోవట్లేదు. ఫలితంగా పర్యావరణానికి నష్టం కలిగించినందుకు ఆయా సర్కార్లు నెల నెలా కోటి రూపాయలు పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దేశంలోని 27 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ఫైన్ కట్టాల్సి ఉంది.
ప్లాస్టిక్‌ని క్రమ పద్ధతిలో తొలగించడం ద్వారా పర్యావరణానికి నష్టం కలగకుండా చూడ టంలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఫెయిల్ అయ్యాయి. ‘సిస్టమాటిక్ డిస్పోజల్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్’కి సంబంధించిన యాక్షన్ ప్లాన్లను ఏప్రిల్ 30 లోపు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(సీపీసీబీ)కి ఇవ్వాల్సి ఉంది. అలా చేయకపోతే ప్రతి నెలా రూ.కోటి చెల్లించాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) విధించిన ఈ డెడ్‌లైన్ దాటిపోయి కూడా నెల రోజులైంది. దేశంలోని 27 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పనిని గడువు లోపు పూర్తిచేయలేకపోయాయి.
ఇవీ లోపాలు..
ఆఫీసర్లకు సరైన నాలెడ్జ్ లేకపోవటం; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సీపీసీబీ, ఎన్జీటీ ఆదేశాలను లెక్కలోకి తీసుకోవట్లేదని ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ అభిప్రాయపడింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ (పీడబ్ల్యూఎం) రూల్స్‌ని పరిగణనలోకి తీసుకోకపోవటానికి ముఖ్య కారణం స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల మధ్య సరైన అవగాహన, అప్డేట్స్ లేకపోవటమని తెలిపింది.
రాష్ట్ర స్థాయిలో వేస్ట్ మేనేజ్మెంట్కి బాధ్యులైన ఆఫీసర్లకు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులకు మధ్య సమాచార లోపం నెలకొన్నట్లు వెల్లడించింది. ప్లాస్టిక్‌ని ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు వేరు చేయటానికి, పకడ్భందీగా పారవేయటానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులకు అప్ టూ డేట్‌గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించింది.
ముందే హెచ్చరించిన ఎన్జీటీ
పీడబ్ల్యూఎం రూల్స్‌పై ఎన్జీటీ ఈ ఏడాది మొదట్లోనే హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చెరి మినహా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చింది. పీడబ్ల్యూఎం రూల్స్‌ని 2016లో రూపొందించారు. తర్వాత 2018లో సవరించారు. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం సిటీలు, టౌన్లు, విలేజ్‌ల్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌ని ఏర్పాటుచేయాలి. ప్లాస్టిక్ యూనిట్లను రిజిస్ట్రేషన్ చేయాలి. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వేరుచేయటం, పారవేయటం వంటివి ఒక క్రమపద్ధతిలో జరగాలి. ఇలా చేస్తే డ్రైనేజీలు మూసుకుపోవటం, తద్వారా చెత్తాచెదారం ఒక్కచోటే పెద్దఎత్తున పేరుకుపోవటం, ప్లాస్టిక్‌కి ఓపెన్ ప్లేసుల్లో మంటపెట్టి కాల్చటం వంటివి చోటుచేసుకోవని ఎన్జీటీ తన ఆదేశాల్లో వివరించింది. దేశంలోని 22 రాష్ట్రాలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల వాడకాన్ని పూర్తిగా నిషేధించినా అది పక్కాగా అమలుకావట్లేదు. దీంతో పబ్లిక్ పల్చటి ప్లాస్టిక్ కవర్లను, ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులను భారీగా నిల్వ చేసుకోవటం, అమ్మటం, వినియోగించటం వంటివి విచ్చలవిడిగా చేస్తున్నారు.
జైలు శిక్షలూ తప్పవు
ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడానికి ప్రణాళికలను రూపొందించాలన్న ఆదేశాలను ఖాత రు చేయకపోవటం వల్లే ఎన్ జీటీని ఆశ్రయించాం . ఇప్పుడు ఎన్ జీటీ ఆర్డర్స్ నీ బుట్టదాఖలు చేస్తున్నా రు. దీంతో రాష్ట్రాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయి . ఈ పనిష్మెం ట్ ఇక్కడితో ఆగదు. ఒక్కోసారి జైలుశిక్ష కూడా విధించాల్సి వస్తుంది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్స్ ని స్టేట్ గవర్నమెంట్లు లెక్కచేయట్లేదు. ఫలితంగా పరిస్థితి మరింత దిగజారింది. వేస్ట్ మేనేజ్ మెంట్ అనేది మునిసిపల్ కార్పొ రేషన్లకు లాస్ట్ ప్రయారిటీ అయిపోయింది.
ప్లాస్టిక్ ప్రొడక్ట్‌ల వాడకాన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కంప్లీట్‌గా బ్యాన్ చేసినా ఢిల్లీ సహా మెజారిటీ ఏరియాల్లో అసలు ఆ దాఖలాలే కనబడట్లేదని ఎన్జీటీ అంటోంది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్లాస్టిక్ వేస్ట్‌ని ఇష్టమొచ్చినట్లు పారేయటం, కాల్చటం చేస్తున్నట్లు గుర్తించింది. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌తోపాటు దేశంలోని పలు సిటీలు, టౌన్లలో ప్లాస్టిక్ వేస్ట్‌ని డంపింగ్ యార్డ్‌లకు బదులు రైల్వే ట్రాక్‌ల పైన, బస్ స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా కుమ్మరించటం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రజలకూ ప్రభుత్వాలకూ పట్టిని ఈ సమస్య పరిష్కారమయ్యేదెప్పుడో.
(ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే)
– ఎస్.కె.నిగం, సీపీసీపీ మాజీ అడిషనల్ డైరెక్టర్