
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా 20 జనవరి 2025న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలోనూ ఆందోళన, గందరగోళం నెలకొంది. తాను మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయలేనని ట్రంప్‌కు బాగా తెలుసు. అందువల్లనే ట్రంప్ తను అమెరికా ప్రెసిడెంట్ పదవిలో ఉండగానే.. ఎన్నడూ లేని అతిపెద్ద నూతన విధానాన్ని అమలు చేయడానికి తొందరపడుతున్నారు. ఏ విషయంలోనైనా ట్రంప్ వాదన మనం ఊహించిన దానికంటే భిన్నంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945 నుంచి ప్రపంచం మొత్తం అమెరికాను ఉపయోగించుకుందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ఇతర దేశాలు అమెరికాపై అధిక సుంకాలు విధించాయని, తమ రక్షణ కోసం అమెరికాను ఖర్చు చేయమని బలవంతం చేశాయని ఆయన వాదన. ఈనేపథ్యంలో అమెరికాతో అత్యంత సన్నిహితంగా ఉండే కెనడా, ఇంగ్లాండ్ వంటి వంద సంవత్సరాలకుపైగా కలిసిమెలిసి ఉన్న మిత్రదేశాలను సైతం ట్రంప్ దూరం పెట్టారు.
60 సంవత్సరాల క్రితం ప్రపంచ దేశాలన్నిటికంటే అమెరికానే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు, కార్ల ఉత్పత్తిదారు, ఓడల తయారీదారు అని ట్రంప్ అన్నారు. అయితే, ఇప్పుడు ట్రంప్ పేర్కొంటున్న ఈ పెద్ద పరిశ్రమలన్నీ విదేశాలకు తరలిపోయాయి. తాను ఆయా దేశాలపై అధికంగా సుంకాలు విధిస్తే, ఈ పరిశ్రమలు మళ్లీ అమెరికాకు తిరిగి వస్తాయని అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నమ్ముతున్నారు. కానీ, ఆర్థికవేత్తలు, నిపుణుల వాదనలు వేరేవిధంగా ఉన్నాయి. ఇతర దేశాలకు తరలిపోయిన కంపెనీలు తమ ఉత్పత్తులను అక్కడ చౌకగా తయారు చేయవచ్చు కాబట్టి ఈ పరిశ్రమలు ఇతర దేశాలకు మారాయని నిపుణులు అంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కాలమాన పరిస్థితులు చాలా మారిపోయాయి. అమెరికా తమ ఉత్పత్తులను చౌకగా ఉత్పత్తి చేయలేకపోతోందనేది వాస్తవం.
ఆడమ్ స్మిత్ వాణిజ్య సిద్ధాంతం తిరోగమనం
2500 సంవత్సరాల క్రితం చాణక్యుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన మన భారతీయ కౌటిల్యుడు ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్థికవేత్తగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత దాదాపు 250 సంవత్సరాల క్రితం ఆంగ్లేయుడైన ఆడమ్ స్మిత్ మొదటి ఆధునిక ప్రపంచ ఆర్థికవేత్తగా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ వాణిజ్య సిద్ధాంతాన్ని ఆడమ్ స్మిత్ రూపొందించాడు. ఈ సిద్ధాంతం ఇప్పటికీ అమలులో ఉంది. ఆడమ్ స్మిత్ ఒక సందర్భంలో ఇలా అన్నాడు. ‘ఒక ఫారిన్ కంట్రీ మనం తయారు చేయగలిగే దానికంటే చౌకగా ఓ వస్తువును మనకు సరఫరా చేయగలిగితే, అప్పుడు ఆ వస్తువును మనం తయారు చేయడం కంటే దానిని చౌకగా అందిస్తున్న దేశం నుంచి కొనడం మంచిది’ అని ఆడమ్ స్మిత్ తెలిపారు. కానీ, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆడమ్ స్మిత్ చెప్పింది తప్పు అని వాదిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన అందరు ఆర్థికవేత్తలు అంగీకరించిన ఆడమ్ స్మిత్ అంతర్జాతీయ వాణిజ్య సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దీంతో అమెరికాతోపాటు ప్రపంచ దేశాల్లోనూ కలకలం మొదలైంది.
ట్రంప్ ప్రణాళిక
ప్రపంచ దేశాలపై అధిక సుంకాలను విధించడం ద్వారా చైనా, మెక్సికో, కెనడాతోపాటు ఇతర దేశాలలో ఉన్న అమెరికన్ ఇండస్ట్రీ కొంతమేరకైనా తిరిగి అమెరికాకి వస్తుందని ట్రంప్ ఆశిస్తున్నారు. ఒకవేళ ట్రంప్ ఊహించిన విధంగానే జరిగితే అమెరికాలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అధిక సుంకాలను విధించడం ద్వారా ఇతర దేశాలు తనతో చర్చలు జరుపుతాయని కూడా ట్రంప్ ఆశిస్తున్నారు. చర్చల అనంతరం ట్రంప్ సుంకాలను తక్కువ స్థాయికి తగ్గిస్తారు. అప్పుడు ఇతర దేశాలు కూడా అదేబాటలో పయనిస్తే అమెరికాకు కూడా లాభించి భారీగా ఆదాయాన్ని పొందుతుంది. అదే ట్రంప్ వ్యూహం. ట్రంప్ తన వ్యూహంపై ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు.
చైనాపై ఆర్థిక యుద్ధం
ట్రంప్ ఇతర అమెరికన్ పొలిటీషియన్స్, యూరోపియన్ రాజకీయ నాయకుల మాదిరిగానే ఆయన కూడా ఇప్పుడు చైనాను నియంత్రించాలనుకుంటున్నారు. చైనా తమ ఆర్థిక వ్యవస్థలను కంట్రోల్ చేస్తోందని అమెరికన్లు, యూరోపియన్లు భావిస్తున్నారు. చైనా అమెరికాకి 440 బిలియన్ డాలర్లు విలువచేసే ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అయితే, అదేసమయంలో చైనా 140 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు యూరప్ 220 బిలియన్ డాలర్ల ఉత్పతులను ఎగుమతి చేసి, 530 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ చేస్తున్న ఆర్థిక యుద్ధంలో భాగంగా అంతర్జాతీయంగా చైనాను ఏకాకిని చేసే ప్రయత్నంలో ఇదొక నిరంతర ప్రక్రియ కూడా.
ప్రపంచ అనిశ్చితి
ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలపై అసాధ్యమైన సుంకాలను విధించి ఆర్థికపరమైన దాడి చేస్తున్నాడు. అయితే, ట్రంప్ ఇతర దేశాలపై మానసికపరమైన ఒత్తిడిని ప్రయోగించి ఆయా దేశాలు అమెరికాతో ఒప్పందానికి వచ్చేలా ఒత్తిడి తెస్తున్నారు. అది ఇతర దేశాల నైతికతను దెబ్బతీస్తున్నాయి. ట్రంప్ ఆర్థిక శాస్త్ర విన్యాసాలు విఫలమైతే ఖచ్చితంగా ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. అది భారత దేశంతోపాటు ప్రపంచానికి మంచిది కాదు. ట్రంప్ ప్రపంచ అనిశ్చితికి కారణమయ్యాడు. ఇది అన్ని ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తోంది. అనిశ్చితి కారణంగా అమెరికాలోని చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే, ట్రంప్ ఇతర దేశాలకు సృష్టిస్తున్న సమస్యలు భారతదేశానికి లాభసాటిగా సహాయపడవచ్చు కూడా. చమురు ధరలు తగ్గుతున్నాయి. అది భారతదేశానికి అతిపెద్ద లాభం. ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారు భారతదేశం. రష్యా-, ఉక్రెయిన్ మధ్య యుద్ధం భారతదేశానికి ప్రయోజనం చేకూర్చిందని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటికే భారతదేశం రష్యా నుంచి చౌకగా చమురును పొందింది.
ట్రంప్ వైఫల్యానికి అవకాశాలు
ఇతర దేశాలు చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకుంటాయని ట్రంప్ జూదం ఆడుతున్నారు. యూరప్, చాలా దేశాలు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే, ట్రంప్‌కు చైనా అతి ముఖ్యమైన సమస్య. చైనా కూడా ట్రంప్ పట్ల చాలా దూకుడు వైఖరిని ప్రదర్శిస్తోంది. కానీ, వాణిజ్య యుద్ధం చేయడం అర్ధవంతం కానందున చైనా కూడా ఒక ఒప్పందానికి రావచ్చు. ఒకవేళ చైనా చర్చలు జరపడానికి నిరాకరిస్తే ట్రంప్ ఇబ్బందుల్లో పడతారు. ట్రంప్‌కు తక్షణం ఎదుర్కొనే సమస్య ఏమిటంటే, ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకోకపోతే అమెరికాలో ధరలు పెరుగుతాయి. ప్రజలు ఆందోళకు దిగుతారు. ట్రంప్ ఇతర దేశాలు చర్చలు జరపాలని ఒకరకమైన జూదం ఆడుతున్నారు. చైనా, యూరప్ మొండిగా ఉంటే ట్రంప్‌కు ఇబ్బంది తప్పదు. ట్రంప్ విఫలమైతే, అస్థిరత ఏర్పడితే అది అమెరికాకే ఒక పెద్ద సమస్యగా మారొచ్చు.
ట్రంప్ అండ్ ఇండియా
అమెరికా, యూరోపియన్ యూనియన్ చైనాపై ఆర్థిక యుద్ధం చేస్తే, ఆ పరిణామంతో భారతదేశం చాలా ప్రయోజనం పొందుతుంది. భారతదేశంలో ఇప్పుడు మూడు ఆపిల్ ఫ్యాక్టరీలు ఉన్నట్లే అనేక కంపెనీల ఫ్యాక్టరీలు భారతదేశానికి మారుతాయి. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, వియత్నాం, ఇతర ఆసియా దేశాలపై కూడా ట్రంప్ అధిక సుంకాలను విధించారు. దీని అర్థం ట్రంప్ కారణంగా మనపొరుగుదేశాలు చాలా నష్టపోతాయి. భారతదేశానికి అతిపెద్ద సమస్య చైనా. ఇప్పుడు చైనా తమ ఆర్థిక శత్రువులుగా యూరోపియన్ యూనియన్, అమెరికాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మన శత్రువు ఇప్పుడు తమ సొంత మనుగడ కోసం చేసే పోరులో పూర్తిగా బిజీగా ఉండటంతో భారతదేశానికి ఉపశమనం లభిస్తుంది. ట్రంప్, చైనాపై ఆర్థిక యుద్ధం పరోక్షంగా భారతదేశానికి శుభవార్త అని చెప్పాలి. భారతదేశం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం గురించి చర్చిస్తోంది. ట్రంప్ సుంకాలకు తాము స్పందించబోమని భారత ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఎందుకంటే ఈ పరిణామం వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తుంది. సుంకాల సమస్యలు పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది.
- పెంటపాటి పుల్లరావు
పొలిటికల్ ఎనలిస్ట్