శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వేటికవే స్వతంత్రంగా ఉంటూ, దేని పరిధిలో అది పనిచేస్తూనే సమన్వయం కలిగి ఉండాలి. ఇవన్నీ రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. ఈ మధ్య 4వ వ్యవస్థగా మీడియాను గుర్తించారు. ముఖ్యంగా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కొంత కలివిడిగా, పరస్పర ప్రభావంతో పని చేసినా, న్యాయ వ్యవస్థ మాత్రం నిత్యం జాగ్రత్తతో వాటికి అతీతంగా నిష్పాక్షికంగా, స్వతంత్రంగా పని చేస్తేనే అటు రాజ్యాంగానికి, ఇటు ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుంది. కానీ, ప్రస్తుతం న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే సీబీఐ, ఈడీలు కూడా స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో న్యాయ వ్యవస్థ నిష్పాక్షికత దేశానికి కీలకంగా మారింది.
ప్రత్యేక ప్రతిపత్తి, స్వతంత్రత కలిగి ఉండాల్సిన న్యాయవ్యవస్థపై ప్రస్తుతం ఇతర వ్యవస్థల ప్రభావం ఎక్కువగా పడుతున్నది. ఏడేండ్ల నుంచి అనేక మంది అభ్యుదయ భావాలు కలిగిన వారిపై దాడులు పెరిగాయి. కలబుర్గి, గోవింద్ పన్సారే, నరేంద్ర దబోల్కర్ లాంటి అనేక మంది హత్యకు గురై ఏండ్లు గడుస్తున్నా, వాటిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగలేదు. దోషులకు ఇప్పటికీ శిక్షలు పడలేదు. మరోవైపు న్యాయమూర్తులపై బెదిరింపులు పెరిగిపోయాయి. నిజాయితీగా ఉండి చట్టపరిధిలో తీర్పు ఇస్తున్న న్యాయమూర్తులను హత్య చేయడమో లేక బదిలీ చేయడమో జరుగుతున్నది. గతంలో జడ్జి లోయా అనుమానస్పద మృతి, తాజాగా జార్ఖండ్ లో జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనందను చంపడం వంటివి ఆందోళన కలిగించే అంశాలు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాల్సిన న్యాయ వ్యవస్థ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అణచివేతకు గురవుతున్నది. మరోవైపు ప్రజాప్రతినిధులు న్యాయవ్యవస్థ ఉనికినే ప్రమాదంలోకి నెడుతున్నారు. నేర చరిత్ర, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు తమ పలుకుబడి, ప్రభుత్వాల సహకారంతో వాటిని ఉపసంహరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
హైకోర్టుల్లోనూ బెంచ్‌లు ఏర్పాటు చేయాలె
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణ క్రియాశీలత ద్వారా న్యాయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేయడం అభినందనీయం. ఇటీవల పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఉద్యమకారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారనే వార్తలు దుమారం రేపాయి. దీనిపై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మీడియాలో వచ్చిన కథనాలే నిజమైతే పెగాసస్ వ్యవహారం తీవ్రమైనదనడంలో సందేహం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అనేక సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థకు ఇస్తున్న ప్రాధాన్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఏండ్ల తరబడి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధుల కేసులపై ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకు సంకల్పించడం మంచి పరిణామం. హైకోర్టు స్థాయిలో కూడా ఇలాంటి బెంచ్‌లను ఏర్పాటు చేయాలి.
సత్వర న్యాయాన్ని అందించాలె
మరోవైపు న్యాయమూర్తుల నియామకంలో సామాజిక న్యాయం, లింగ సమానత్వం అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. న్యాయవ్యవస్థ అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్న తరుణంలో వీటిపై దృష్టి సారించి న్యాయవ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే మధ్య తరగతి, నిరు పేదలకు కూడా సత్వర న్యాయాన్ని చేరువ చేసేందుకు, పారదర్శకత పాటించేందుకు ప్రత్యేక చొరవ అవసరం. ఇందు కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవాలి. సామాన్య ప్రజలకు రాజ్యాంగం, హక్కులు, చట్టాల పట్ల కనీస అవగాహన పెంచేందుకు న్యాయ వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పౌరులను చైతన్యవంతులను చేయాలి. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఏ పార్టీ ఉన్నా న్యాయ వ్యవస్థకు సంబంధించిన పోస్టుల భర్తీపై ఎవరి స్థాయిలో వారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం పాటిస్తున్నారని స్పష్టమవుతోంది. దీంతో పెండింగ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ పరిణామాలతో నేర చరితుల ఆగడాలకు అదుపు లేకుండా పోతోంది.
ప్రభుత్వ అండదండలు అవసరం
అందుకే న్యాయ వ్యవస్థపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలి. న్యాయవ్యవస్థ నిర్వీర్యమైతే దేశ భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. అందువల్ల దాని స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలగకుండా తక్షణం చర్యలు చేపట్టాలి. న్యాయ వ్యవస్థ నిష్పాక్షికంగా ఉంటేనే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, న్యాయం కలకాలం నిలుస్తాయి. ఇది దేశానికి శ్రేయస్కరం. అందువల్ల ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు న్యాయ వ్యవస్థ పటిష్టతకు అన్ని స్థాయిల్లో న్యాయమూర్తుల భర్తీకి ఒత్తిడి పెంచాలి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు, అది సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రభుత్వాలు సహకరించాలి. న్యాయమూర్తులు స్వేచ్ఛగా తీర్పులు ఇచ్చే సంస్కృతి రావాలి. ఈ దిశగా న్యాయాన్ని నిలబెట్టడానికి యావత్ సమాజం ముందుకు రావాలి.
విచారణ, తీర్పుల్లో జాప్యం వల్లే అసంతృప్తి
ప్రస్తుతం కోర్టుల్లో కేసుల విచారణ, తీర్పులు వెలువడంలో ఆలస్యం జరుగుతోంది. గత 20,30 ఏండ్లుగా అనేక సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్ లోనే ఉంటున్నాయి. ఇప్పటి వరకు కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు 4.40 కోట్ల కేసులు పెండింగ్ లో ఉండటం చూస్తే సత్వర న్యాయం అందని ద్రాక్షగానే ఉన్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సుప్రీంకోర్టు నుంచి కింది స్థాయి కోర్టుల వరకు న్యాయమూర్తుల పోస్టులు వేలాదిగా ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో 1,098 న్యాయమూర్తుల పోస్టుల్లో దాదాపు సగం అంటే 455 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు పెండింగ్ కేసులు, మరోవైపు న్యాయమూర్తుల ఖాళీలు సత్వర న్యాయానికి అడ్డంకులుగా ఉన్నాయి. ఇక కోర్టులపై భారం పడకుండా ఉండేందుకు వేసిన ట్రిబ్యునళ్లలో కూడా ఖాళీలే ఉన్నాయి.
చట్టాల అమలుపై శ్రద్ధ చూపట్లేదు
ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేసినా వాటి అమలుపై శ్రద్ధ చూపడం లేదు. కొన్ని దేశాల్లో ఏ చట్టం చేసినా ఇన్ ఫ్యాక్ట్ అస్సెస్మెంట్ సిస్టం ద్వారా చట్టం అమలుకు శ్రద్ధ చూపుతారు. కానీ మన దేశంలో ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా వాటి అమలుకు ఉన్న కోర్టులు.. ఉన్న సిబ్బందితోనే కాలం గడుపుతున్నారు. అందుకు తగ్గ జడ్జిలు, సిబ్బంది నియామకాలు చేపట్టడంలేదు. పైగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినా అందులోకి ఇతర కేసులు మేడోవర్ ద్వారా పంపడం వల్ల వాటి వెనుక ఉద్దేశం పక్కదారి పడుతున్నది. ఉదాహరణకు ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కోర్టులు ఏర్పాటు చేశారు. అయితే అందులో విచారించే మూడో వంతు కేసులు ఎస్సీ, ఎస్టీ కేసులు కానివే. అలాగే ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటు చేసినా.. అందులో సగం ఇతర కేసులే. అందువల్ల కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నది.
- చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి