- సిట్టింగ్ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి
సియోల్: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. దేశచరిత్రలో సిట్టింగ్ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున వేలాదిమంది అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. వారిని అధ్యక్షుడి భద్రతా దళాలు అడ్డుకున్నాయి. కొంతసేపు ప్రతిష్టంభన తర్వాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయనను అక్కడినుంచి తరలించారు.
గతంలో యోల్‌ను అరెస్టు చేసేందుకు ఓసారి ప్రయత్నించగా.. ఆయన మద్దతుదారుల ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొంది. ఆ అనుభవాన్ని దృష్టిలోఉంచుకొని నేడు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. గతేడాది డిసెంబరులో దక్షిణ కొరియా అధ్యక్షుడు ‘మార్షల్ లా’విధించారు. దీని అమలును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.