- గొర్రెల పంపిణీలో నగదు బదిలీ అమలు చేయండి
- జీఎంపీఎస్ ఆధ్వర్యంలో
- కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
కరీంనగర్ టౌన్, వెలుగు: గొర్రెల పంపిణీ కార్యక్రమంలో నగదు బదిలీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గొర్రెలు, మేకల పెంపకదార్ల సంఘం(జీఎంపీఎస్) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేశ్ మాట్లాడుతూ గొర్రెల పంపిణీ కోసం 2017 నుంచి ఎదురు చూస్తున్నామన్నారు. 75 శాతం సబ్సిడీతో రెండేండ్లలో గొర్రెల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇంతవరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికలు జరిగే చోట మాత్రమే పైలట్ ప్రాజెక్టు కింద గొర్రెల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోందని, మళ్లీ ఎన్నికలు వస్తున్నందున గొర్రెల పంపిణీ గురించి మాట్లాడుతున్నారని.. ఇప్పుడైనా చేస్తారా.. లేదా దాటవేస్తారా అని గందరగోళానికి గురవుతున్నామన్నారు.
75 శాతం సబ్సిడీని నగదు బదిలీ ద్వారా చేస్తే అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు. గొర్రెలనే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంటే నిబంధనలు సడలించాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా కాకుండా సొసైటీ అధ్యక్షుల సంతకంతో అనుమతించాలని, డీడీలు చెల్లించిన వారికి వెంటనే గొర్రెలలు పంపిణీ చేయాలన్నారు. 2017 ఎ, బి లిస్టులో మిస్సయిన వారికి.. ప్రస్తుతం 18 ఏండ్లు నిండిన ప్రతీ గొల్ల కురుమకు సి లిస్ట్ ద్వారా పథకం అమలు చేయాలని కోరారు. తర్వాత ప్రజావాణిలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు పొనగాని మహేశ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల కొమురయ్య, జెట్టి కొమురెల్లి, కాల్వ నర్సయ్య, భూస అయిలయ్య, మీసం రాములు,అఖిలభారత యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మడబోయిన నర్సయ్య యాదవ్, మర్రి ఓదెలు యాదవ్ పాల్గొన్నారు.