- లెబర్ డిపార్ట్మెంట్లో దళారులదే హవా
- పర్సంటేజీలు ఇస్తేనే క్లెయిమ్స్
సూర్యాపేట, వెలుగు: భవన నిర్మాణ పనుల్లో, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే కార్మికుల కోసం ప్రవేశపెట్టిన బీమా స్కీమ్ అమలు అడ్డగోలుగా మారింది. లేబర్ అధికారులు పర్సంటేజీలు దండుకుంటున్నారు. రూల్స్ ప్రకారం అప్లయ్ చేసుకున్న వారిని ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఏవో సాకులు చెప్తూ ఏండ్లు గడుస్తున్నా బీమా డబ్బులు అందకుండా అరిగోస పెడుతున్నారు. దళారులను ఆశ్రయించి ముడుపులు ఇస్తేతప్ప ఫైలు కదలడంలేదని బాధితులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో మెంబర్లు బీమా విషయంలో లేబర్ ఆఫీసర్ల తీరుపై విరుచుకుపడ్డారు. జిల్లా కలెక్టర్ కూడా లేబర్ డిపార్ట్మెంట్పై ఇటీవల సీరియస్ అయ్యారు.
వందల్లో పెండింగ్
కార్మిక శాఖలో పేర్లు నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాల్లో చనిపోతే లేబర్ డిపార్ట్ మెంట్ ఆ కుటుంబాలకు రూ.6.30 లక్షల పరిహారం అందిస్తుంది. చనిపోయిన కార్మికుడి డెత్ సర్టిఫికేట్, లేబర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన కార్డ్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో లేబర్ ఆఫీస్ లో పరిహారం కోసం అప్లయ్ చేసుకోవాలి. వివరాలను పరిశీలించి పరిహారాన్ని వెంటనే కార్మికుడి నామినికి అందిస్తారు.
కానీ, ఇది ఎక్కడా సరిగ్గా అమలు కావడంలేదు. నేరుగా అప్లయ్ చేసుకుంటే ఏడాది, రెండేళ్ల పాటు పెండింగ్లోనే పెడుతున్నారని అంటున్నారు. 2020లో 1,075 అప్లికేషన్లు రాగా ఇంకా 36 పెండింగ్ లోనే ఉన్నాయి. 2021 లో 1,266 అప్లికేషన్లకు గాను 833, 2022లో1,751 అప్లికేషన్లకు గాను25, 2023లో1,321లో 437 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
బాధితుల ఆందోళన
లేబర్ డిపార్ట్మెంట్ లో అంతా దళారుల పెత్తనమే నడుస్తోంది. నేరుగా వచ్చే ఫైలును ఆఫీసర్లు చూడనైనా చూడడంలేదన్న ఆరోపణలున్నాయి. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు చెప్పినా అధికారులు వినడంలేదని అంటున్నారు. నాగారం మండలానికి చెందిన ఒక క్లెయిమ్ ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉండడంతో స్థానిక ఎంపీపీ స్వయంగా చెప్పినా క్లియర్ చేయలేదు. చివరకు మధ్యవర్తి ద్వారా ఫైలు పంపితేనే క్లెయిమ్ఇచ్చారని సదరు ఎంపీపీ జడ్పీ మీటింగ్ లో మండిపడ్డారు.
చాలాకాలంగా తన అప్లికేషన్లు పెండింగ్లో ఉండడంతో బాధితులు మూడు రోజుల కింద లేబర్ ఆఫీసుకు వెళ్లి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. రెండేళ్ల నుంచి తిరుగుతున్నా తన మామకు సంబంధించి క్లైమ్ రాకుండా ఉద్యోగులు ఆపుతున్నారని ఆరోపిస్తూ ఒక మహిళ పెట్రోల్ బాటిల్ తో వచ్చి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న పోలీసులు గమనించడంతో ప్రమాదం తప్పింది. ప్రతి సోమవారం ప్రజావాణిలో కూడా బీమా క్లయిమ్లకు సంబంధించి ఫిర్యాదులు వస్తుండడంతో జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు కూడా లేబర్ అధికారి పై సీరియస్ అయ్యారు.
మూడేళ్ల నుంచి తిరుగుతున్నా..
మా నాన్న 2021 లో పక్షవాతంతో చనిపోయారు. 2021 నవంబర్ లో బీమా కోసం అప్లయ్ చేసుకుంటే ఇప్పటి వరకు రాలేదు. మా తరువాత అప్లయ్ చేసుకున్నా వారికి బీమా అందింది. అధికారులు వెంటనే బీమా అందేలా చూడాలి.
కాసోజు నవీన్, బాలారం తండా, సూర్యాపేట
ఆధార్ అప్ డేట్ తో ఇబ్బందులు
ఆధార్ అప్ డేట్ కాకపోవడంతో క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయి. క్లెయిమ్ ల కోసం మధ్యవర్తుల దగ్గరకు వెళ్లవద్దని సూచిస్తున్నాం. బీమా, పరిహారం కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ఆఫీసులో కూడా బోర్డు పెట్టాం
మంజుల, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, సూర్యాపేట జిల్లా