గుడ్ న్యూస్: జనవరి 26 నుంచి తెలంగాణలో 4 కొత్త పథకాలు అమలు

ఖమ్మం: 2025, జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 కొత్త పథకాలను ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నాలుగు పథకాల అమలు కోసం  ప్రభుత్వం దాదాపు 45 వేల కోట్లకు పైగా ఖర్చు చేయబోతుందని చెప్పారు. సోమవారం (జనవరి 13) రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల జారీ కార్యక్రమాల అమలుపై  ఖమ్మం కలెక్టరేట్‎లోఉప ముఖ్యమంత్రి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీశ్ వి. పాటిల్‎లతో కలిసి సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు 22 వేల 500 కోట్లు, రైతు భరోసాకు18 వేల కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీ మేర కట్టుబడి అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి పథకంపై సంపూర్ణంగా చర్చించిన తర్వాతే మార్గదర్శకాలు జారీ చేశామని స్పష్టం చేశారు. రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు 12 వేల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఉండి భూమి లేని వ్యవసాయ కుటుంబాలు 20 రోజులు ఉపాధి హామీ పని చేసినట్లయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు అవుతుందని క్లారిటీ ఇచ్చారు. 

ALSO READ | రేషన్ కార్డులోని ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఫ్రీ: మంత్రి ఉత్తమ్

ప్రతి పథకానికి లబ్దిదారులను గ్రామ సభ పెట్టి పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ కమిటీల సభ్యులను భాగస్వామ్యం చేయాలని.. ప్రతి గ్రామ సభలో కార్యక్రమం పెట్టి ప్రభుత్వ లక్ష్యాలు తెలియజేయాలని పేర్కొన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి చేత జాబితా ఆమోదింపచేసుకొని మంజూరు ప్రోసిడింగ్స్ అందజేయాలని తెలిపారు. ఎంత మంది రైతులకు ఎంత రుణమాఫీ జరిగింది, ఎంత మంది రైతు భరోసా వస్తుంది, బోనస్ వచ్చిన రైతుల వివరాలు తెలియజేస్తు గ్రామాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత  యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల నిర్మాణం, మెస్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీల పెంపు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య శ్రీ,  200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన మాట మేరకు 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని.. సన్న రకం ధాన్యం క్వింటాల్‎కు 500 రూపాయలు బోనస్ అందించామని తెలిపారు.