- పీఆర్ యాక్ట్ ప్రకారం పాత రిజర్వేషన్లే అంటున్న ఆఫీసర్లు
- అయోమయంలో నాయకులు, ప్రజలు
- మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఇనుగుర్తి, సీరోలు మండలాల ఏర్పాటు
మహబూబాబాద్, వెలుగు : పరిపాలనా సౌలభ్యం, ప్రజల డిమాండ్ మేరకు గత ప్రభుత్వం వివిధ దశల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గతంలో మండల పరిషత్ ఎన్నికలు ముగిసిన తర్వాత మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తి, సీరోలు మండలాలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో త్వరలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇందుకోసం ఇప్పటికే ఆఫీసర్లు ఓటర్ లిస్ట్, పోలింగ్ బూత్‌ల వివరాలు, పోలింగ్ సిబ్బంది వివరాలతో లిస్ట్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు తరచూ రిజర్వేషన్లు మార్చకుండా, పదేళ్ల పాటు ఒకే రిజర్వేషన్ కొనసాగేలా గతంలో పంచాయతీరాజ్ చట్టం చేశారు.
ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించిన మండలాల్లో ఎన్నికలు యథావిధిగా కొనసాగనుండగా కొత్తగా ఏర్పడిన మండలాలపైనే సందిగ్ధం నెలకొంది. ఆయా మండల పరిషత్‌లకు ఎలాంటి రిజర్వేషన్ వర్తింపజేస్తారన్న విషయంపై జిల్లా ఆఫీసర్లు సైతం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
చట్ట సవరణ చేయాల్సిందే..
రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పంచాయతీ రాజ్ చట్టాన్ని మార్చే అవకాశం ఉందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. అదే నిజమైతే పంచాయతీరాజ్ ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. గతంలో పంచాయతీ ఎన్నికలు జనవరిలోనే జరగగా ఆ తర్వాత రెండు నెలల్లోనే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించారు.
దీంతో వాటికి జూన్ వరకు కాలపరిమితి ఉంది. ఇప్పడు కొత్తగా రిజర్వేషన్ ప్యాటర్న్ మార్చాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేస్తే ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.
రిజర్వేషన్లపై స్పష్టతను ఇవ్వాలి
కొత్త మండలాలను ఏర్పాటైన తర్వాత రెవెన్యూ, పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతోనే చేతులు దులుపుకుంటు న్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు సైతం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. అలా అయితే కొత్త మండలాలకు ప్రాధాన్యం ఉంటుంది. రిజర్వేషన్ల ఖరారు కోసం రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలి.
- ఒర్రె కవిత, ఇనుగుర్తి
గైడ్‌లైన్స్ అందాల్సి ఉంది
ప్రస్తుతం కొనసాగుతున్న మండల పరిషత్‌లకు జూన్ వరకు గడువు ఉంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వివరాల సేకరణ కొనసాగుతోంది. కొత్త మండలాలకు సంబంధించి ఆయా మండలాల పరిధిలో ఎంపీటీసీల వివరాల ప్రకారం రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే ప్రక్రియను ప్రారంభిస్తాం.
- రమాదేవి, జడ్పీ సీఈవో, మహబూబాబాద్