కేసీఆర్​ దోచుకున్న సొమ్ముతోనే .. ఆరు గ్యారంటీల అమలు: రాహుల్

  • బీఆర్​ఎస్​ సర్కార్​ను కూకటి వేళ్లతో పెకిలిస్తం: రాహుల్
  • ధరణితో పేదల భూములను కల్వకుంట్ల ఫ్యామిలీ​ గుంజుకుంది
  • కేసీఆర్​ చదువుకున్న స్కూల్​, కాలేజీ కూడా కాంగ్రెస్సే కట్టింది
  • వరంగల్​, నర్సంపేట, మణుగూరు కార్నర్​ మీటింగ్స్​లో ప్రసంగం

వరంగల్‍/నర్సంపేట/భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు: కేసీఆర్ దోచుకున్న ప్రతి పైసాను రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే కక్కిస్తామని కాంగ్రెస్​ ముఖ్యనేత రాహుల్​ గాంధీ అన్నారు. ఆ సొమ్ముతోనే  ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ తుఫాన్​ నడుస్తున్నదనే విషయం కేసీఆర్​కు అర్థమైందని, అతిపెద్ద తుఫాన్​ముందుందని అన్నారు. ‘‘తెలంగాణతో మాది రక్త సంబంధం.. కేసీఆర్​ది రాజకీయ సంబంధం. ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. రాష్ట్ర సంపద మొత్తం ఒకే కుటుంబానికి చేరింది” అని తెలిపారు.

శుక్రవారం వరంగల్​ జిల్లా నర్సంపేట, వరంగల్​ సిటీలో, కొత్తగూడెం జిల్లా మణుగూరులో కార్నర్ ​మీటింగ్స్​లో రాహుల్​ గాంధీ మాట్లాడారు. బీఆర్ఎస్​ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు పరాకాష్ట అని మండిపడ్డారు. ‘‘ప్రాజెక్టులో పగుళ్లు కనిపిస్తున్నయ్‍. గోడలు పగిలిపోతున్నయ్. పిల్లర్లు కూలిపోతున్నయ్‍. ఎందుకంటే.. అక్కడ అవినీతి రాజ్యమేలుతున్నది కాబట్టి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కేసీఆర్‍ ఫ్యామిలీ రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంది” అని ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే కేసీఆర్ అవినీతి సొమ్మును బయటకు తీసి, ప్రజలకు ఇస్తామని చెప్పారు. 

ధరణితో 20 లక్షల మందికి గోస

ధరణి పోర్టల్‍ తీసుకొచ్చి పేదల భూములను కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్‍ఎస్​లీడర్లు అక్రమంగా వాళ్ల వాళ్ల పేర్ల మీద రాయించుకున్నారని, ధరణితో రాష్ట్రంలోని 20 లక్షల మంది నష్టపోయారని రాహుల్​ గాంధీ అన్నారు. ‘‘కాంగ్రెస్‍ ప్రభుత్వం ఏం చేసిందని పదేపదే కేసీఆర్​ అడుగుతున్నడు. ఆయన చదువుకున్న స్కూల్‍, కాలేజీ, యూనివర్సిటీని కూడా కట్టింది కాంగ్రెస్​ ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలి” అని చెప్పారు.

బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కేసీఆర్​ బాటలోనే నడుస్తున్నారని, దళితబంధు లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారని రాహుల్​ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు టైమ్​కు జీతాలు కూడా సర్కారు ఇవ్వడం లేదు. కేసీఆర్​ఎన్ని డబుల్‍ బెడ్రూం​ ఇండ్లు కట్టిండో.. ఎంతమందికి ఉచితంగా ఎరువులు పంపిణీ చేసిండో చెప్పాలి” అని నిలదీశారు.

ఎంఐఎం లీడర్లకు ఒక్కోచోట ఒక్కో రేటు..

బీజేపీ, బీఆర్‍ఎస్​కు ఎంఐఎం సహకరిస్తున్నదని రాహుల్ ఆరోపించారు. ‘‘మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్‍, గుజరాత్‍ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచేలా..  కాంగ్రెస్​ అభ్యర్థులపై ఎంఐఎం తమ క్యాండేట్లను పోటీలో పెట్టింది. బీజేపీ వద్ద పైసలు తీసుకుని.. కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఎంఐఎం లీడర్లు పనిచేస్తరు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు తీసుకుంటరు” అని దుయ్యబట్టారు. కేసీఆర్ వెనుక మోదీ ఉన్నారని ఆరోపించారు. ‘‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీఆర్‍ఎస్‍ పార్టీని, కేసీఆర్‍ను.. పార్లమెంట్​ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కారును కూకటి వేళ్లతో పెకిలించడం మా ప్రధాన లక్ష్యం” అని రాహుల్​ చెప్పారు. 

బీజేపీ సైగ చేస్తే.. బీఆర్‍ఎస్ ​ఎంపీలు సైలెంట్

బీజేపీ, బీఆర్‍ఎస్ వేర్వేరు కాదని రాహుల్​గాంధీ ఆరోపించారు. ‘‘బీజేపీ, బీఆర్​ఎస్​ నేతలు ఢిల్లీలో, తెలంగాణలో ఒకరికొకరు సాయం చేసుకుంటున్నరు. పార్లమెంట్‍లో వాళ్ల బంధాన్ని నేను స్వయంగా చూసిన. బీఆర్​ఎస్​ ఎంపీలను బీజేపీ ఎంపీలు కండ్లతో కట్టడి చేసేవాళ్లు.  పెద్ద నోట్ల రద్దు, రైతు బిల్లు వంటి ప్రధాన బిల్లులు సభలోకి వచ్చాక బీజేపీ, ప్రధాని మోదీ టీమ్​సైగలు చేయగానే బీఆర్‍ఎస్​ఎంపీలు ఏమీ మాట్లాడేవాళ్లు కాదు” అని అన్నారు. ఆ రెండు పార్టీలపై తమ పోరాటం ఆగదని చెప్పారు. దేశానికి ఆర్‍ఎస్‍ఎస్‍, బీజేపీతో పెద్ద ప్రమాదం ఉందని, విద్వేషాలు రెచ్చగొట్టడం వాటి నైజమని దుయ్యబట్టారు. ప్రేమ విత్తనాలు నాటేందుకు కాంగ్రెస్​ ప్రయత్నిస్తున్నదని, అది కాంగ్రెస్​డీఎన్‍ఏలోనే ఉందని ఆయన అన్నారు.