మహిళా బిల్లు కంటే ముందే బీసీ బిల్లు తేవాలె

చట్టసభలైన అసెంబ్లీలు, లోకసభకు వెళ్లేందుకు ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా పద్ధతిలో రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. ముస్లింలు కూడా జనాభా దామాషాలోనే ఎన్నిక అవుతున్నారు. ఇక మిగిలింది బీసీలే. వీరు జనాభాలో మెజారిటీ అయినా..  రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేక, అగ్రకుల పార్టీలకు ఓట్లువేసే యంత్రాలుగా మారి పాలితులుగానే ఉంటున్నారు. లోకసభ, రాజ్యసభ, అసెంబ్లీలకు ఎన్నికవుతున్న మహిళల్లో 99 శాతం మహిళలు అగ్రకులాలకు చెందిన వారే ఉంటున్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా.. మహిళలకు కల్పిస్తే ఉన్నత వర్గాల మహిళలే చట్టసభలకు వెళ్తారు. వెనకబడిన తరగతులకు చెందిన మహిళలు ఇంకా వెనకబడే ఉంటారు. అందుకే ముందు బీసీ బిల్లు.. తర్వాతే మహిళా బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది.

ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఇండియాలో కుల వివక్షత కొనసాగుతూనే ఉంది. దాంతో పాటు లింగ వివక్ష కూడా ఉంది. రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల పేరుతోని, శాసన సభ్యుడిగా లేదా లోక్​సభ సభ్యుడిగా పోటీ చేయాలంటే కులం, డబ్బు ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం, తర్వాత నష్టపోయింది, నష్టపోతున్నది బీసీ కులాలే. దేశంలో చాలా రాజకీయ పార్టీలు అగ్రకుల పునాదులపై ఏర్పడి ప్రజాస్వామ్యం ముసుగులో కుల స్వామ్యాన్ని సుస్థిరపరిచాయి. ఆ కోవలోకి చెందినవే నేటి కొన్ని ప్రజా సంఘాలుగా చెప్పవచ్చు. 70 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం లోక్​సభలో 78 మంది(14.9 శాతం), రాజ్యసభలో 26 మంది(8.9 శాతం) అని, దేశంలో మెజారిటీ ప్రజలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రాతినిధ్యం కూడా తక్కువ ఉందని ఇటీవల ఓ వ్యాసంలో రాశారు. అసలు చట్టసభలైన అసెంబ్లీలు, లోక్​సభలో ఎస్సీ, ఎస్టీల వారికి జనాభా దామాషా పద్ధతిలో రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. అదే విధంగా ప్రధాన మైనారిటీ వర్గమైన ముస్లింలు, వారి జనాభా దామాషాలో ఎన్నిక అవుతున్నారు. ఇక మిగిలింది బీసీలే వీరు జనాభాలో మెజారిటీ అయినప్పటికీ, వీరు
కులాలుగా విడిపోయి, రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేక, అగ్రకుల పార్టీలకు ఓట్లువేసే యంత్రాలుగా మారి పాలితులుగానే ఉంటున్నారు. 

అయితే లోక్​సభ, రాజ్యసభ, అసెంబ్లీలకు ఎన్నికైన మహిళల్లో 99 శాతం మహిళలు కూడా అగ్రకులాలకు చెందిన వారే ఉండటం గమనార్హం. తెలంగాణ శాసనసభలో ఒక్క బీసీ మహిళ లేరు. తెలంగాణ నుంచి లోక్​సభలో  కూడా ఒక్కరూ బీసీ మహిళ లేకపోవడం బాధాకరం. మొదటి సారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు 1996లో పార్లమెంట్ ముందుకు వచ్చినప్పటికీ, 2010లో రాజ్యసభ ఆమోదం పొందిన తరువాత దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చ జరిగింది. అనేక రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు బీసీ మహిళలకు రిజర్వేషన్లు లేకుండా ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించారు. అదే సమయంలో మహిళల పేరు మీద అగ్రకుల మహిళలకు చట్టసభల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, దేశ వ్యాప్తంగా బీసీ మహిళలు ఆ బిల్లును వ్యతిరేకించాయి. బీసీ ఉద్యమాలను గమనించిన ప్రధాన రాజకీయ పార్టీలైన సమాజ్ వాది, బహుజన సమాజ్ వాది, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్(యూ), డీఎంకే, ఏఐడీఎంకే  తదితర పార్టీలు మహిళా బిల్లులో బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించే వరకు ఆ బిల్లును ఆమోదించవద్దని లోక్​సభలో ఆందోళన చేశాయి. అందుకే మహిళా బిల్లు లోక్​సభలో పెండింగులో ఉంది. అగ్ర కుల నాయకత్వంలో ఏర్పడిన రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, మహిళా సంఘాలకు దేశ మహిళా జనాభాలో 50శాతానికి పైగా ఉన్న బీసీ మహిళల హక్కులు కనిపించకపోవడం దారుణం. 

సమాంతరంగా లెక్క గట్టాలె..
కేంద్ర ప్రభుత్వం1992/1993లలో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు జనాభా దామాషా పద్ధతిలో మహిళలకు 33.33 శాతం, వెనుకబడిన వర్గాల పేరుమీద బీసీ కులాలకు రిజర్వేషన్ కల్పించింది. ఇందులో దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలకు మహిళా కోటాలో ఎన్నిక అవుతున్న ప్రజాప్రతినిధుల్లో 90 శాతానికి పైగా మహిళా ప్రతినిధులు స్వేచ్ఛగా పని చేయడం లేదని, వారి భర్తలపై ఆధారపడి
పని చేస్తున్నారని అనేక స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన సర్వేలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు వెల్లడించిన సుప్రీం కోర్టు తీర్పులు, భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి వర్టికల్ లేదా సామాజిక రిజర్వేషన్లు( ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వస్తాయి), రెండు హారిజంటల్ లేదా ప్రత్యేక రిజర్వేషన్లు. ఇందులో మహిళా రిజర్వేషన్లు, దివ్యాంగుల రిజర్వేషన్లు వస్తాయి. ఉదాహరణకు స్థానిక సంస్థల్లో జనరల్ స్థానాలు 50 ఉంటే,  ఇందులో మహిళలకు12(33.33 శాతం) సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా షెడ్యూల్డు కులాలకు15 స్థానాలు ఉంటే ఇందులో షెడ్యూల్ కులాలకు చెందిన మహిళలకు5(33.33 శాతం) సీట్లను కేటాయిస్తారు. జనరల్ స్థానాలైనా, షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన తరగతులకు కేటాయించిన స్థానాలైనా మహిళా కోటాను  సమాంతరంగా లెక్కగట్టి ప్రత్యేక రిజర్వేషన్ల పద్ధతిలో అమలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల చట్టసభల్లో ముందుగా బీసీ కులాలకు జనాభా దామాషా పద్ధతిలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడే దేశంలోని అన్ని కులాల చెందిన మహిళలకు చట్టసభల్లో వాటా దక్కుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో ఆమోదం పొంది, లోక్​సభ దగ్గర ఆగిన  మహిళా బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

20 శాతం మించడం లేదు
దేశ రాజకీయ చరిత్రను, చట్టసభల్లో వివిధ కులాలు, వర్గాల ప్రాతినిధ్యాన్ని గమనిస్తే  అసెంబ్లీలు, లోకసభలో బీసీ కులాల ప్రాతినిధ్యం 20 శాతానికి మించడం లేదు. అగ్ర కులాల వారి ప్రాతినిధ్యం 50 శాతానికి మించి ఉంది. అగ్రకులాలకు చెందిన మహిళలు 50 శాతానికి మించి ఎన్నిక అవుతున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మాన్య కాన్షీరామ్ ల ప్రకారం.. రాజ్యాధికారం అందుకోలేని జాతులు అంతరిస్తాయి. ప్రస్తుతం ఇదే సూత్రాన్ని బీసీ కులాలకు నూటికి నూరు శాతం అన్వయించుకోవచ్చు. దేశంలో సుమారు 2,643 కులాలను వెనకబడిన తరగతులుగా గుర్తించారు. ఇందులో 2500కు పైగా కులాలు నేటికీ చట్టసభల్లో అడుగుపెట్టలేదు. బీసీ కులాల్లోని పురుషులకే రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదంటే, ఇక బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఉంటే తప్ప ప్రాతినిధ్యం లభించే అవకాశమే లేదు. పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారం కులాంతర వివాహాలతో, కుల నిర్మూలన జరిగి తద్వారా సమానత్వం ఏర్పడుతుంది. వేల సంవత్సరాలుగా కుల వివక్షతను అనుభవించి, విద్యకు దూరమై, రాజ్యాంగ రచనలో అన్యాయానికి గురైన బీసీ కులాలకు నేడు చట్టసభల్లో రిజర్వేషన్లు
కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- కోడెపాక కుమారస్వామి 
రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం