ఆయిల్​ పామ్​కే ఇంపార్టెన్స్​.. ఆరుతడి రైతుల అసంతృప్తి

పెద్దపల్లి, వెలుగు: ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం సబ్సిడీ డ్రిప్​ పరికరాలను మాత్రం  అందించడం లేదు.  కేవలం ఆయిల్ పామ్​ పంటలకు మాత్రమే సబ్సిడీ డ్రిప్​ పరికరాలను అందిస్తోంది. దీంతో మిర్చి, మినుములు, నువ్వులు, పల్లీలు, పండ్లు, కూరగాయల లాంటి ఆరుతడి పంటలను పండించేందుకు రైతులు ఇష్టపడటం లేదు.   డ్రిప్​ ఇరిగేషన్​ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు.  గత 15 ఏండ్ల నుంచి ఆయా ప్రభుత్వాలు మైక్రో ఇరిగేషన్​ శాఖ ద్వారా డ్రిప్​ స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందజేసేవి.  ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​ హర్టికల్చర్​లో విలీనం కావడంతో ఆ శాఖ ద్వారానే డ్రిప్​ పరికరాలు ఇస్తున్నారు. ఆయిల్​ పామ్​ తోటలపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించడంతో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు.  గతంలో మిర్చి, మినుములు, నువ్వులు, పల్లీలు లాంటి ఇతర ఆరుతడి పంటలు సాగు చేసిన వారు కూడా ఆయిల్​ పామ్​ సాగు వైపు వెళ్తుండటంతో రానున్న రోజుల్లో తృణ ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం ఉంది. 

ఆరుతడి రైతుల అసంతృప్తి

నూనెల వాడకం పెరిగిపోవడంతో విదేశాల నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్​ ఆయిల్ పామ్​ సాగుకు ఇంపార్టెన్స్​ ఇస్తూ రైతులకు డ్రిప్​ ఇరిగేషన్​పై శిక్షణ ఇచ్చింది.  ఈ క్రమంలో రైతులకు డ్రిప్​ స్ప్రింక్లర్లను సబ్సిడీపై ఇవ్వడానికి నిర్ణయించింది. గతంలో కూడా ఆరుతడి పంటలు వేసే రైతులను ప్రోత్సహిస్తూ స్ప్రింక్లర్లను సబ్సిడీ పై అందజేశారు. కానీ ప్రస్తుతం హార్టికల్చర్​ డిపార్ట్​మెంట్​ ఆయిల్​పామ్​ పంటకు మాత్రమే సబ్సిడీ ఇస్తుండటంతో ఇతర ఆరుతడి పంటల సాగు చేసే రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో వరి, పత్తికే అలవాటు పడ్డ రైతులు, ఈ మధ్య కాలంలో  తృణ ధాన్యాల పంటలు వేస్తున్నారు.  రైతుల ఆసక్తిని బట్టి ప్రభుత్వం ఆయా పంటలకు సబ్సిడీ అందించాలని కోరుతున్నారు.

డ్రిప్​తో నీటి వేస్టేజ్ ఉండదు...

డ్రిప్​ ఇరిగేషన్​ వల్ల నీటి వేస్టేజ్​ ఉండదు.  మొక్కలకు సరిపోయేంత నీరు అందడంతో పంటలు నాణ్యతగా ఉంటాయి.  జిల్లాలో నీరు సమృద్ధిగా దొరుకుతుండటంతో వరి, మొక్కజొన్న, పత్తికే ప్రాధాన్యతనిచ్చారు.  డ్రిప్​ ఇరిగేషన్​పై పెద్దగా ఆసక్తి చూపే వారు కాదు.  ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించడంతో ఆయిల్ పామ్​ సాగు వైపు దృష్టి మరలుస్తున్నారు.  దీంతో మిర్చితో పాటు ఇతర తృణ ధాన్యాల దిగుబడి పూర్తిగా పడిపోయింది. 

పదివేల ఎకరాల్లో తృణ ధాన్యాల సాగు.. 

పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం10  వేల ఎకరాల్లో మిర్చితో పాటు తృణధాన్యాలు సాగవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి నుంచి ఏటా ఆయిల్​ పామ్​ 5000 ఎకరాల్లో సాగు చేయాలని 
ప్రణాళికలు రూపొందించారు.  ప్రస్తుత సంవత్సరం 2600 ఎకరాల్లో ఆయిల్​ పామ్​ సాగు ప్రారంభమైంది. 1211 ఎకరాల్లో ఇప్పటికే రైతులు ఈ పంట వేశారు.  ఇందులో 1207 ఎకరాల్లో డ్రిప్​ సాగుతో ఈ పంటను పండిస్తున్నారు.  రైతులు డ్రిప్​ పరికరాలు పొందిన తర్వాతనే  ఆయిల్​ పామ్​ మొక్కలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఆరుతడి పంటలన్నిటికీ డ్రిప్​ సబ్సిడీ ఇయ్యాలే

ఆరుతడి పంటలన్నిటికీ డ్రిప్​ స్ప్రింక్లర్లు సబ్సిడీ మీద అందియ్యాలే. ఇప్పుడు ఆయిల్​ పామ్​  తోటలకు డ్రిప్​ సబ్సిడీ ఇస్తున్నారు.  దీని వల్ల నీటి వృథా ఉండదు.  మిర్చి, మినుములు, నువ్వులు, పండ్ల తోటలు, ఇతర ఆరుతడి పంటలకు కూడా డ్రిప్ సబ్సిడీ అందిస్తే బాగుంటది. దేవరనేని లింగారావు, ముత్తారం, పెద్దపల్లి జిల్లా