కేయూలో ఫైళ్లు మాయం!

  • కీలక పత్రాలు గుట్టుచప్పుడు కాకుండా తరలించారనే ఆరోపణలు
  • రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేసిన అకుట్​ నేతలు
  • వీసీ రమేశ్​ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించిన స్టూడెంట్​ లీడర్స్​
  • కాకతీయ యూనివర్సిటీలో గందరగోళం

హనుమకొండ, వెలుగు : కేయూ వైస్​ చాన్స్ లర్​ ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్​ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో.. వర్సిటీలోని కీలక ఫైళ్లు మాయమైనట్లు తెలుస్తోంది. కేయూలో అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న వీసీ రమేశ్​పై విజిలెన్స్​ ఎంక్వైరీకి ఆదేశించింది. విచారణలో కీలకమైన ఫైళ్లను మాయం చేశారనే ప్రచారం జరుగుతోంది. పదవీకాలం ముగింపునకు ఒక్కరోజు ముందు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో క్యాంపస్ లోని వీసీ లాడ్జ్​ నుంచి ఫైళ్ల సంచులను కారులో బయటకు తరలించారనే ఆరోపణలున్నాయి.

దీంతో అసోసియేషన్​ ఆఫ్​ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్​) జనరల్​ సెక్రటరీ మామిడాల ఇస్తారి, ప్రొఫెసర్లు తౌటం శ్రీనివాస్,  బ్రహ్మేశ్వరి, జాయింట్​ సెక్రటరీ కిశోర్ కుమార్, రమేశ్ కుమార్​ మంగళవారం వర్సిటీ అడ్మినిస్ట్రేషన్​ బిల్డింగ్​ వద్ద రిజిస్ట్రార్​ మల్లారెడ్డిని నిలదీశారు. ఫైళ్లు మాయం విషయమై ఆయనతో వాగ్వాదానికి దిగారు. కాగా సొంత పుస్తకాలు, మెమొంటోలు, వ్యక్తిగత సామాగ్రి తీసుకెళ్లి ఉండొచ్చని రిజిస్ట్రార్​ సమాధానం ఇవ్వగా, ప్రైవేటు వ్యక్తులకు వీసీ వ్యక్తిగత ఫైళ్లు, సామాన్లు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది.

అన్నీ వివాదాలే!

కాకతీయ యూనివర్సిటీ వీసీగా తాటికొండ రమేశ్​ పదవీకాలం మంగళవారంతో ముగియగా.. ఈ మూడేండ్లలో అనేక సార్లు విద్యార్థులు, ఉద్యోగుల ఆందోళనలతో వర్సిటీ అట్టుడికింది. వీసీగా ఆయన ఎంట్రీ నుంచే వివాదాలు మొదలవగా, పదవీకాలం ముగిసేంత వరకు ఆరోపణలు రావడం గమనార్హం. లాస్ట్​ వర్కింగ్  రోజు యూనివర్సిటీ నుంచి కొన్ని ఫైళ్లు మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తగా, వర్సిటీలో గందరగోళం నెలకొంది. కాగా వీసీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వర్సిటీ స్టాఫ్​ తో పాటు  స్టూడెంట్లను తిప్పలు పెట్టారనే ఆరోపణలున్నాయి.

విద్యార్థులపై ఫీజుల భారం మోపడం, హాస్టల్స్​ కేటాయింపులో ఇబ్బంది పెట్టడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. అడ్జాంట్​ ఫ్యాకల్టీ నియామకాలు, పీహెచ్​డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రాగా, ఆ సమయంలో విద్యార్థులను కొట్టించడం, కేసులు పెట్టడం విమర్శలకు దారితీసింది. వర్సిటీ భూములు ఆక్రమించిన వారికి వత్తాసు పలకడం, కేయూకు కాంపౌండ్​ కట్టేందుకు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేసినా.. చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అధికారులు కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తరచూ వివాదాలు తలెత్తగా, ఆయన పదవీకాలం ముగియడంతో ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీసీ దిష్టిబొమ్మతో శవయాత్ర..

వీసీగా ప్రొఫెసర్​ రమేశ్​ పదవీకాలం ముగియడంతో ఆయన దిష్టిబొమ్మతో కేయూ విద్యార్థి సంఘాల నేతలు మంగళవారం మధ్యాహ్నం శవయాత్ర నిర్వహించారు. మూడేండ్ల పాలనలో వర్సిటీని పదేండ్లు వెనక్కి తీసుకెళ్లి నాశనం చేశారని, వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'తాటికొండ.. అవినీతి అనకొండ' అనే ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో పాటు  ఇక వీసీ పీడ విరగడైందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ వీసీ మూడేండ్ల పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. అనర్హులకు ప్రమోషన్లు ఇచ్చారని, కొందరు సిబ్బందిని పగబట్టి బదిలీ చేశారని ఆరోపించారు.

పీహెచ్​డీ అక్రమాలపై ఆందోళనలు చేపడితే.. సరైన విచారణ జరిపించకుండా విద్యార్థులపై కేసులు పెట్టి కొట్టించారని మండిపడ్డారు. వీసీ రమేశ్​పై విజిలెన్స్​ ఎంక్వైరీ సజావుగా నిర్వహించేందుకు, ఆయన అనుచరులను ట్రాన్స్​ఫర్  చేయాలని లేదంటే సెలవుపై పంపిచాలన్నారు. వర్సిటీకి చెందిన రూ.కోట్ల విలువైన భూములను ఏఆర్​ అశోక్​ బాబు కబ్జా చేస్తే కనీస చర్యలు తీసుకోకుండా వెనకేసుకొచ్చారని, హాస్టల్​ వ్యవహారాల్లో కూడా కుంభకోణం జరిగిందని ఆరోపించారు. విద్యార్థి సంఘాల నేతలు పాషా, రాంబాబు, రాజేశ్, శంకర్​ పాల్గొన్నారు.

ఫైళ్ల మిస్సింగ్ పై రిజిస్ట్రార్ కు ఫిర్యాదు

విజిలెన్స్​ ఎంక్వైరీలో కీలకం కానున్న ఫైళ్లనే యూనివర్సిటీ నుంచి బయటకు తరలించారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో డీన్ ల వద్ద ఉన్న  పీహెచ్​డీ పార్ట్ టైం, ఫుల్ టైమ్ అడ్మిషన్లకు సంబంధించిన ఫైళ్లు, విద్యార్థులకు వచ్చిన మార్కుల లిస్ట్, కంప్యూటర్ల కొనుగోలుకు సంబంధించిన అప్రూవల్ ఆర్డర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ఫైళ్లపై పాత తేదీలతో సంతకాలు పెట్టే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాకుండా న్యాక్ కు సంబంధించిన తప్పుడు బిల్లులను సరి చేయడం, న్యాక్ కు సంబంధించిన పనులను ఆ బడ్జెట్​తో కాకుండా

రెగ్యులర్ బడ్జెట్ నుంచి తీసుకున్న అప్రూవల్  ఆర్డర్లను ఫ్యాబ్రికేషన్ చేసే అవకాశం ఉందని అకుట్​ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా అకుట్​ కార్యదర్శి ఇస్తారి మాట్లాడుతూ వీసీ రమేశ్​ నాలుగు రోజుల నుంచి కేయూకు రావడం లేదని, విజిలెన్స్ విచారణలో కీలకమైన ఫైళ్లను ఫ్యాబ్రికేషన్​ చేయడానికి వీసీ లాడ్జి నుంచి వాటిని ఇంటికి తరలించారని ఆరోపించారు. వీసీ లాడ్జి సీసీ ఫుటేజీని పరిశీలిస్తే ఫైళ్లు మాయం చేసిన విషయం బయటపడుతుందని తెలిపారు.

ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. కేయూ పోలీస్ స్టేషన్​లో కూడా ఫిర్యాదు చేస్తామని ఇస్తారి చెప్పారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో మరికొన్ని యూనివర్సిటీల నుంచి కూడా ఇలాగే ఫైల్స్​ మాయం చేశారనే ఆరోపణలు రావడం గమనార్హం.