హైదరాబాద్: రాష్ట్ర రాష్ట్రధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతోన్న వర్షం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. కంటిన్యూగా వర్షం పడుతుండటంతో నగరంలోని డ్రైనేజీలు, నాళాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు రోడ్లు వరద నీటితో కాలువలను తలిపిస్తున్నాయి. మరి కొన్ని ప్రాంతాలు వరద నీరు భారీగా చేరకోవడంతో జలదిగ్భందం అయ్యాయి. నాన్ స్టాప్‌గా వర్షం పడుతూనే ఉండటంతో దాదాపు కోటికి పైగా జనభా ఉన్న హైదరాబాద్ నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇంట్లో నుండి కాలు బయటపెట్టలేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వర్షాలపై బల్దియా అలర్ట్ అయ్యింది.
Also Read:-హైదరాబాద్ లో ఘోరం
సిటీలో చాలా ఏరియాలకు మరో రెండు రోజుల పాటు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జోనల్ కమిషనర్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆమ్రపాలి కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా ఫీల్డ్‌లోనే ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల కురుస్తుండటంతో ఆఫీసర్లు, క్షేత స్థాయి సిబ్బంది సెలవులు రద్దు చేసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు డ్రైనేజీలు, నాళాల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపారు.