దేశంలో వరల్డ్ కప్ 2023 సందడి మొదలైపోయింది. ఈ మెగా టోర్నీ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే భారత క్రికెట్ అభిమానులను ఆనందపరిచే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదే కోహ్లీ పుట్టిన రోజు. నవంబర్ 5న కోహ్లీ బర్త్ డే. అదే రోజు టీమిండియా.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆ మ్యాచులో కోహ్లీ ఏ మేరకు రాణిస్తాడన్నది ఇప్పుడు అందరిముందున్న ప్రశ్న.
ప్రతీకారం తీర్చుకునే సమయం
2011 ప్రపంచకప్‌లో భారత జట్టు.. దక్షిణాఫ్రికా చేతిలో మాత్రమే ఓటమిపాలైంది. ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోహ్లీ బర్త్ డే రూపంలో ఇండియా ముందుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే దక్షిణాఫ్రికా జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఐపీఎల్ ఆడిన అనుభవం వారికి పనికొస్తుందన్న విషయం మరవకూడదు.
60,000 మంది నడుమ బర్త్ డే జోష్
కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్ కనుక దాదాపు 60,000 మంది అభిమానులు హాజరవుతారు. అందునూ కోహ్లీ బర్త్ డే కనుక జోష్ మరో రేంజులో ఉంటుంది. ఈ మ్యాచులో కోహ్లీ సెంచరీ చేయాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. మాజీ సారథికి ఒత్తిడి కొత్తేమి కాదు కనుక పరుగుల వరద పారించడం ఖాయమన్న మాటలు వినపడుతున్నాయి.
అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుండగా.. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. ఇక టోర్నీలో కీలక మ్యాచ్ దాయాదుల పోరు(ఇండియా vs పాకిస్తాన్) అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగనుంది.