ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. 2024, నవంబర్ 15న వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీలో రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రులు డిస్కస్ చేశారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పలు సంస్థలకు చేసిన భూ కేటాయింపులతో పాటు కొత్తగా సంస్థలకు భూములను ఇవ్వడం వంటి అంశాలపై మంత్రుల బృందం చర్చించింది. కాగా, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే అమరావతిలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభించారు.
ఈ క్రమంలోనే అమరావతిలో కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం రాజధాని అమరావతిలో కంపెనీలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.