మదినిండా తెలంగాణ సంస్కృతి

మదినిండా తెలంగాణ సంస్కృతి
  • హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే వ్యాఖ్య
  • వీడ్కోలు సమావేశం నిర్వహించిన జడ్జీలు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే అన్నారు. ముంబై హైకోర్టు సీజేగా బదిలీపై వెళుతున్న ఆయనకు.. సోమవారం హైకోర్టు ఫస్ట్‌‌ కోర్టు హాల్లో న్యాయమూర్తులు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీజే అలోక్‌‌ మాట్లాడుతూ.."  తెలంగాణ సంప్రదాయాలకు దేశంలోనే ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ వారసత్వాన్ని, సమగ్రతను హైకోర్టు కొనసాగించాలి. రాష్ట్ర హైకోర్టులో అత్యధిక సంఖ్యలో మహిళా న్యాయమూర్తులు ఉండటం మంచి పరిణామం. 

చీఫ్‌‌ జస్టిస్‌‌గా క్రిమినల్‌‌ కేసుల్లో వారెంట్లు, సమన్లను అందించడానికి ఎన్‌‌–స్టెప్‌‌ను అమల్లోకి తెచ్చాను. ఇలా చేయడం దేశంలోనే రెండో హైకోర్టు తెలంగాణది. కేసుల విచారణ సమయంలో బార్‌‌ నుంచి మంచి సహకారం లభించింది. అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు.సీనియర్‌‌ న్యాయమూర్తి (తాత్కాలిక చీఫ్‌‌ జస్టిస్‌‌) జస్టిస్‌‌ సుజయ్‌‌ పాల్‌‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోర్టులను డిజిటలైజేషన్‌‌ చేయించడంలో జస్టిస్‌‌ అరాధే తనదైన ముద్ర వేశారన్నారు.  కొత్త హైకోర్టు భవనాల నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారని, నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి రూ.2,580 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. జిల్లా కోర్టుల నిర్మాణానికి రూ.1,058 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. కాగితరహిత కోర్టుల ఏర్పాటు, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా 15,000 చదరపు అడుగుల డిజిటలైజేషన్‌‌ వింగ్‌‌ ఏర్పాటు చేయించారన్నారు. 

హైకోర్టు, జిల్లా, తాలూకా కోర్టుల్లో 97 ఈ–సేవా కేంద్రాలను ప్రారంభించారని ప్రశంసించారు. దేశంలోనే జాతీయ లోక్‌‌ అదాలత్‌‌ కేసుల పరిష్కారంలో నంబర్‌‌ వన్‌‌గా తెలంగాణ నిలిచేలా చేశారన్నారు. అడ్వొకేట్‌‌ జనరల్‌‌ సుదర్శన్‌‌రెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టులో డిజిటలైజేషన్‌‌ విధానాన్ని ప్రవేశ పెట్టి యాప్‌‌ ద్వారా సమన్లు పంపేలా చేశారన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ సొలిసిటర్‌‌ జనరల్‌‌ బీ నరసింహశర్మ, పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ పల్లె నాగేశ్వర రావు, బార్‌‌ కౌన్సిల్‌‌ చైర్మన్‌‌ ఏ.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధేను హైకోర్టు బార్‌‌ అసోసియేషన్‌‌ సత్కరించింది.