ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అతడి భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ హైకోర్టు ఊరట కల్పించింది. తోషఖానా అవినీతి కేసులో కింది కోర్టు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు విధించిన జైలు శిక్షను సస్పెండ్ చేసింది. ఈ కేసులో ఇమ్రాన్ దంపతులను దోషులుగా తేల్చిన అకౌంటబిలిటీ కోర్టు.. వారికి 14 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ జనవరి 31న తీర్పు చెప్పింది. దీనిపై ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు బెంచ్ సోమవారం వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. శిక్షను సస్పెండ్ చేసి, బెయిల్ ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి ఖరీదైన బహుమతులను అందుకున్నారు. ఇలా అందుకున్న కానుకలను ముందు తోషఖానాలో జమ చేయాలి. ఇమ్రాన్ ఖాన్, అతడి భార్య బుష్రా బీబీ మాత్రం కొన్ని బహుమతులను తోషాఖానాలో డిపాజిట్ చేయలేదు.