ఇమ్రాన్​కు మరో ఏడేండ్ల జైలు శిక్ష

ఇస్లామాబాద్: ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా నిఖా (పెండ్లి) చేసుకున్నారన్న ఆరోపణలతో  నమోదైన  కేసులో ఇమ్రాన్, ఆయన భార్య  బుష్రా బీబీకి పాక్ కోర్టు ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక ఒక్కొక్కరికి రూ. 5లక్షల చొప్పున ఫైన్ వేసింది.  

బుష్రా బీబీ మొదటి భర్త అయిన ఖవార్ మనేకా పెట్టిన కేసును ట్రయల్ కోర్టు శనివారం విచారించింది. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవాలంటే.. కొంతకాలం విరామం తీసుకోవాలి. ఈ నిబంధనలను తన మాజీ భార్య బుష్రా బీబీ  ఉల్లంఘించిందని ఖవార్ మనేకా  ఆమెపై కేసు పెట్టారు. అంతేగాక, పెళ్లికి ముందు నుంచే బుష్రా బీబీ , ఇమ్రాన్ మధ్య రిలేషన్ ఉందని ఆరోపించారు. 

ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇమ్రాన్ దంపతులకు ఏడేండ్ల శిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పింది. బుష్రా బీబీ 2017 నవంబరులో ఖవార్ మనేకా నుంచి డైవర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత 2018 జనవరిలో ఇమ్రాన్​ను పెండ్లి చేసుకున్నారు.కాగా..తోషఖానా కేసులో  ఇప్పటికే వీరిద్దరికీ 14 ఏండ్ల శిక్ష పడింది. అంతకుముందు అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులోనూ ఇమ్రాన్​కు 10 ఏండ్ల శిక్ష విధించారు.