- అల్కాదిర్ ట్రస్ట్ కేసులో కోర్టు తీర్పు
- న్యాయవ్యవస్థ గౌరవానికి తీర్పు మాయనిమచ్చ: ఇమ్రాన్
ఇస్లామాబాద్: అల్ కాదిర్ ట్రస్ట్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఆ దేశ అవినీతి వ్యతిరేక కోర్టు 14 ఏండ్ల జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో ఇమ్రాన్ భార్య బుష్రా బీబీకి ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. ఈమేరకు జడ్జి నసీర్ జావెద్ రాణా శుక్రవారం తీర్పు వెలువరించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఉన్న ఆదిలా జైల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో జడ్జి ఈ తీర్పు వెల్లడించారు. ఇమ్రాన్ కు రూ.10 లక్షల జరిమనా, బుష్రా బీబీకి రూ.5 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే ఇమ్రాన్ 6 నెలలు, బుష్రా 3 నెలలు అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని జడ్జి పేర్కొన్నారు.
ఇమ్రాన్ దంపతులు ఏర్పాటు చేసిన అల్ కాదిర్ యూనివర్సిటీ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. జడ్జి తీర్పు ఇచ్చిన తర్వాత కోర్టు హాల్ లోనే బుష్రా బీబీని అరెస్టు చేశారు. తాజా తీర్పుపై ఇమ్రాన్ స్పందించారు. న్యాయవ్యవస్థ గౌరవానికి తీర్పు మాయనిమచ్చ అని ఆయన పేర్కొన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ‘‘ఈ కేసులో నేను ఎలాంటి రిలీఫ్ కోరుకోవడం లేదు. తాజా కేసులో నేనుగానీ, ప్రభుత్వంగానీ ఓడిపోలేదు. ఓ నియంత ఇదంతా చేస్తున్నాడు” అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
పీటీఐ కార్యకర్తల నిరసన ప్రదర్శనలు
అల్ కాదిర్ ట్రస్టు కేసులో ఇమ్రాన్ దంపతులకు కోర్టు విధించిన శిక్షపై పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. జడ్జిమెంట్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్ హౌస్ బయట ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. కోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏంటీ అల్ కాదిర్ ట్రస్ట్ కేసు
దేశ ఖజానాకు రూ.2 వేల కోట్ల నష్టం కలిగించారన్న ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీపై 2023 డిసెంబరులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కేసు నమోదు చేసింది. ఓ వ్యాపారవేత్తతో సెటిల్ మెంట్లో భాగంగా యూకేకు చెందిన నేషనల్ క్రైం ఏజెన్సీ.. నాటి ఇమ్రాన్ ప్రభుత్వానికి చెల్లించిన రూ.2 వేల కోట్లను ఇమ్రాన్ దంపతులు దుర్వినియోగం చేశారని బ్యూరో ఆరోపించింది.