ఇమ్రాన్ ఖేల్ ఖతం!

ఇమ్రాన్ ఖేల్ ఖతం!

 

  • మద్దతు ఉపసంహరించుకున్న రెండు మిత్రపక్ష పార్టీలు
  • ఇయ్యాల అవిశ్వాస తీర్మానంపై చర్చ.. ఏప్రిల్ 3న ఓటింగ్  
  • ఆర్మీ, ఐఎస్ఐ చీఫ్​లతో ఇమ్రాన్ మీటింగ్ లు 
  • రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగిన కేబినెట్ భేటీ

ఇస్లామాబాద్:  పాకిస్తాన్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు బుధవారం మిత్రపక్ష పార్టీలు ఝలక్ ఇచ్చాయి. ఇమ్రాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ సర్కారుకు మద్దతు వాపస్ తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఏడుగురు సభ్యులు ఉన్న ఎంక్యూఎం, ఐదుగురు ఉన్న బీఏపీ పార్టీలు ఇమ్రాన్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్నాయి. దీంతో అవిశ్వాస తీర్మానానికి ముందే ఇమ్రాన్​కు దారులు మూసుకుపోయాయి. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్​ను ఈజీగా గద్దె దింపేంతగా ప్రతిపక్ష పార్టీల బలం పెరిగింది. నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై గురువారం చర్చ ప్రారంభం కానుండగా, ఆదివారం ఓటింగ్ జరుగుతుంది.  కానీ ఇప్పటికే ఇమ్రాన్ సర్కారు మైనారిటీలో పడిపోవడం, సొంత పార్టీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు సైతం వ్యతిరేకంగా ఉండటంతో అవిశ్వాస తీర్మానంలో ఆయన నెగ్గే అవకాశాలు దాదాపుగా దూరమయ్యాయి. 

ఆర్మీ, ఐఎస్ఐ చీఫ్​లతో ఇమ్రాన్ భేటీ 
మెజారిటీ కోల్పోయినందున రాజీనామా చేయాలన్న డిమాండ్లు పెరుగుతుండటంతో ఇమ్రాన్ ఖాన్ బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా తన మంత్రివర్గ సహచరులతో భేటీ అయ్యారు. అంతకుముందుగా ఆయన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తోనూ సమావేశమయ్యారు. అలాగే తన నివాసంలో ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్​లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ లతోనూ ఉదయం ఓసారి, సాయంత్రం మరోసారి ఇమ్రాన్ భేటీ అయ్యారు. సాయంత్రం జాతిని ఉద్దేశించి ఇమ్రాన్ మాట్లాడతారని ప్రచారం జరిగినా, తర్వాత స్పీచ్ ను రద్దు చేసుకున్నారు. మరోవైపు ప్రతిపక్ష ఆపార్టీల నేతలు కూడా బుధవారం ఇస్లామాబాద్​లోని సంధు హౌస్​లో సమావేశం అయ్యారు. ఈ  మీటింగ్​లో ఇమ్రాన్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఉన్నారు. 

షరీఫ్ తమ్ముడే కొత్త పీఎం: బిలావల్ భుట్టో   
పాక్ నేషనల్ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెజారిటీని కోల్పోయారని,  పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్ త్వరలోనే కొత్త ప్రధాని అవుతారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. బుధవారం ఇస్లామాబాద్ లో బిలావల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మెజారిటీని కోల్పోయారు. ఆయన ఇకపై ఎంతమాత్రమూ ప్రధానిగా కొనసాగరాదు. రేపే పార్లమెంటులో ఓటింగ్ పెట్టి, ఈ విషయాన్ని తేల్చుకోవాలి. ఆ తర్వాత మేం పారదర్శకంగా ఎన్నికలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఆర్థిక సంక్షోభం నివారణ దిశగా పని ప్రారంభిస్తాం” అని ప్రకటించారు. రాజీనామా చేయడం.. లేదా అవిశ్వాస తీర్మానంలో ఓడి గద్దె దిగడం.. ఇప్పుడు ఇమ్రాన్​ ముందున్న ఆప్షన్​లు ఈ రెండేనని బిలావల్ చెప్పారు.

మైనారిటీలో ఇమ్రాన్ సర్కార్ 
పాక్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజారిటీకి 172 మంది మద్దతు అవసరం. ఇమ్రాన్ ఆధ్వర్యంలోని పీటీఐ పార్టీకి 155 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటివరకూ పీటీఐ పార్టీకి ఎంక్యూఎం (7), బీఏపీ (5), పీఎంఎల్ క్యూ (5), జీడీఏ (3), జేడబ్ల్యూపీ (1), ఏఎంఎల్ (1), ఇండిపెండెంట్లు (2) కలిపి మొత్తం179 మంది మద్దతుతో ఇప్పటివరకు ప్రభుత్వం కొనసాగింది. అయితే, బుధవారం ఎంక్యూఎం, బీఏపీ పార్టీలు అధికారికంగా మద్దతు ఉపంసహరించు కోవడంతో ఇమ్రాన్ సర్కార్ బలం 167కు తగ్గి మైనారిటీలో పడిపోయింది. మరోవైపు పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్), పీపీపీ, తదితర పార్టీలతో కూడిన ప్రతిపక్ష కూటమి బలం కనీస మెజారిటీ కంటే ఐదు సీట్లు ఎక్కువగా 177కు పెరిగింది.

లాస్ట్ బాల్ దాకా ఆడుతరు: ఫవాద్ చౌధరి 
ఇమ్రాన్ ఖాన్ ఒక ఆటగాడని, ఆయన లాస్ట్ బాల్ దాకా పోరాటం కొనసాగిస్తారని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఫవాద్ చౌధరి అన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గే అవకాశాలు తగ్గిపోయినప్పటికీ.. ఇమ్రాన్ రాజీనామా చేయబోరని చౌధరి ట్వీట్ చేశారు. మరోవైపు ఉదయం ఆర్మీ, ఐఎస్ఐ చీఫ్​లతో ఇమ్రాన్ భేటీ తర్వాత ఫవాద్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న ప్రాధాన్యతను ఇమ్రాన్ ఖాన్ సర్కారు గుర్తిస్తోందని కామెంట్ చేశారు