పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్ పేరును మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్..పీటీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో దేశానికి ఆపద్ధర్మ ప్రధానిని ప్రతిపాదించాలని ఇమ్రాన్ ఖాన్తో పాటు విపక్ష నేతలను దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుల్జార్ పేరును ఇమ్రాన్ పార్టీ ప్రతిపాదించడంతో ఆరిఫ్ అల్వీ పాక్ మాజీ ప్రధాన న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధానిగా నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాక్ రాజ్యాంగం ప్రకారం శాశ్వాత ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆపద్దర్మ ప్రధానిని నియమించే అధికారం దేశాధ్యక్షుడికి ఉంది.
ఆపద్ధర్మ ప్రధానిగా నియమితులైన గుల్జార్ అహ్మద్ పాకిస్థాన్ కు 27వ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. 2019 డిసెంబర్ 21న పాక్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2022 ఫిబ్రవరి వరకు ఆ పదవిలో కొనసాగారు. గుల్జార్ అహ్మద్ 1957 ఫిబ్రవరి 2న కరాచీకి చెందిన ఓ న్యాయవాద కుటుంబలో జన్మించారు. ఆయన తండ్రి నూర్ మహమ్మద్ కరాచీలో లాయర్ గా పనిచేశారు.