- సైఫర్ కేసులో శిక్ష విధించిన స్పెషల్ కోర్టు
- ఎన్నికలకు రెండు వారాల ముందు పీటీఐకి ఎదురుదెబ్బ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ స్పెషల్ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసు (సైఫర్ కేసు)లో ఈ శిక్ష పడింది. ఇదే కేసులో ఇమ్రాన్ సన్నిహితుడు, పాక్ మాజీ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీకి కూడా పదేండ్ల జైలుశిక్ష పడింది. ప్రస్తుతం ఇమ్రాన్ రావల్పిండిలోని అడియాలా జైలులో ఉండడంతో కేసు విచారణ అక్కడే చేపట్టారు. సోమవారం తుది విచారణ పూర్తవడంతో ప్రత్యేక కోర్టు జడ్జి అబుల్ హస్నత్ తీర్పును వెలువరించారు. పాక్ జాతీయ ఎన్నికల పోలింగ్‌కు పది రోజుల ముందు వెలువడిన ఈ తీర్పుతో ఇమ్రాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
మరోవైపు ఇది బూటకపు కేసు అని, పైకోర్టులో ఈ తీర్పును సవాలు చేస్తామని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ తెలిపింది. ప్రజలకు, మీడియాకు విచారణకు సంబంధించిన విషయాలు తెలియనివ్వలేదని ఆరోపించింది. న్యాయం హత్యకు గురైందని విమర్శించింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు కింది కోర్టు విధించిన శిక్షపై ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవల స్టే ఇచ్చింది. అయితే సైఫర్ కేసులో అతన్ని అరెస్టు చేసి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంచారు. సెక్యూరిటీ సమస్యల వల్ల జైలులోనే కేసు విచారణ జరిగింది. ఇమ్రాన్ 2018 నుంచి 2022 వరకు పాక్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ దేశ సైన్యంతో ఆయనకు విభేదాలు తలెత్తడంతో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించారు. తర్వాత మిలటరీ చెప్పు చేతల్లో ఉండే అపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఇమ్రాన్ ఓ సభలో మాట్లాడుతూ అమెరికా సపోర్టుతో తన హత్యకు కుట్ర పన్నారని.. పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. అందుకు సాక్ష్యంగా కొన్ని పత్రాలను చూపారు. వాటిని అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి తెచ్చానని చెప్పారు. దీంతో అతనిపై అధికార సైఫర్ కేసు నమోదు చేశారు.