SA20: 45 ఏళ్ళ వయసులో తాహిర్ డైవింగ్ క్యాచ్.. వైరల్‌గా మారిన రోనాల్డో సెలెబ్రేషన్

సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కు వయసు కేవలం నెంబర్ మాత్రమే. 45 ఏళ్ళ వయసులోనూ తన స్పిన్ మాయాజాలంతో సత్తా చాటుతూ క్రికెట్ లో కొనసాగుతున్నాడు. స్పిన్ బౌలింగ్ తో పాటు మైదానంలో తన సెలెబ్రేషన్ తో ఈ సఫారీ స్పిన్నర్ బాగా వైరల్ అవుతాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ లో అతను ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో సెలెబ్రేషన్ తో అందరి దృష్టి ఆకర్షించాడు. అద్భుతమైన క్యాచ్ అందుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. 

సూపర్ జెయింట్స్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 7వ ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 2 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసిన సూపర్ జెయింట్స్ లక్ష్యం దిశగా వెళ్తుంది. ఈ దశలో నమ్మశక్యం కాని క్యాచ్ తో తాహిర్ ఆ జట్టుకు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ లో డోనోవన్ ఫెరీరా వేసిన మూడో బంతిని మల్డర్ రివర్స్ స్వీప్ చేశాడు. అక్కడే పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తాహిర్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ అనంతరం గ్రౌండ్ మొత్తం తిరుగుతూ రోనాల్డో సెలెబ్రేషన్ చేసుకోవడం హైలెట్ గా మారింది. 

ALSO READ | Champions Trophy 2025: పాకిస్థాన్ బయలుదేరనున్న రోహిత్ శర్మ.. కారణమిదే!

తాహిర్ సూపర్ క్యాచ్ తో మల్డర్ 9 పరుగులకే పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. ఈ క్యాచ్ తో మ్యాచ్ సూపర్ కింగ్స్ వైపుకు మళ్లింది. వయసు పెరిగినా తాహిర్ ఎనర్జీ అలాగే ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే డర్బన్ సూపర్ జయింట్స్ పై జోబర్గ్ సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సూపర్ జయింట్స్ 141 పరుగులకే పరిమితమైంది.