- నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్
- ఎండ తీవ్రత కారణంగా మిగతా చోట్ల గంట టైం పెంపు
- వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో 13 నియోజకవర్గాల్లో టైం పెంచని ఈసీ
- ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎండ తీవ్రత, వడగాలుల కారణంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌ను గంట పాటు పెంచుతూ ఎన్నికల సంఘం ఆర్డర్స్ జారీ చేసింది. దీంతో సాయంత్రం ఐదు గంటలకు ముగియాల్సిన పోలింగ్ ఆరు గంటల వరకు కొనసాగనుంది. కానీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఆయా నియోజకవర్గాల్లో గతంలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగేది. పోలింగ్ ముగిశాక బాక్స్‌లను తరలిస్తుండగా మార్గమధ్యలో మావోయిస్టులు దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్‌ను గంట కుదిస్తూ 4 గంటల వరకే పరిమితం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో...
రాష్ట్రంలో ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎండ తీవ్రత విపరీతంగా పెరిగినందున పోలింగ్ టైం పెంచాలని రాజకీయ పార్టీలు ఈసీని కోరడంతో పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచింది. దీంతో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
కానీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ములుగు, మంథని, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది.
ఆ లోపు పోలింగ్ సెంటర్లలోకి వచ్చే వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో గత మూడు నెలల కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో సుమారు 80 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు. ఈ క్రమంలోనే 13 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ టైంను పెంచలేదని తెలుస్తోంది.
భారీ బందోబస్తు
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, విధ్వంసాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉండడంతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ పోలీసులతో కో ఆర్డినేషన్ మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
ఎన్‌కౌంటర్లు, ఎదురుకాల్పుల ఘటనలతో పాటు ఎన్నికల బహిష్కరణ పిలుపుతో మావోయిస్టుల కోసం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ టీంలు, ప్రత్యేక పోలీస్ బలగాలతో కూంబింగ్ చేస్తున్నారు. స్పెషల్ పార్టీ పోలీస్ టీంలతో పాటు కేంద్ర బలగాలతో కలిసి రాష్ట్ర పోలీసులు మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు.
పోలీస్ ఇన్‌ఫార్మర్ వ్యవస్థతో పాటు నిఘాను పటిష్టం చేస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీస్ ఆఫీసర్లతో రెండు రోజుల కింద ఎస్పీ రోహిత్‌రాజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్యూటీలు చేసే వారు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్లకు తరలించే వరకు ఆయా మార్గాల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్ చేపట్టాలని ఆదేశించారు.
ఈవీఎంలను తరలించే వెహికిల్స్‌కు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం. పోలీస్ ఆఫీసర్లతో ఇప్పటికే కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాం. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు చేపట్టాం. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ప్రియాంక అల, కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం