మనిషి జీవితంలో చావు చివరిది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. నరకానికి వెళ్తారని, తిరిగి పుడతారని కొన్ని మైథాలజీలు చెప్తుంటే.. పునర్జన్మ ఉండనే ఉండదని మరికొన్ని రిలీజియన్లు చెప్తాయి. అయితే.. సైన్స్ మాత్రం... చావు తర్వాత ఇంకేం ఉండదని చెప్తుంది. కానీ.. ఈ ‘పోలాక్ సిస్టర్స్’ లాంటి ఘటనలు సైన్స్‌కే సవాల్ విసురుతున్నాయి. ఈ కవలల గురించి విన్నవాళ్లెవరూ పునర్జన్మ ఉండదని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ల జీవితంలో నమ్మలేని నిజాలు ఎన్నో ఉన్నాయి.
ఈ మిస్టరీ ఇంగ్లండ్‌లోని నార్తంబర్‌ల్యాండ్‌లోని హెక్స్‌హామ్ అనే చిన్న టౌన్‌లో పొలాక్ కుటుంబం చుట్టూ అల్లుకుంది. జాన్, ఫ్లోరెన్స్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. 1946లో మొదటి కూతురు జోవన్నా పొల్లాక్ పుట్టింది. ఆ తర్వాత రెండో కూతురు జాక్వెలిన్ 1951లో పుట్టింది. ఇద్దరినీ అల్లారుముద్దుగా చూసుకునేవాళ్లు. బాగా కష్టపడి పిల్లలకు కావాల్సినవన్నీ కొనిపెట్టేవాళ్లు. జాన్‌కు కూతుళ్లంటే ప్రాణం. మిల్క్ డెలివరీ బిజినెస్ చేసేవాడు. ఫ్లోరెన్స్ అతనికి బిజినెస్‌లో హెల్ప్ చేసేది. అక్కా చెల్లెలికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. చూస్తుండగానే ఏళ్లు గడిచిపోయాయి. జోవన్నాకు పదకొండేళ్లు, జాక్వెలిన్‌కి ఆరేండ్ల వయసొచ్చింది. వాళ్లు ఆంథోనీ అనే తొమ్మిదేళ్ల ఫ్రెండ్‌తో కలిసి రెగ్యులర్‌గా చర్చికి వెళ్లేవాళ్లు. అలా ఒకరోజు ముగ్గురూ నడుస్తూ చర్చికి వెళ్తున్నప్పుడు వాళ్లను కారు ఢీకొట్టింది. అక్కా చెల్లెళ్లు అక్కడికక్కడే చనిపోయారు. ఆంథోనిని హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటే దారిలో చనిపోయాడు. వాళ్లను ఢీకొట్టిన కారు నడిపింది ఒక మహిళ. ఆమె కొన్ని రోజుల క్రితం తన పిల్లల నుంచి విడిపోవాల్సి వచ్చింది. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లి డ్రగ్స్ తీసుకుంది. తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కారు తీసింది. ఆత్మహత్యాయత్నం కాస్తా ముగ్గురు పిల్లల చావుకు కారణమైంది.
మళ్లీ పుట్టారా?
తమ ఇద్దరు కూతుళ్లను ఒకేసారి పోగొట్టుకోవడంతో చాలా బాధపడ్డారు జాన్, ఫ్లోరెన్స్. ఆ డిప్రెషన్ నుంచి మామూలు లైఫ్‌లోకి రావడానికి చాలా టైం పట్టింది వాళ్లకు. ఎంత ట్రై చేసినా కూతుళ్లను మర్చిపోలేకపోయాడు జాన్. తన కూతుళ్లను తన దగ్గరికి తిరిగి పంపమని ప్రతి రోజూ దేవుడిని వేడుకునేవాడు. జాన్‌కు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు పునర్జన్మ గురించి రాసిన ఒక పుస్తకాన్ని చదివాడు. అప్పటినుంచి పునర్జన్మ ఉంటుందని నమ్మేవాడు. అతను క్యాథలిక్. వాస్తవానికి క్యాథలిక్‌లు పునర్జన్మను నమ్మరు. టిబెటన్ బౌద్ధులు, జర్మన్ థియోసాఫిస్టులు, మన దేశంలో హిందువులు, సిక్కులు పునర్జన్మను ఎక్కువగా నమ్ముతారు. అంతెందుకు ప్లేటో, సోక్రటీస్ లాంటి ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు కూడా కొన్ని సందర్భాల్లో పునర్జన్మను నమ్మారు. అందుకే జాన్ కూడా పునర్జన్మ ఉందని నమ్మి, తన కూతుళ్లకు కూడా పునర్జన్మ ప్రసాదించమని దేవుడ్ని కోరుకునేవాడు. అంతేకాదు తన కూతుళ్లు మళ్లీ పుడతారని బలంగా నమ్మేవాడు. ఫ్లోరెన్స్ మాత్రం ఇవన్నీ పెద్దగా పట్టించుకునేది కాదు.
యాదృచ్ఛికమా?
1958లో ఫ్లోరెన్స్ ప్రెగ్నెంట్ అయింది. అప్పటినుంచి ఆమె గర్భంలో కవలలు ఉన్నారని, తన కూతుళ్లు జోవన్నా, జాక్వెలిన్‌ల ఆత్మలే ఆ కవలల్లో ఉన్నాయని అందరికీ చెప్పేవాడు. ఎవరు ఎంత చెప్పినా జాన్ మొండిగా వాదించేవాడు. డాక్టర్ టెస్టులు చేసి గర్భంలో ఒకే బిడ్డ ఉందని చెప్పినా జాన్ వినలేదు. అక్టోబర్ 4, 1958న నిజంగానే ఫ్లోరెన్స్ కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అది చూసి డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. కానీ.. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చని చాలామంది అన్నారు. జాన్ మాటలను కొట్టిపారేశారు. దంపతులు కవలలకు గిలియన్, జెన్నిఫర్ అని పేర్లు పెట్టారు. అయితే.. జాన్ రెండో కూతురు జాక్వెలిన్‌కు (యాక్సిడెంట్లో చనిపోయిన పాప) కంటి మీద, ఎడమ చేతి మణికట్టు మీద బర్త్ మార్కులు ఉండేవి. అదే ప్లేస్‌లో అవే మార్క్‌లతో జెన్నిఫర్ పుట్టింది.
వీళ్లు.. వాళ్లేనా...
కవలలకు నాలుగేళ్లున్నప్పుడు వాళ్లింట్లోని ఒక అల్మారాలో తమ బొమ్మలు ఉన్నాయని, అవి తీసిమ్మని ఫ్లోరెన్స్‌ని అడిగారు. దానికి ఆమె ఒప్పుకోలేదు. ‘‘అవి పాత బొమ్మలు.. మీకు కొత్త బొమ్మలు కొనిస్తాన’’ని చెప్పింది. అయినా.. పిల్లలు వినిపించుకోలేదు. అవే బొమ్మలు కావాలని పట్టుబట్టారు. దాంతో ఫ్లోరెన్స్ ఆ బొమ్మలు తీసిచ్చింది. అవి జోవన్నా, జాక్వెలిన్ ఆడుకున్న బొమ్మలు. అవి అల్మారాలో ఉన్నట్టు తల్లి ఫ్లోరెన్స్‌తోపాటు చనిపోయిన జోవన్నా, జాక్వెలిన్‌లకు మాత్రమే తెలుసు. తల్లి బొమ్మలు తీసివ్వగానే జోవన్నా బొమ్మలను గిలియన్, జాక్వెలిన్ బొమ్మలను జెన్నిఫర్‌లు తీసుకున్నారు. పైగా వాటితో ఉన్న పాత (పూర్వజన్మ) జ్ఞాపకాల గురించి మాట్లాడుకున్నారు. దాంతో ఫ్లోరెన్స్ ఆశ్చర్యపోయింది. నిజంగానే తన కూతుళ్లే మళ్లీ పుట్టారని నమ్మడం మొదలుపెట్టింది ఆమె కూడా.
జ్ఞాపకాలు..
గిలియన్, జెన్నిఫర్‌లు పెరుగుతున్న కొద్దీ జోవన్న జాక్వెలిన్లుగా ఉన్నప్పటి పనుల గురించి మాట్లాడుకునేవాళ్లు. పదే పదే యాక్సిడెంట్ గురించి చెప్పుకునేవాళ్లు. కారు ఢీకొట్టినప్పుడు తగిలిన దెబ్బల గురించి గుర్తుచేసుకుంటూ ఏడ్చేవాళ్లు. గిలియన్ హుందాగా ఉండేది. జెన్నిఫర్ మాత్రం కాస్త అల్లరి చేసేది. పూర్వజన్మలో జెన్నిఫర్ కన్నా గిలియన్ పెద్దది. అందుకే కాబోలు కాస్త పద్ధతిగా మసలుకునేది. జెన్నిఫర్ చనిపోయేనాటికి ఆమె వయసు ఆరేళ్లే. అందుకే కాస్త అల్లరి ఎక్కువ చేసేది. ఈ జన్మలో కూడా వాళ్ల ప్రవర్తన అలాగే ఉండేది. ఒకరోజు కవల పిల్లలు దగ్గర్లోని ఒక పార్క్ గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పటివరకు ఎప్పుడూ వాళ్లు అటువైపు వెళ్లలేదు. ఆ పార్క్‌ను చూడలేదు. కానీ.. వాళ్లిద్దరూ ఆ పార్క్‌లోని వస్తువులు, చెట్ల గురించి పూస గుచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే.. పూర్వజన్మలో ఇద్దరూ ఆ పార్క్‌కు రెగ్యులర్‌గా వెళ్లేవాళ్లు. అక్కడ ఉయ్యాల ఊగేవాళ్లు. అంతేకాదు.. వాళ్లను బయటికి తీసుకెళ్లిన ప్రతిసారి కార్లను చూసి భయపడేవాళ్లు. వాటి హార్న్ సౌండ్ వినిపిస్తే చాలు వణికిపోయేవాళ్లు. కారు వాళ్లను ఢీకొట్టడానికే వస్తుందనుకునేవాళ్లు. పూర్వ జన్మలో చదువుకున్న స్కూలును కూడా గుర్తుపట్టారు. ఆ జన్మలో వాళ్లకున్న అలవాట్లు, అభిరుచులే ఇప్పుడూ ఉన్నాయి. ఇవన్నీ చూశాక తల్లిదండ్రులు వీళ్లు జొన్నొవా, జాక్వెలిన్‌లే అని నిర్ధారించుకున్నారు.
బొమ్మ గీసింది
జాన్‌కు వ్యాపార పనుల్లో సాయం చేసేటప్పుడు ఫ్లోరెన్స్ స్మాక్ డ్రెస్ వేసుకునేది. కానీ ఆమె కూతుళ్లు చనిపోయిన తర్వాత పనులకు దూరంగా ఉందామె. అప్పటినుంచి ఎప్పుడూ స్మాక్ వేసుకోలేదు. కవలలకు నాలుగేళ్ల వయసున్నప్పుడు జాన్ ఒక పెయింటింగ్ వేస్తున్నాడు. అప్పుడు అతను స్మాక్‌ని వేసుకున్నాడు. అది చూసిన జెన్నిఫర్ ‘‘మమ్మీ కోట్ ఎందుకు వేసుకున్నాడు డాడీ”అని అడిగింది. కానీ.. గిలియన్ అందుకు కోప్పడింది. ‘‘అమ్మకు అలాంటి కోట్ లేద’’ని వాదించింది. జెన్నిఫర్ మాత్రం కస్టమర్లకు పాలు పోసేటప్పుడు మమ్మీ ఆ కోట్ వేసుకునేదని చెప్పింది. వాస్తవం ఏంటంటే.. ఫ్లోరెన్స్ పని చేస్తుండగా జోవన్నా ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే.. జోవన్నా స్కూలుకు వెళ్లాక ఆమె పనులు చేసేది. జోవన్నాను రెడీ చేసి, స్కూలుకు పంపిన తర్వాతే ఆమె స్మాక్ వేసుకునేది. అప్పుడు జాక్వెలిన్ చిన్నపిల్ల కాబట్టి ఇంట్లోనే ఉండేది. అందుకే తల్లి ఆ స్మాక్ వేసుకోవడం తను చూసింది. ఇవే కాదు... వాళ్ల పునర్జన్మకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. దాంతో చుట్టుపక్కల వాళ్లు కూడా ఆ కవలలు మళ్లీ పుట్టారని నమ్మారు. అయితే.. అంతా బాగానే ఉందనుకున్న టైంలో గిలియన్, జెన్నిఫర్‌లకు ఐదేళ్లు నిండగానే గత జన్మ జ్ఞాపకాలను పూర్తిగా మరిచిపోయారు.
నిజమా.. లేక..
గిలియన్, జెన్నిఫర్‌ల కథ తెలుసుకున్న ఇయాన్ స్టీవెన్‌సన్ వీళ్లపై స్టడీ చేయడం మొదలుపెట్టాడు. ఆయన పునర్జన్మపై స్టడీ చేసే సైంటిస్ట్. స్టీవెన్‌సన్ పొల్లాక్ కవలలతోపాటు చాలా కేసులను స్టడీ చేశాడు. ఆ కేసుల అనుభవంతో 1987లో ఆయన ‘‘చిల్డ్రన్ హూ రిమంబర్ దేర్ పాస్ట్ లైవ్స్’’ అనే పుస్తకం కూడా రాశాడు. అందులో పునర్జన్మ గురించిన 14 సంఘటనలను వివరించాడు. అంతేకాదు ఆయన అందులో కొందరికి ‘‘పునర్జన్మ” ఉండే అవకాశం కూడా ఉందని చెప్పాడు. అందుకు సాక్ష్యంగా పోలాక్ సిస్టర్స్ విషయాన్ని ప్రస్తావించాడు. అంతేకాదు.. ఇయాన్ స్టీవెన్‌సన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘గిలియన్, జెన్నిఫర్‌లు మోనోజైగోటిక్ కవలలు. అందువల్ల జన్యుపరంగా ఒకేలా ఉన్నారు. జెన్నిఫర్ బర్త్ మార్కులకు కారణాన్ని మాత్రం జెనెటిక్స్ ద్వారా గుర్తించలేము. తల్లి నమ్మకాల వల్ల పిల్లలు ఇలా పుట్టారు అనడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫ్లోరెన్స్ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు పునర్జన్మపై నమ్మకం లేదు. అందువల్ల వీళ్లు మళ్లీ పుట్టలేదని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవు” అన్నాడు.
అంతా ఉత్తదేనా?
స్టీవెన్‌సన్ థియరీని బ్రిటిష్ హిస్టోరియన్ ఇయాన్ విల్సన్ కొట్టిపారేశాడు. ఆయన చెప్పిన సాక్ష్యాలు బలంగా లేవన్నాడు. ఎందుకంటే ఆ పిల్లల ప్రవర్తనకు వాళ్ల తల్లిదండ్రులు మాత్రమే సాక్ష్యులు. పైగా వాళ్లలో ఒకరికి పునర్జన్మపై గట్టి నమ్మకం ఉంది. ఇద్దరు ఆడపిల్లలు చనిపోయిన కుటుంబంలోనే మరో ఇద్దరు పుట్టడం వల్ల తల్లిదండ్రులు వాళ్లే మళ్లీ పుట్టారని నమ్మారు. పైగా చనిపోయిన బిడ్డల గురించి ఎప్పుడూ మాట్లాడుకోవడం. వీళ్లలో వాళ్లను చూసుకోవడం వల్ల పిల్లలు తమ అక్కల గురించి తెలుసుకుని ఉండొచ్చనేది విల్సన్ వాదన. పిల్లలు పెద్దయ్యాక మాత్రం ఆ విషయాల గురించి పట్టించుకోవడం మానేశారు. అందుకే ‘గత జన్మ’ జ్ఞాపకాలను మర్చిపోయారు.
ఆత్మలను చూశాడా!
జోవన్నా, జాక్వెలిన్ చనిపోయిన రోజు వాళ్ల ఆత్మలు తనకు కనిపించాయని జాన్ చెప్పాడు. వాళ్లు స్వర్గం నుంచి తనతో మాట్లాడారట. మేడ మీది గదిలో ఒంటరిగా కూర్చుని తన కూతుళ్లతో మాట్లాడినట్టు చెప్పేవాడు. అప్పుడే వాళ్లు తమ పునర్జన్మ గురించి చెప్పారని మళ్లీ ఇదే ఇంట్లో పుడతామని చెప్పారట. జాన్ ఈ విషయం చెప్తే ఫ్లోరెన్స్ నమ్మలేదు. ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్న గొడవ కూడా అయింది.
::: కరుణాకర్ మానెగాళ్ల