- సూర్యాపేట అభివృద్ధికి 2016లో రూ. 7 కోట్లు రిలీజ్
- అమృత్ స్కీం కింద మరో రూ. 2.70 కోట్లు
- ఇంకా పూర్తి కాని పనులు రూ. కోటితో 70 సెంట్రల్ లైట్ల ఏర్పాటు
- రోడ్డు వెడల్పు పేరుతో నాటిన ఏడాదే స్తంభాల తొలగింపు
సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఎన్నో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతుంటాయి. కానీ సూర్యాపేట జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆరేళ్ల క్రితం పైసలు ఇచ్చినా పనులు చేయించేందుకు ఆఫీసర్లు, వాటిని పర్యవేక్షించేందుకు లీడర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఏళ్లు గడుస్తున్నా ఒక్క పని కూడా పూర్తి కాలేదు. కొన్ని అభివృద్ధి పనులైతే ఇప్పటివరకు మొదలే కాలేదు.
సూర్యాపేట మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనుల కోసం 14వ ఫైనాన్స్ కింద 2016లో ప్రభుత్వం రూ. 7 కోట్లను విడుదల చేసంది. అలాగే అమృత్ స్కీమ్ కింద మరో రూ. 2.70 కోట్లు విడుదల అయ్యాయి. ఈ నిధులతో పట్టణంలో సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ, జంక్షన్ల డెవలప్‌మెంట్, స్మృతివనం నిర్మాణం వంటి 15 పనులు చేయాల్సి ఉంది. ఈ పనులను ఐదేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే నిధులు విడుదలై ఆరేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు 8 పనులు పూర్తి కాగా, మిగతా పనులు ఇంకా స్టార్ట్ కాలేదు. స్మృతివనం నిర్మాణం పనులు 50 శాతమే కంప్లీట్ అయ్యాయి.
70 కరెంట్ పోళ్లకు రూ. కోటి ఖర్చు
సూర్యాపేట మున్సిపాలిటీలో జరిగిన సెంట్రల్ లైటింగ్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా పట్టణంలోని బస్టాండ్ నుంచి ఎంజీ రోడ్డు వరకు, జమ్మిగడ్డ నుంచి ఎంపీడీవో ఆఫీస్ వరకు, కోర్టు చౌరస్తా నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకు మొత్తం 70 సెంట్రల్ లైటింగ్ స్తంభాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ స్తంభాలకే రూ. కోటి ఖర్చు అయినట్లు మున్సిపాలిటీ ఆఫీసర్లు బిల్లులు మంజూరు చేశారు.
ఇలా నాటారు.. అలా తీసేశారు
సూర్యాపేట పట్టణంలో 2018లో సెంట్రల్ లైటింగ్ స్తంభాలు ఏర్పాటు చేశారు. తర్వాత అదే ఏడాది పట్టణంలో రోడ్ల వెడల్పు పనులు స్టార్ట్ చేయడంతో తాళ్లగడ్డ పరిధిలోని సెంట్రల్ లైటింగ్ స్తంభాలను తొలగించి పక్కన పడేశారు. అయితే రోడ్ల విస్తరణ చేస్తారని తెలిసి కూడా స్తంభాలను ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్ల వెడల్పు పూర్తయ్యాక మరోసారి లైట్ల ఏర్పాటు కోసం నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఆరు నెలల్లో పూర్తి చేస్తాం
సూర్యాపేట మున్సిపాలిటీలో చేపట్టిన అన్ని పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. స్మృతివవాన్ని మరో మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తాం. మిగతా పనులను త్వరలోనే మొదలు పెడతాం. - బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట