భారతీయ రుషులు మనిషిని ఓ ఆర్థిక వ్యవస్థ చుట్టూ తిరిగే వ్యక్తిగా చూడలేదు. మనిషి అవసరం భౌతికవాదం కానే కాదు. అందువల్ల ఆసియా-యూరప్ ఖండాల్లో కమ్యూనిస్ట్ రాజకీయ ప్రయోగం వెర్రితలలు వేసింది. అలాగే కాంగ్రెస్ ఈ దేశ వృద్ధ పార్టీల్లో ఒకటి. కానీ అది స్వాతంత్ర్యం తర్వాత నెహ్రూ ఆలోచనల్లో మునిగిపోయి సెక్యులరిజం అనే ముసుగు తొడుక్కుని కుటుంబ పార్టీగా మారిపోయింది. దాని పునాదుల నుంచి అనేక కుల, కుటుంబ, ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ సారథ్యంలో 1951లో భారతీయ జన సంఘ్ ఆవిర్భవించింది. ఆర్ఎస్ఎస్ మద్దతుతో దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి ఎందరో నేతలు జనసంఘ్ ను ముందుండి నడిపించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, శ్యామాప్రసాద్ ముఖర్జీ, నానాజీ దేశ్ ముఖ్ జనసంఘ్ మూలస్తంభాలు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పుట్టిన జనతా పార్టీ కాంగ్రెస్ చేసిన చేతబడి కారణంగా విఫల ప్రయోగం అయ్యింది. 1975--–77 మధ్య ఇందిరాగాంధీ విధించిన ఎమెర్జెన్సీ దేశంలో కొత్త రాజకీయ సమీకరణాలకు బాటలు వేసింది. జయప్రకాశ్ నారాయణ్ లాంటి మహానాయకుల పిలుపు మేరకు దేశం ఒక్కసారిగా ఉద్విగ్నతకు లోనయ్యింది. అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వానీ లాంటి జనసంఘ్ నాయకులు జైళ్లకు వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో జనసంఘ్, మరికొన్ని పార్టీలు విలీనమై జనతా పార్టీగా ఆవిర్భవించింది. అనేక పార్టీల నుంచి వచ్చిన నాయకత్వంలో జనతా పార్టీ ఏర్పడినా అది కుట్రలు, కుతంత్రాలతో విఫలం కావడం మరో విషాద రాజకీయ పరిణామం.
జనతా పార్టీలో జనసంఘ్‌కు అవమానాలు
1980 ఎన్నికల్లో ‘పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేయండి’ అని ఇందిర ఇచ్చిన పిలుపు ప్రజలను ఆకట్టుకుంది. కిచిడీ పార్టీలు దేశాన్ని పాలించడం కష్టమన్న వాదన ప్రజలను బాగా ఆకర్షించడంతో మళ్లీ ఆమెకు అవకాశం లభించింది. 1980 ఫిబ్రవరి 25న బాబూ జగ్జీవన్‌రామ్ జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌కు లేఖ రాస్తూ ద్వంద్వ సభ్యత్వాల వల్లే పార్టీ ఓడిపోయిందని పేర్కొన్నారు. దానికి వాజ్ పేయి, అద్వానీ లాంటి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్(2), భారతీయ లోక్‌దళ్, సోషలిస్ట్ పార్టీ, సీఎఫ్‌డీ, జనసంఘ్ అనే పార్టీలు జనతా పార్టీలో కలిసిపోయినా.. జనసంఘ్ ను మిగతా వారు అస్పృశ్య పార్టీగా చూశారు. దాన్ని తీవ్రంగా పరిగణించిన నాయకులు కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవాలని భావించారు. లాల్‌కృష్ణ అద్వానీ, సుందర్ సింగ్ బండారీ 1980 ఫిబ్రవరి–మార్చిలో దేశమంతా తిరిగి కార్యకర్తల అభిప్రాయం సేకరించారు. జనసంఘ్ కార్యకర్తలను జనతా పార్టీలోని మిగతావారు తీవ్రంగా అవమానించారన్న సత్యం తెలిసిపోయింది. ఈ లోపు జనసంఘ్ ను జనతా పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర మరింత పదునెక్కింది. 1980 ఏప్రిల్ 4 తర్వాత తీవ్ర సందిగ్ధతల మధ్య జనసంఘ్ వెలివేయబడింది. ఆ వెలివేతనే ఆ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద కార్యకర్తల సమూహం ఉన్న పార్టీగా నిలబడ్డానికి మూలం అయ్యింది. అయితే జనసంఘ్ ను బహిష్కరించిన వాళ్లే తలోదారి చూసుకున్నారు. జగ్జీవన్‌రామ్ కాంగ్రెస్(యు)లో చేరగా, చరణ్ సింగ్ లోక్ దళ్ ను ఏర్పాటు చేసుకున్నారు. జనతా పార్టీలో కేవలం చంద్రశేఖర్ బ్యాచ్ మాత్రమే మిగిలింది. “దిల్ కే తుకుడే హజారా యుయే కోయ్ యహాగిరా, కోయ్ వహాగిరా” అన్నట్లుగా ఉందని గిట్టని వాళ్ల హేళనకు గురైంది.
1980 ఏప్రిల్ 6న పుట్టిన బీజేపీ
ఇక జాతీయవాద స్ఫూర్తితో రగిలిపోతున్న కార్యకర్తల్లో నూతనోత్సాహం రేగింది. జాతీయ సమైక్యత, దేశభక్తి మేళవించిన ఎందరో ఆలోచన చేస్తే పుట్టిన భారతీయ జనతా పార్టీ ఈ దేశ చరిత్ర గతిని మార్చిన మైలురాళ్లకు కారణమైంది. ఈ మహత్కార్యానికి 1980 ఏప్రిల్ 5, 6 తేదీల్లో జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో బీజం పడింది. 1980 ఏప్రిల్ 6వ తేదీ దేశ రాజకీయాల్లో సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోయింది. ఆ రోజు 3,500 మంది ప్రతినిధుల మధ్య భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా వాజ్ పేయి, ప్రధాన కార్యదర్శులుగా ఎల్‌కే అద్వానీ, సికిందర్ భక్త్, సూరజ్ భాను బాధ్యతలు స్వీకరించారు. పండిట్ దీన్ దయాళ్ ఏకాత్మ మానవవాదమే బీజేపీ ఆర్థిక సిద్ధాంతాలకు ప్రేరణ. ఆనాటి పార్టీ స్వదేశీ, ఆర్థిక వికేంద్రీకరణ, వ్యవసాయం, సమానత్వం ప్రధాన లక్ష్యాలుగా ముందుకు వెళ్లింది. ఆనాటి పార్టీని దేశ రాజకీయాల్లో ఖాళీని పూరించే వ్యవస్థగా ప్రజలు కూడా గుర్తించడం మొదలుపెట్టారు. “రాజకీయ వేదికను ఆక్రమించుకునే స్వార్థపరుల గుంపు నుంచి మన పార్టీని వేరుగా భావించాలి” అని 1980 డిసెంబర్ 28-–30 మధ్య బాంబేలో జరిగిన బీజేపీ ప్లీనరీ నుంచి ఇచ్చిన పిలుపునకు, “సూరజ్ నికలేగా అంధేరా ఛటేగా, ఔర్ కమల్ ఖలేగా” అన్న నినాదానికి మంచి స్పందన వచ్చింది. మహ్మద్ కరీంచాంగ్లా లాంటి మేధావి ఆనాటి బాంబే సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అంచెలంచెలుగా ప్రజల మనసులు గెలిచింది
మేధావులంతా వామపక్షాలతో రాజకీయ రంగమంతా కాంగ్రెస్‌లో నిండి ఉన్న ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో ఒక పార్టీ నిలదొక్కుకోవడం ఎంత కష్టమో ఊహించవచ్చు. 1983 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 18 సీట్లు, 1982లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కొన్ని సీట్లు బీజేపీ ఉత్సాహానికి ఊపునిచ్చాయి. 1984లో బీజేపీ మొదటిసారి సొంతంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తే పోలైన ఓట్లలో 7.66 శాతం సాధించింది. ఇందిర హత్య తర్వాత ఇది ఒక ఆశనిపాతం. కానీ పార్టీలోని పెద్దలు, కార్యకర్తలు నిరాశ చెందకుండా ముందుకు సాగారు. మిస్టర్ క్లీన్ గా రాజకీయ రంగంలోకి వచ్చిన రాజీవ్ గాంధీపై బోఫోర్స్ మరకపడింది. బోఫోర్స్ కంపెనీ నుంచి 155 ఎంఎం హెూవిడ్జర్ తుపాకుల కొనుగోలుకు సంబంధించి రాజీవ్ పార్టీకి చెందిన సభ్యులకు 16 మిలియన్ డాలర్ల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈలోపు షాహబానా కేసులో రాజీవ్ ప్రభుత్వం వ్యవహరించిన విధానం దేశ రాజకీయ చరిత్ర గతిని కొత్త పంథాలోకి తీసుకెళ్లింది. 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు పార్టీ అగ్రనాయకుడు లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన రథయాత్ర దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. హిందువుల ఆత్మగౌరవ ప్రతీకగా విదేశీ దురాక్రమణదారు నిర్మించిన మసీదును తొలగించి అక్కడ మందిరం నిర్మించాలని అద్వాని చేసిన యాత్ర భారతదేశాన్ని ఒక్కటిగా నిలిపింది. ఈ క్రమంలో లౌకికవాదం పేరుతో జరుగుతున్న మోసాన్ని ప్రజలు గ్రహించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత జరిగిన కరసేవలో బీజేపీ కార్యకర్తలు ముందుండి ప్రజల మనసులు గెలుచుకున్నారు.
దేశ ప్రతిష్టను పెంచిన ప్రధాని మోడీ
అదే సమయంలో గుజరాత్ లో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చారు. గోద్రా రైలుకు నిప్పంటించి 75 మందికి పైగా కరసేవకులను బలిగొన్న ఘటన దేశంలోని రామభక్తుల మనసులను కలచివేసింది. అనంతరం జరిగిన మత ఘర్షణలను మోడీపైకి నెట్టేందుకు జరిగిన ప్రయత్నం తర్వాత విచారణల్లో తప్పని తేలింది. కానీ, కమ్యూనిస్ట్ లు, కాంగ్రెస్, సూడో సెక్యులర్ శక్తులు మోడీని విలన్‌గా చూపించే ప్రయత్నం, ఆయనను ఈ దేశ ముఖ్య నాయకుడిగా మార్చేసింది. బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ, కుటుంబ సంబంధాలు లేకుండా తన నిస్వార్థ సేవలో ప్రజల మనసు ఆయన గెలుచుకున్నారు. 2006 నుంచి 2014 వరకు యూపీఏ పాలనలో దేశ ప్రజలకు భద్రత లేకుండా పోయింది. సోనియా నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హిందువులను బలిపెట్టేందుకు మతహింస చట్టం తెచ్చేందుకు ప్రయత్నించింది. అయితే తీవ్ర ప్రజాందోళనలతో వెనక్కి తగ్గింది. దాంతో ఒక సామాన్యుడైన ఛాయ్ వాలాను ఈ దేశం స్వీకరించి నెత్తిన పెట్టుకొంది. అవినీతి, ఆశ్రితపక్షపాతం, కుల, కుటుంబ పాలనలకు చరమగీతం పాడుతూ మోడీ– అమిత్‌షా ద్వయం చేస్తున్న పాలనతో ఇప్పుడు ప్రతి భారతీయుడి గుండె ఆత్మనిర్భరంతో నిండింది. పాకిస్తాన్–చైనా విషయంలో వారి ధ్రుఢత్వం , పుల్వామా దాడికి ప్రతిగా సర్జికల్ స్ట్రయిక్ దేశ యువత మనసును సంతృప్తిపరిచింది. సైనికుల త్యాగాలకు విలువ కట్టడం మొదలైంది. వీటన్నిటితో పాటు దేశ ఆత్మగౌరవాన్ని పెంచే అనేక చర్యలు మోదీ తీసుకున్నారు. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ యోగా దినాన్ని ప్రకటించింది. అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటించిన ప్రధాని మోడీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు.
తెలంగాణలో కొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం
దేశంలోని పార్టీలన్నీ కుటుంబ, కుల పార్టీలుగా మారి ఏకచ్ఛత్రాధిపత్యంతో, నియంతృత్వంతో నడుస్తుంటే బీజేపీ మాత్రం నాలాంటి సామాన్య కార్యకర్తను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించగలిగింది. ఇక్కడ నాకు ‘‘నామ్ నహీ సిరఫ్ కాయ్ హై’’ అన్న నినాదం ప్రతి భారతీయుడి గుండెను తట్టి లేపుతుంది. ఇదే స్పూర్తితో తెలంగాణలో సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టాం. సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలను, అవినీతిని బట్టబయలు చేస్తాం. అక్రమంగా మజ్లీస్‌తో అంటకాగుతూ చేస్తున్న మైనార్టీ సంతుష్టీకరణను బట్టబయలు చేస్తాం. ఇదే బీజేపీ రాష్ట్ర శాఖ ముందున్న సరికొత్త లక్ష్యం. తెలంగాణలో బీజేపీ ప్రభంజనం మొదలైంది. ప్రధాని మోడీ నాయకత్వం, అమిత్ షా చాణక్యం, నడ్డా సారథ్యం.. వీరి స్ఫూర్తికి అనుగుణంగా తెలంగాణలో పుంజుకున్న బీజేపీ బండి మార్పు సాధించే దిశగా దూసుకుపోతోంది.
విశ్వగురువుగా ఇండియా
ప్రపంచం ఇండియాను విశ్వగురువుగా భావించే రోజు దగ్గరలోనే ఉంది. అందుకు ఉదాహరణ కరోనా వ్యాక్సిన్. సొంతానికే కాకుండా ప్రపంచ అవసరాల నిమిత్తం దాదాపు 70 దేశాలకు పైగా వ్యాక్సిన్‌ను మనదేశం సరఫరా చేస్తోంది. ట్రిపుల్ తలాక్ బిల్లుతో దేశంలోని ముస్లిం మహిళలకు సామాజిక ప్రతిష్టను, గౌరవ మర్యాదలను అందించేందుకు, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు, ముస్లిం స్త్రీల పట్ల వివక్షతను చెరిపేసేందుకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. సుదీర్ఘ కాలంగా రావణకాష్టంలా రగులుతున్న జమ్మూకాశ్మీర్ సమస్యకు పరిష్కారంగా మోడీ, షా ద్వయం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు నమ్మకం కలిగేలా చేసింది. అలాగే రామసేతును కూలగొట్టాలన్న దశలో 500 ఏండ్లుగా నానుతున్న “రామమందిర తీర్పు” ఈ దేశ ఆత్మను నిలబెట్టింది. అలాగే దేశంలోని చొరబాటుదారులను, అక్రమ వలసలను అరికట్టేందుకు తీసుకొచ్చిన సీఏఏ బిల్లు మరో మైలురాయి. ఇదంతా బీజేపీ చరిత్రలో సువర్ణ అధ్యాయాలు.
- బండి సంజయ్ కుమార్,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు