ప్రజాదరణ ఉన్న  వీ6 వెలుగుపై  బహిష్కరణా? : పందుల సైదులు

బీఆర్​ఎస్ అధికారానికి దాసోహమై ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్న క్రమంలో వీ6 చానెల్, వెలుగు దినపత్రిక ప్రభుత్వానికి 'నమస్తే' పెట్టకుండా ప్రజల తరఫున ఉండడమే బీఆర్ఎస్ పార్టీకి నచ్చలేదేమో! బహుశా అందుకే వీ6 వెలుగు దినపత్రికలను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసుకుందేమో!  ప్రజాస్వామ్యంలో పత్రికలు, ప్రతిపక్ష పార్టీ తరహాలో బలమైన పాత్రను పోషిస్తాయి.  మీడియా చేస్తున్న ప్రసారాలను సద్విమర్శగా తీసుకొని ప్రజలకు చేరువ కావలసిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ అక్కసుతో ప్రతీకార చర్యలకు పాల్పడితే పాలకులకే అది అనర్థంగా మారుతుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా ఉద్యమ స్ఫూర్తితో వీ6  వెలుగు  తనదైన పాత్రను పోషిస్తూ వస్తుంది. ఏ నీళ్లు, నిధులు, నియామకాల కోసమైతే తెలంగాణ సమాజం కొట్లాడిందో, అవి స్వరాష్ట్రంలో  ప్రజలకు దక్కాల్సి ఉందని ఆ వైపుగా వార్తలను ప్రసారం చేసిన ఏకైక మీడియా సంస్థ వీ6 వెలుగు అనడంలో  సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో గత 8 ఏళ్లుగా నిరుద్యోగుల ఆకాంక్షలను, రైతు సమస్యలను, రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలను, ఎత్తిచూపింది.  కృష్ణా, గోదావరి  నీటి వాటా, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి భారీ కుంభకోణాలను ప్రజల ముందు ఉంచింది.  భూ నిర్వాసితుల గోడులో భాగమైంది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చును లెక్కలతో సహా తెలంగాణ సమాజం ముందు ఉంచింది.  

కార్మికుల గోడును తన గోడుగా వెళ్లగక్కింది. 317 జీ.వో బాధిత ఉద్యోగుల గొంతుకై  నిలబడింది. దిశ నుంచి  ప్రీతి ఘటన వరకు మహిళల పై జరుగుతున్న అనేక అకృత్యాలను ఎత్తిచూపింది.  గిరిజనులు, ఆదివాసులకు తోడై నిలిచింది. వీ6 వెలుగును పాలకులు బాయికాట్​ చేసుకున్నంత మాత్రాన, వాటి ప్రజాదరణ పెరుగుతుంది తప్ప తగ్గదు. తెలంగాణ లో  ప్రభుత్వ చానల్ కు ఏమాత్రం ఆదరణ ఉందో పక్కకు పెడితే, 90% ప్రజలు వీ6 వెలుగును ప్రజలు ఆదరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక