![భార్య నోటికి ఫెవిక్విక్ వేసిన భర్త.. ఎందుకిలా చేశావని పోలీసులు అడిగితే..](https://static.v6velugu.com/uploads/2025/02/in-a-heartbreaking-incident-that-took-place-in-harokyatanahalli-nelamangala-taluk-husband-tried-to-murder-wife-by-putting-feviquik-in-her-mouth_m7bxfID2PQ.jpg)
బెంగళూరు: కర్ణాటకలోని నేలమంగళ పరిధిలోని హరోక్యతనహళ్లి అనే గ్రామంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక అనుమానపు భర్త తన భార్యను చంపేందుకు యత్నించాడు. తన భార్య నోటికి ఫెవిక్విక్ వేసి ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. ఈ ఘటనలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో భయంతో అక్కడ నుంచి పారిపోయాడు.
అతని మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు బాధితురాలి భర్తను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మంజుల, సిద్ధలింగస్వామి భార్యాభర్తలు. వీరికి పదేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మంజుల తరచుగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఫోన్ ఎక్కువగా వాడుతూ ఉండేది.
Also Read :- మనుషులు ఉండాలా..? పోవాలా..?
దీంతో.. సిద్ధలింగస్వామి తన భార్య మంజులపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉందని సూటిపోటి మాటలతో ఆమెను వేధించేవాడు. ఈ క్రమంలోనే. భార్యాభర్తల మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా కోపోద్రేకానికి గురైన సిద్ధలింగస్వామి మంజుల నోటికి ఫెవిక్విక్ వేసి ఆమెను చంపేందుకు యత్నించాడు. అయితే.. అదృష్టవశాత్తూ ఇరుగుపొరుగు వాళ్లు గమనించడంతో సిద్ధలింగస్వామి అక్కడ నుంచి పారిపోయాడు.
స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె నోటికి వేసిన ఫెవిక్విక్ను తొలగించే ప్రయత్నం చేశారు. పోలీసులు సిద్ధలింగస్వామిని అరెస్ట్ చేశారు. ఎందుకిలా చేశావని పోలీసులు అడగ్గా.. ఆమెకు అఫైర్ ఉందనే డౌట్ ఉందని, అందుకే ఫెవిక్విక్ వేసి నోరు మూయించి.. ఆ తర్వాత గొంతు నులిమి చంపాలనుకున్నానని నిందితుడు చెప్పాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.