- ముంబైలో ఆన్‌లైన్ మోసానికి గురైన ఐటీ ప్రొఫెషనల్
ముంబై: ఆన్‌లైన్లో ఫేక్ అడ్వర్టైజ్మెంట్పై క్లిక్ చేసి.. ముంబైకి చెందిన 49 ఏండ్ల ఐటీ ప్రొఫెషనల్ రూ.1.16 కోట్లు పోగొట్టుకున్నాడు. ముంబైలోని వసాయ్‌కి చెందిన ఐటీ ప్రొఫెషనల్.. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నాడు. అయితే, ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులను ప్రోత్సహించే ప్రకటనను చూశాడు. ఆ యాడ్‌లో పెట్టుబడి పెడితే అధిక రాబడిని వస్తుందని ఉంది. దీంతో బాధితుడు ఆ లింక్‌పై క్లిక్ చేశాడు. వెంటనే అతడు సుమారు 125 మంది సభ్యులతో కూడిన వాట్సాప్ గ్రూప్‌లోకి యాడ్ అయ్యాడు.
అందులో చాలా మంది స్టాక్ మార్కెట్లో గణనీయమైన లాభాలను ఆర్జించామని పేర్కొన్నారు. అయితే, తాను కూడా అలాంటి రాబడిని పొందాలనే ఆశతో తన బ్యాంకు ఖాతా వివరాలను సెండ్ చేశాడు. అనంతరం ఆగస్టు 16 నుంచి 20 మధ్య అతను గ్రూప్ లోని ఎక్స్పర్ట్స్ సూచనల ప్రకారం చాలా ఖాతాలలోకి 1.16 కోట్ల రూపాయలను బదిలీ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా ఎర్రర్స్ కనిపించాయి. అయితే, దానిని సాల్వ్చేసేందుకు స్కామర్‌లు అదనంగా మరికొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అతడు స్కామ్‌కు గురైనట్టు గ్రహించాడు. మోసంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.