గణతంత్ర దేశంలో.. రక్షణ రంగం ఘనత : సోషల్ ఎనలిస్ట్ మేకిరి దామోదర్

స్వతంత్ర భారతదేశంలో ఇంటా బయటా కయ్యానికి కాలు దువ్వుతున్న సవాళ్లు నేటికీ ఉన్నాయి. అలాంటి వారికి ధీటుగా గగన వీధుల్లో గర్జించే యుద్ధ విమానాలు, సముద్ర జలాల్లో సత్తా చాటే యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, భూతలంపై శత్రు లక్ష్యాలను ఛేదించే యుద్ధ ట్యాంకులు, క్షిపణులు ఇలా దేశ రక్షణలో త్రివిధ దళాలకు తోడు పటిష్టమైన ఆయుధ సంపత్తి మన దేశానికి సొంతం. ఒకప్పటితో పోలిస్తే.. రక్షణ రంగం ఇప్పుడు స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ బలంగా తయారవుతున్నది. మన దేశానికి సుమారు పదిహేను వేల కిలోమీటర్లకు పైగా ఏడు దేశాలతో సుదీర్ఘ భూ సరిహద్దు ఉన్నది. ఇందులో  మైదాన ప్రాంతం కొంతే ఉంటే, మిగతాది ఎడారి నేలలు, అడవులు, కొండలు, లోయలు, మంచు పర్వతాలే. అందుకే సందు దొరికితే సరిహద్దులు దాటి చొచ్చుకొని వచ్చి ఆక్రమించాలని, దొంగ చాటుగా సంఘ విద్రోహశక్తులు దేశంలోకి చొరబడాలని ప్రయత్నిస్తుంటాయి. వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ దేశ రక్షణకు తమ ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా14 లక్షలకుపైగా ఉన్న మన త్రివిధ దళాలు నిరంతరం రెప్పవాల్చకుండా శ్రమిస్తున్నాయి. సైన్యానికి తోడు ఆధునిక ఆయుధ సంపత్తి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నది. మన రక్షణ రంగం గత ఏడున్నర దశాబ్దాలుగా క్రమంగా వృద్ధి చెందుతున్నది. కేంద్ర ప్రభుత్వం అంకుర పరిశ్రమల భాగస్వామ్యంతో దేశ రక్షణ భద్రతను పటిష్టం చేసేందుకు ‘ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్’ కార్యక్రమం చేపట్టింది. ఇండియా ఆయుధాల కొనుగోలు దశ నుంచి నేడు ఇతర దేశాలకు అమ్మే స్థాయికి చేరుకుంది. చైనా, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 3,595 కి. మీ రహదారులను రూ .20,767 కోట్లతో భారత్ నిర్మిస్తున్నది. అమెరికా యుద్ధనౌక యుఎస్ఎన్ఎస్ చార్లెస్ డ్రూ.. మరమ్మతుల కోసం ఇటీవల చెన్నై చేరుకుంది. అగ్రరాజ్య నేవీ షిప్ మన దేశంలో మరమ్మతులు చేయించుకోవడం ఇదే మొదటిసారి. భారత్ లో ఆయుధాల తయారీ ఊపందుకుంది. మన ఆయుధాలను మనమే తయారుచేసుకోవడంతో పాటు మరొకరికి అమ్మే దిశగా అడుగులు వేస్తున్నాం. శత్రు దేశాలకు ధీటుగా, అగ్రదేశాలకు పోటీగా ఆయుధాల తయారీలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలను కేంద్రం ప్రోత్సహిస్తున్నది. రష్యా నుంచి కొనుగోలు చేసిన టీ-53, టీ-72, టీ 90 యుద్ధ ట్యాంకులు ఉండగా, ‘కర్ణ’ పేరుతో అత్యాధునిక యుద్ధ ట్యాంకుల తయారీలో ఇండియా ముందుకు వెళ్తున్నది. పైలెట్ రహిత యుద్ధ విమానాలు నిశాంత్, లక్ష్య,  రుస్తుంలను డీఆర్ డీవో అభివృద్ధి చేసింది. జలాంతర్గాములున్న ఆరో దేశంగా భారత్​ప్రపంచంలో నిలిచింది. సూపర్ సోనిక్ బ్రహ్మోస్-1 క్షిపణి రష్యా సహకారంతో మన దేశం సిద్ధం చేసింది. 

సైనికుల ప్రత్యేకతలు

ప్రపంచ దేశాల సైనిక శక్తిని విశ్లేషించే ‘గ్లోబల్ ఫైర్ పవర్’ సంస్థ అమెరికా, రష్యా, చైనాల తర్వాత నాలుగో స్థానం మన దేశానిదేనని చెప్పింది. సంఖ్యాపరంగా సైనికులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మనది రెండో స్థానం. భారతీయ సైన్యం నిర్వహిస్తున్న హై అల్టిట్యూడ్ వార్ ఫేర్ స్కూల్ ప్రపంచంలోనే ప్రముఖ శిక్షణ సంస్థల్లో ఒకటి. డెహ్రాడూన్ లోని భారతీయ మిలటరీ అకాడమీలో, మిజోరాంలోని జంగిల్ వార్ ఫెయిర్ స్కూల్​లో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ సహా ఇతర దేశాల సైనికులకు మన భారతీయ సైన్యం శిక్షణ ఇస్తుండటం విశేషం. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సైన్యాల్లో మన దేశానిది రెండో స్థానం. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ మన దేశంలోనే పెద్ద నిర్మాణ సంస్థ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తు మీద ఉన్న‘బెయిలీ బ్రిడ్జ్’ ను కట్టింది మన నవ సైన్యమే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధభూమి సియాచిన్ గ్లేసియర్ మనదే. నేడు స్వదేశీ తేజస్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు పలుదేశాలు చూస్తున్నాయి.

అగ్ర దేశాలతో పోటీ..

గత కొన్నేండ్లలో మన రక్షణ రంగం బాగా బలపడింది. 1947లో మొత్తం రక్షణ సిబ్బంది సామర్త్యం 2 లక్షల 60 వేల మంది అయితే ఇప్పుడు 14 లక్షల 55 వేలు. ఎయిర్​ఫోర్స్​ విమానాలు అప్పడు 142 ఉంటే ఇప్పుడు 2,182 ఉన్నాయి. యుద్ధ నౌకలు 1947లో 32 ఉంటే ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగాయి. జలంతర్గాములు అప్పట్లో ఒకటి కూడా లేకపోగా ఇప్పుడు దాదాపు17 ఉన్నాయి. ఒకప్పుడు 18 ఉన్న శతఘ్నులు ఇప్పుడు ఏకంగా 3,411కి చేరడం గమనార్హం. నాడు ఒక్క యుద్ధ ట్యాంకు కూడా లేకపోగా, ఇప్పుడు ఉన్నవి 4,615. క్షిపణులు 7 రకాలు ఉన్నాయి. ఆనాడు రక్షణ రంగానికి ఉన్న బడ్జెట్​రూ.92.74 కోట్లు అయితే, ఇప్పుడు రూ .5,25,166 కోట్లు కావడం గమనార్హం. ఇదంతా గత కొన్నేండ్లుగా ఇండియా రక్షణ రంగం సాధించిన వృద్ధి. కానీ ఇంతటితో ఆగకుండా మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉన్నది.  చైనా, పాకిస్తాన్ ల నుంచి నిత్యం ఎదురయ్యే భద్రతా సవాళ్లను, ముప్పును అధిగమించడానికి మరింత సిద్ధం కావాలి. అగ్రదేశాలతో పోటీపడి భారత్ ను రక్షణ పరిశోధన ఆయుధాల హబ్ గా మార్చాల్సిన అవసరం ఉన్నది. త్రివిధ దళాలను ఏకతాటి పైకి తెచ్చే ‘థియేటరైజేషన్’ ను వేగంగా పూర్తి చేయాలి. కాలం తీరిన సాంకేతికను ఆధునికీకరించాలి. భవిష్యత్తు యుద్ధాలన్నీ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో జరగనున్నందున అందుకు తగ్గట్టుగా త్రివిధ దళాలు సైబర్ యుద్ధ నైపుణ్యాలు పెంచుకోవాలి. మన అంతర్జాతీయ విధానం శాంతిస్థాపనే.  అనివార్యంగా ఆత్మ రక్షణ కోసం సిద్ధమవడం కోసమే ఈ సంసిద్ధత. భారతదేశానిది మొదటి నుంచీ కయ్యానికి కాలుదువ్వే స్వభావం కానే కాదు. అయితే ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రత్యర్థుల కంటే ధీటుగా, అగ్రరాజ్యాలకు మేటిగా ఆయుధాల సంపత్తితో ఆత్మ నిర్భరత సాధించాలి. ప్రపంచంలోనే ధీరోదత్త దేశంగా నిలబడటమే నేడు మన ముందున్న కర్తవ్యం. 

- మేకిరి దామోదర్, సోషల్ ఎనలిస్ట్