అమెరికాలో దారుణం.. ఇండియాకు చెందిన తండ్రీకూతురితో తాగుబోతు గొడవ.. గన్తో ఇద్దరినీ కాల్చేశాడు..

అమెరికాలో దారుణం.. ఇండియాకు చెందిన తండ్రీకూతురితో తాగుబోతు గొడవ.. గన్తో ఇద్దరినీ కాల్చేశాడు..

వర్జీనియా: అమెరికాలో దారుణం జరిగింది. గుజరాత్కు చెందిన తండ్రి, కూతురు అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ముందు జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో చనిపోయిన తండ్రీకూతురును గుజరాత్కు చెందిన ప్రదీప్ భాయ్ పటేల్ (56), ఆయన కూతురు ఉర్మి (26)గా వర్జీనియా పోలీసులు గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

కాల్పులకు తెగబడిన దుండగుడిని ఆఫ్రికన్-అమెరికన్ అయిన జార్జ్ ఫ్రాజిర్ డెవన్ వార్టన్గా గుర్తించారు. డిపార్ట్మెంట్ స్టోర్ ప్రదీప్ భాయ్ పటేల్కు చెందినదిగా పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున స్టోర్ తెరవడానికి వచ్చిన ప్రదీప్, ఆయన కూతురు ఉర్మితో నిందితుడు గొడవ పడినట్లు తెలిసింది. స్టోర్ ఎందుకు మూసేశారని, ఆల్కహాల్ కొనడానికి వస్తే స్టోర్ మూసేసి ఉందని, రాత్రంతా తాను స్టోర్ ముందే వేచి చూస్తూ ఉన్నానని తండ్రీకూతురితో నిందితుడు ఘర్షణకు దిగాడు. ఈ గొడవ చిలికిచిలికి గాలి వానగా మారింది.

క్షణికావేశంలో నిందితుడు తన వెంట తెచ్చుకున్న గన్తో ప్రదీప్ను, ఆయన కూతురు ఉర్మిని తుపాకీతో కాల్చాడు. ఈ కాల్పుల్లో ప్రదీప్ శరీరంలో రెండు బులెట్లు దిగాయి. ఉర్మిపై ఒకసారి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ప్రదీప్ భాయ్ పటేల్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా, ఆయన కూతురు ఉర్మిని ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందిస్తుండగా చనిపోయింది. ఈ ఘటన జరిగిన రెండు గంటల వ్యవధిలోనే అమెరికా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆరేళ్ల క్రితం ప్రదీప్ భాయ్, అతని భార్య హన్సాబెన్ విజిటర్ వీసాపై తమ కూతురు ఉర్వితో కలిసి అమెరికాకు వెళ్లారు. ప్రదీప్ పటేల్ మరో కూతురు కెనడాలో స్థిరపడగా, ఇంకో కూతురు అహ్మదాబాద్లో స్థిరపడటం గమనార్హం.