ఎలక్షన్​ క్యాంపెయిన్​కు..ఎండ దెబ్బ

  •     అభ్యర్థుల్లో  కనిపించని ఉత్సాహం
  •     పార్టీ సమావేశాలకే పరిమితం
  •     ఉదయం నుంచే దంచికొడుతున్న ఎండలు   

ఆదిలాబాద్, వెలుగు :  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ఎండ దెబ్బ తగిలింది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో సడిసప్పుడు లేదు.  జిల్లాలో ప్రతి రోజు 40+ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అభ్యర్థులు.. పార్టీ కార్యక్రమాలకే తప్ప ప్రజల్లోకి ఇంకా పూర్తిగా  వెళ్లడం లేదు. వారం రోజులుగా పార్టీ కార్యకర్తలు మీటింగ్ లకే పరిమితమవుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు ముందు ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేకపోవడంతో ఎన్నికల ప్రచారం కళ తప్పింది. అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే గ్రామాల్లో తిరిగిన ప్రచార రథాలు ఇంకా సిద్ధం కాలేదు.  

ఇప్పుడా ముచ్చటే లేదు!

అసెంబ్లీ ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనిపించింది. రాజకీయ పార్టీలే కాకుండా సామాన్యులు సైతం ఎన్నికలపై ఆరా తీస్తూ ఎక్కడ చూసినా అదే ముచ్చట వినిపించేది.  కానీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల సందడి లేదు. ఎన్నికల ప్రచారంలో ప్రచార రథాలు, పార్టీల పాటలు ఓటర్లను ఎంతగానో ఆకర్షిస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి తరఫున ప్రచార రథాలు పెద్ద ఎత్తున తిరిగాయి.  ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 వరకు నెల రోజుల పాటు ఎక్కడ చూసినా పార్టీల పాటలే వినిపించేది. కానీ  ఇప్పుడు ప్రచార రథాల సందడి కనిపించడం లేదు. 

నియోజకవర్గాన్ని చుట్టేస్తోన్న మంత్రి సీతక్క

రాష్ట్రంలో  మే 13న లోక్ సభ ఎన్నికలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు, బీజేపీ నుంచి గోడం నగేశ్​, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి మంత్రి సీతక్క పార్లమెంట్ నియోజకవర్గం చుట్టేస్తోంది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో విస్త్రతంగా పాల్గొంటున్నారు.  అభ్యర్థులు మాత్రం ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టడం లేదు. ఎండల తీవ్రత దృష్ట్యా వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ప్రజలు సైతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పార్లమెంట్ ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపడం లేదు. 

జన సమీకరణ కష్టమే..

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి వెంట ప్రచారంలో దాదాపు 200 మందికి పైగా జనాలు, కార్యకర్తలు కనిపించేవారు.  ప్రచారంలో జన సమీకరణ పెద్ద ఎత్తున చేశారు. బహిరంగ సభల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పార్లమెంట్‍ఎన్నికల్లో ప్రచారానికి జనసమీకరణ చేయడం కష్టంగానే మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి రోజు నగదు, భోజనం ఇలా ఏదో ఒకటి ఇచ్చి జన సమీకరణ చేసుకున్నారు. ఇప్పుడు ఎండల తీవత్రకు పనులన్నీ వదులుకొని ఇంట్లోనే ఉంటున్న జనాలు ఇక ప్రచారానికి ఎలా వెళ్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఉదయం, సాయంత్రం మాత్రమే ప్రచార కార్యక్రమాలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో అభ్యర్థులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.