- ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి
ఆదిలాబాద్, వెలుగు: ముందస్తు ఎలక్షన్ల ప్రచారంతో ఆదిలాబాద్జిల్లాలోని రాజకీయ పార్టీల నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఓవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల ప్రచారంలో తీరిక లేకుండా ఉంటే...ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా నిత్యం ప్రజా సమస్యలపై ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ లో వర్గపోరు, పార్టీలోని చోటా మోటా లీడర్లపై వస్తున్న భుకబ్జాల ఆరోపణలు, ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం వంటి అంశాలు ఆ పార్టీ నేతలను కలవరపరుస్తున్నాయి. రాను రాను బీజేపీ బలం పెరిగిపోతుండటం, కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల్లో చేరుతుండడం, కాంగ్రెస్ మునుపటి ఉనికి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుండడంతో జిల్లాలో రాజకీయం రసకందాయంలో పడింది.
పరిష్కారం కాని సమస్యలెన్నో..
జిల్లాలో ఆదిలాబాద్ జనరల్ తో పాటు బోథ్ ఎస్టీ రిజర్వ్ సీట్లున్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రెండు సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రమే పరిమితమవుతున్న ఇక్కడి నేతలు..ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పట్టించుకోవడం లేదు. ఎండాకాలంలో గిరిజన ప్రాంతాలన్నీ నీళ్ల కోసం అల్లాడుతుంటాయి. గతేడాది తాగునీటి కోసం ఊళ్లకు ఊళ్లే పాదయాత్రలు చేశాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదు. ఇక మారుమూల ప్రాంతాలకు రోడ్లు లేక వర్షాకాలంలో జనాల ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటు వేసినప్పుడు, గర్భిణుల డెలివరీల టైంలో, ఇతర అత్యవసర పరిస్థితుల్లో కనీసం అంబులెన్సులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక సాత్నాల, మత్తడివాగు కాల్వలు దెబ్బతినడంతో పూర్తి స్థాయిలో సాగునీరందడం లేదు. ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 50 వేల ఎకరాలకు సాగునీరందించే చనాఖా కోర్టా, నేరడిగొండలో 18 వేల ఎకరాలకు సాగునీరందించే కుప్టీ ప్రాజెక్టు పై ముందడుగు పడడం లేదు. ప్రతి ఎన్నికల్లో నేతలకు హామీ ఇచ్చే అంశాలుగానే మిగులుతున్నాయి. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అధికార పార్టీకి తలనొప్పి..
రెండు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ను వర్గపోరు వేధిస్తోంది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండగా సొంత పార్టీలో అసమ్మతి వచ్చే ఎన్నికల్లో తలనొప్పి తెచ్చే అంశంగా మారింది. ఇటీవల ఆదిలాబాద్, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల విషయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తమను పట్టించుకోలేదని సొంత పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి చెందిన ఓ డైరెక్టర్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీషాతో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న డెయిరీ డెవలప్ మెంట్ మాజీ చైర్మెన్ లోక భూమారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీల్లోని కొంత మంది బీఆర్ఎస్ లీడర్లపై భూకబ్జాలతో పాటు అనుమతులు లేకుండా ప్లాట్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
బీజేపీలోనూ పోటీ..
ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీజేపీ బలంగా కనిపిస్తోంది. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న పాయల్ శంకర్ మరోసారి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచారు. బలమైన క్యాడర్ తో పాటు బీజేపీ వైపు యువత ఎక్కువగా మొగ్గు చూపుతుండడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం వారికి అనుకూల అంశంగా మారింది. ఈయనతో పాటు మాజీ జడ్పీ చైర్పర్సన్సుహాసిని రెడ్డి కూడా బీజేపీలో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో, పట్టణ వార్డుల్లో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోపక్క ఇటీవల బీజేపీలో చేరిన ఎన్నారై కంది శ్రీనివాస్ రెడ్డి సైతం ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఉనికి కోసం కాంగ్రెస్ ఒకప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కొంత డీలా పడింది. గతంలో బలమైన క్యాడర్ ఉన్న ఈ పార్టీ నుంచి చాలా మంది లీడర్లు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. దీంతో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు స్థానిక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాము ఏం చేశామో చెప్పుకోవడంతో పాటు ఇప్పటి బీఆర్ఎస్సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న గండ్రత్ సుజాత ఈ సారీ టికెట్ ఆశిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ సైతం ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
బోథ్ బీఆర్ఎస్లోనూ పడతలేదు
బోథ్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలోనూ వర్గ పోరు సమస్య ఉంది. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ కు, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు విభేదాలున్నాయి. మాజీ ఎంపీ గొడం నగేశ్ తో పాటు నేరగడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. అనిల్ జాదవ్ గతంలో రెండు సార్లు కాంగ్రెస్ నుంచి, మరోసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌లో ఓ వర్గం ఈయనకు వ్యతిరేకంగా పని చేసి ఓటమికి కారణమైందని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో అనిల్బీఆర్ఎస్ లో చేరి జడ్పీటీసీ గా గెలుపొందారు. ప్రస్తుతం కేటీఆర్‌తో మంచి సంబంధాలు ఉండడం ఈయనకు కలిసి వచ్చే అంశం. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు అనిల్‌తో పాటు నగేశ్కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఆ పార్టీ ఓటు బ్యాంకు చీలి రాథోడ్ బాపురావు విజయాశకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
బోథ్‌లో పట్టు కోసం ప్రతిపక్షాల ప్రయత్నం
గత ఎన్నికల్లో బోథ్నియోజకవర్గానికి చెందిన సోయం బాపురావు బీజేపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దీంతో ఆయనకు బోథ్ లో బలమైన క్యాడర్ ఉంది. అయితే దీన్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ నుంచి గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాకటి దశరథ్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ కూడా ఎక్కువగా ప్రజల్లోనే ఉంటున్నారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈయన
ఏ పార్టీలో లేకపోయినప్పటికీ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈయన కూడా వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారన్న టాక్ నడుస్తోంది. ఇక బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు లేకుండా పోయాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది. గతంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన నేరడిగొండ మండలానికి చెందిన అడె గజేందర్ కాంగ్రెస్‌లో చేరి వచ్చే ఎన్నికల్లో బోథ్ టికెట్ ఆశిస్తున్నారు. తాంసీ మండలానికి చెంది వన్నెల అశోక్ అనే డాక్టర్కూడా కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తూ పలు కార్యక్రమాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే జోగు రామన్న
పార్టీ: బీఆర్ఎస్
2018లో వచ్చిన
ఓట్లు 74,050
మెజారిటీ: 26,606
ప్రత్యర్థి: పాయల్ శంకర్ (బీజేపీ)
ఓట్లు 47,444
గండ్రత్ సుజాత ( కాంగ్రెస్)
ఓట్లు: 32,200
అనుకూల అంశాలు.
- క్యాడర్ బలంగా ఉండడం. బలమైన మున్నూరు కాపు సామాజికవర్గం మద్దతు, మైనార్టీ ఓట్ల దన్ను
- ఆదిలాబాద్ టౌన్అభివృద్ధి. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండడం
- ఎమ్మెల్యే స్థాయిలో పార్టీలో పోటీ లేకపోవడం. నిత్యం జనాల్లో తిరుగుతుండడం
ప్రతికూల అంశాలు..
- ఇప్పటి వరకు 5 శాతం డబుల్ ఇండ్లను కూడా పంపిణీ చేయలేకపోవడం.
- 50 వేల ఎకరాల సాగునీరందించే చనాఖా కోర్టా ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం, కోర్టా గ్రామస్తులకు 213 ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం.
- యాపల్ గూడ సమీపంలో రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించకపోవడం.
- బంగారుగూడలో 800 ఇండ్లకు పట్టాలివ్వకుండా సర్వేల పేరుపై కాలయాపన.
- పార్టీని నమ్ముకొని మొదటి నుంచి ఉన్న వారికి పదవుల విషయంలో అన్యాయం.
బోథ్ నియోజకవర్గం
జనాభా 2,59,553
ఓటర్లు 2,01,034
పురుషులు 98,456
మహిళలు 1,02,576
థర్డ్‌జెండర్ 2
అనుకూల అంశాలు..
- సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రతి గ్రామంలో పర్యటించడం
- ప్రతిపక్షంలో బలమైన నాయకత్వం లేకపోవడం
ప్రతికూల అంశాలు..
- పార్టీలో కార్యకర్తలందరినీ కలుపుకొని వెళ్లకపోవడం
- డబుల్ బెడ్ ఇండ్లు, దళితబంధు పథకంలో అనుచరులు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు
- కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణం ఇంత వరకు ముందుకు పడకపోవడం.
- మాజీ ఎంపీ గొడం నగేశ్, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ నుంచి వర్గపోరు
- బోథ్, ఇచ్చోడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించలేకపోవడం