న్యూఢిల్లీ: ఆయిల్ కంపెనీలు మరోసారి జనం జేబుకు చిల్లు పెట్టాయి. దేశమంతటా పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం పెంచాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో రూ.100 దాటాయి. పెట్రోల్ ధర లీటరుకు 27 పైసలు, డీజిల్ ధర లీటరుకు 28 పైసలు పెరిగింది. - గత 30 రోజుల్లో 18 సార్లు ధరలను పెంచారు. ఢిల్లీలోనూ పెట్రోల్ రేటు ఆల్ టైం హై రూ. 94.76 వద్దకు చేరుకుంది. డీజిల్ ధర లీటరుకు రూ. 85.66 గా ఉంది. వ్యాట్, సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నులను బట్టి వీటి ధరలు రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారుతూ ఉంటాయి. ఎక్కువ వ్యాట్ వసూలు చేసే రాజస్థాన్, మధ్యప్రదేశ్ మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో పెట్రోలు ధర లీటరుకు రూ.100పైగా ఉంది. పెట్రోల్ ధరలు ఆదిలాబాదులో రూ. 100.57లకు, నిజామాబాదులో రూ. 100.17లకు చేరుకున్నాయి. ఏపీలోనూ కొన్నిచోట్ల పెట్రోల్ రేట్లు సెంచరీ దాటాయి. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. ముంబైలో గత నెల 29న పెట్రోల్ లీటరు ధర రూ. 100 కు చేరింది. అక్కడ ఇప్పుడు లీటరు పెట్రోల్ రేటు రూ.100.98లకు, డీజిల్ రేటు రూ. 92.99 లకు పెరిగింది. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో దేశంలోనే పెట్రోల్ రేట్లు అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ లీటరు పెట్రోల్ కు రూ.105.81లు తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ షహదోల్ జిల్లాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 105.18లకు, డీజిల్ ధర రూ. 96.31లకు చేరుకుంది.
శుక్రవారం నాటి ధరలు
సిటీ పెట్రోల్ డీజిల్
హైదరాబాద్ 98.48 93.3
ఢిల్లీ 90.78 81.10
ముంబై 97.19 88.20
అదిలాబాబాద్ 100.57 95.20
నిజామాబాద్ 100.17 94.74