ఆదిలాబాద్ లో పదవులపై నాన్చుతున్న అధికార పార్టీ

మార్కెట్లలో అభివృద్ధి పనులకు ఆటంకం

ఆదిలాబాద్, వెలుగు : అధికార టీఆర్ఎస్ లో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. మార్కెట్​ కమిటీల నియామకాలపై నాన్చుడు ధోరణి తో ఆపార్టీ లీడర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, జైనథ్, ఇంద్రవెల్లి, బోథ్, ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా..  ఇంద్రవెల్లి కింద నార్నూర్, జైనథ్ కింద బేల సబ్ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి  పాలకవర్గాలు అవసరం. అలాంటిది ఆదిలాబాద్, జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గం గడువు ముగిసి ఏడాది అవుతున్నా..  కొత్త పాలక వర్గాన్ని నియమించలేదు. జిల్లాలోనే అతి పెద్దదైన ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్​ పదవి కోసం తీవ్ర పోటీ ఉంది. మార్కెట్ కమిటీ ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఏడాదీ దాదాపు రూ. 8 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. దీని పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. అయితే  మార్కెట్​లో ఎలాంటి పనులు చేపట్టాలన్నా పాలక వర్గం  ఆమోదం కావాలి.  కానీ,  ఇప్పుడు ఏడాది నుంచి ఎలాంటి పనులు జరగడం లేదు.  అయినా  నియామకంపై పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే జైనథ్ తో రెండేళ్లు గడువు ముగిసినప్పటికీ పట్టించుకోవడం లేదు. 

రిజర్వేషన్​ ఎస్టీలకే..

ఈసారి ఆదిలాబాద్, జైనథ్ రెండు వ్యవసాయ మార్కెట్లకు ఎస్టీ మహిళ లకు కేటాయించారు.   ప్రస్తుతం ఎస్టీ మహిళలకు కేటాయించగా.. కమిటీ నియామకంలో ఆలస్యం చేయడం పట్ల ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెండు పాలకవర్గాల కమిటీ లపై ఎమ్మెల్యే జోగురామన్న నిర్ణయమే ఫైనల్ కాగా.. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పాలవర్గాన్ని నియమించకపోవడం ఏంటని ఆయా వర్గాల నుంచిప్రశ్నలు వస్తున్నాయి.

అభివృద్ధి పనులేవి? 

ఆదిలాబాద్ మార్కెట్​కు యార్డుకు దాదాపు రూ. 8.60 కోట్ల ఆదాయం, జైనథ్ మార్కెట్ కమిటీ కి   దాదాపు రూ. 4 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. దీని పరిధిలో సబ్ మార్కెట్ కమిటీగా ఉన్న బేలలో పత్తి కొనుగోళ్లు ఎక్కువగా జరుగడంతో ఆదాయం ఉంటుంది. ఈ నిధులతో మార్కెట్ అభివృద్ధి పనులతో పాటు రైతులకు వసతులు కల్పించవచ్చు. కానీ పాలకవర్గాలు లేకపోవడంతో ఇక్కడి అధికారులు అభివృద్ధి పనులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది.