టీవీ చానెల్ ఓపెన్ ​డిబేట్​లో .. కుర్చీలతో కొట్టుకున్న బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు

  • వరంగల్​లో ఓ టీవీ చానెల్ ఓపెన్ ​డిబేట్​లో ఫైట్
  • అనుకోని ఘటనతో అదుపు తప్పిన చర్చ.. ఆగమాగం

వరంగల్‍, వెలుగు: వరంగల్​లో ఓ టీవీ చానెల్​నిర్వహించిన ఓపెన్​డిబేట్ రసాబాసగా మారింది. డిబేట్​లో పాల్గొన్న నేతలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లగా, అక్కడే ఉన్న ఇరువర్గాల అనుచరులు, కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. సోమవారం సాయంత్రం వరంగల్​ఈస్ట్​నియోజకవర్గంలోని ఖిళా వరంగల్​కుషుమహల్ వద్ద ఓ ప్రముఖ టీవీ చానెల్​ఓపెన్​డిబేట్​నిర్వహించింది. బీఆర్ఎస్​నుంచి స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్​రావు, కాంగ్రెస్​నుంచి జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్‍తోపాటు అక్కడున్న కొందరు బీఆర్‍ఎస్‍ నేతలు మాట్లాడుతూ.. రూ.4,100 కోట్లతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. 24 అంతస్తుల హాస్పిటల్‍ కట్టించామని, లబ్ధిదారులకు 2 వేల డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు, 3 వేల మందికి గృహలక్ష్మి ఇచ్చామని  చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేతలకు దమ్ముంటే చూసేందుకు రావాలని సవాల్​విసిరారు. స్పందనగా బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‍రావు మాట్లాడుతూ.. రాణి రుద్రమ గడ్డగా చెప్పుకునే వరంగల్‍ తూర్పులో బీఆర్ఎస్​హయాంలో టూరిజం ఏమైనా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు. కేసీఆర్‍ చెప్పిన అభివృద్ధి ఏది అని నిలదీశారు. రూ.4,100 కోట్ల అభివృద్ధి నిజమైతే.. మొన్నటి వరదలకు కాలనీలు ఎందుకు నీట మునిగాయి అని అడిగారు.

 రెండ్రోజులు జనాలు రోడ్డు మీదకు రాలేక.. వంట చేసుకోలేని పరిస్థితి ఎందుకొచ్చిందన్నారు. కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువులు ఏవి అని నిలదీశారు. వరదల సమయంలో కేటీఆర్‍ వరంగల్‍ పర్యటించి.. అది చేస్తాం.. ఇది చేస్తామన్నాడే తప్ప చేసిందేమీ లేదన్నారు. రూ.500 కోట్లు ఖర్చు పెడితే వరదలు ముంచెత్తేవి కాదన్నారు. 24 అంతస్తుల హాస్పిటల్‍ కడుతున్నామని చెప్పి.. సెంట్రల్‍ జైల్‍ భూములను కుదువ పెట్టి రూ.1,100 కోట్లు అప్పు తెచ్చారన్నారు. ఇదేనా బీఆర్ఎస్ ​చేసిన అభివృద్ధి అంటూ నిలదీశారు. దీంతో అక్కడే ఉన్న నరేందర్‍ అనుచరులు ప్రదీప్‍రావు మాట్లాడడం ఆపాలని అడ్డుకున్నారు. ప్రదీప్​రావు వారి తీరును నిరసిస్తూ..‘‘ యథా రాజా తథా ప్రజా” అన్నారు. ప్రదీప్‍రావు, కొండా మురళీని ఉద్దేశించి ఎమ్మెల్యే నరేందర్‍ మాట్లాడుతూ.. ‘‘వీళ్లు ఈ ఊరోళ్లు కాదు.. దమ్ముందా? కరోనా టైంలో ఎక్కడికి పోయారు.”అంటూ తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఒకడు వర్ధన్నపేట, ఒకడు వంచనగిరి.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కి అదుపు తప్పింది. చుట్టూ ఉన్న ఎమ్మెల్యే అనుచరులు కుర్చీలను విసిరికొట్టారు. కొందరు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. మెరుగు ఉదయ్‍ అనే బీజేపీ  కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సదరు చానెల్​వాళ్లు తలలు పట్టుకున్నారు. ఎమ్మెల్యే తన అనుచరులను సముదాయించుకోవాలంటూ పలుమార్లు రిక్వెస్ట్​ చేశారు. తర్వాత ప్రదీప్‍రావు మాట్లాడుతూ.. వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో సమస్యలపై ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే నరేందర్‍ సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణకు దిగాడన్నారు. తన అనుచరులు, గూండాలతో కలిసి తమపై దాడులు చేశాడని, పోలీసులు వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‍ చేశారు