ముక్కోణంతోనే ‘చే’జారిన పేట

  • బీజేపీ ఓట్ల చీలికతో మరోసారి బయటపడ్డ జగదీశ్ రెడ్డి  
  •     సంకినేని కష్టమంతా బీఆర్‌‌‌‌ఎస్‌‌ పాలు
  •     ఫలించని దామన్న చివరిసారి సెంటిమెంట్  

సూర్యాపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో 11 చోట్ల హస్తం హవా కొనసాగినా.. సూర్యాపేటలో మాత్రం గులాబీ జెండానే ఎగిరింది. 2014, 2018 ఎన్నికల మాదిరిగానే జగదీశ్‌‌ రెడ్డికి ఈ సారి కూడా బీజేపీ ఓట్లు చీల్చడం కలిసివచ్చింది.  దీంతో కాంగ్రెస్‌‌ అభ్యర్థి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డికి మరోసారి ఓటమి తప్పలేదు.  

చివరి సారి అవకాశం ఇవ్వాలని దామోదర్ రెడ్డి, ఒక్కసారి ఎమ్మెల్యేగా చాన్స్ ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరావు సెంటిమెంట్ ప్లే చేసినా..  వర్కవుట్ కాలేదు.  కాంగ్రెస్ గాలిలోనూ జగదీశ్ రెడ్డి హ్యాట్రిక్ సాధించారు.

 
 మూడో‘సారీ’..


ఒకప్పుడు కాంగ్రెస్ కంచు కోటగా పేరున్న సూర్యాపేట ముక్కోణపు పోటీతోనే మూడు సార్లు  చేజారిపోయింది. 2014లో జగదీశ్ రెడ్డి తెలంగాణ సెంటి మెంట్‌‌తో బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి మొదటి సారి గెలుపొందారు.  ఈ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డికి 43554 ఓట్లు రాగా.. సంకినేనికి 41335 ఓట్లు వచ్చాయి.  దీంతో కాంగ్రెస్‌‌ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి  సల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.  

2018లో కాంగ్రెస్‌‌ టికెట్‌‌ కోసం పటేల్ రమేశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి పోటీపడ్డారు. కానీ,  హైకమాండ్ చివరి నిమిషంలో  దామోదర్ రెడ్డికే టికెట్  కేటాయించింది. ఈ సారి కాంగ్రెస్ వేవ్ ఉన్నా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌కు 75143 ఓట్లు, కాంగ్రెస్‌‌కు 70537,  బీజేపీ 40407 ఓట్లు వచ్చారు. దీంతో దామోదర్ రెడ్డి 4606 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీఎస్పీ నుంచి పోటీ చేసిన వట్టె జానయ్య 13907 ఓట్లు చీల్చడం, చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా కాంగ్రెస్‌‌ ఓటమి కారణమని తెలుస్తోది. 


సెంటిమెంట్ వర్కవుట్ కాలే


కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి తనకు ఇవే చివరి ఎన్నికలని, నెక్ట్స్ టైం పోటీ చేయనని ప్రచారం చేసుకున్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప జగదీశ్ రెడ్డి కొత్తగా చేసిందేమీ లేదని చెప్పారు.

అయినా జనాలు దయ చూపలేదు. బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు సైతం ఒక్క చాన్స్‌‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే పేటకు రైల్వే లైన్ తెస్తానని, హైవేపై అండర్ పాస్‌‌లు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అయినా గత రెండు పర్యాయాలు పడ్డ ఓట్లే ఈ సారి కూడా పడ్డాయి.