కట్టినచోట ఇయ్యలె.. ఇచ్చినచోట కంప్లీట్​ చెయ్యలె!.. డబుల్​ బెడ్​ రూమ్ ఇండ్లు ఆగమాగం

  • కొన్ని పూర్తయినా పంపిణీ  చేయక పాడుబడుతున్న పరిస్థితి 
  • ఆఫీసర్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో డబుల్​ బెడ్ ​రూమ్​ ఇండ్లు కట్టిన చోట ఇంకా ఇయ్యలేదు. అవి పాడుబడుతున్నాయి. కొన్ని చోట్ల ఇండ్లు కంప్లీట్ కాకముందే డ్రాలు తీసి లబ్ధిదారులకు ఇచ్చినట్లు చూపినా వాటిని ఇంకా పూర్తి చేయలేదు. మరికొన్ని ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాని పరిస్థితి ఉండడంతో ఆఫీసర్ల తీరుపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం జిల్లాకు ఐదారేండ్ల కిందట 6,443 డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను అలాట్​ చేసింది. ఇందులో 6,168 డబుల్​ బెడ్ ​ఇండ్లకు అడ్మినిస్ట్రేషన్​ శాంక్షన్​​ వచ్చింది. 3,090 ఇండ్లు మాత్రం ఇప్పటి వరకు కంప్లీట్​ అయ్యాయి. 

దాదాపు 3,353ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 2,821 మంది లబ్ధిదారులను సెలెక్ట్​ చేశారు. ఇందులో 2,454 మందికి ఇండ్లను అప్పగించారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కట్టిన ఇండ్లను పంపిణీ చేయకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. అర్హులైన వారికి ఇండ్లను అలాట్​ చేయాలని ఎప్పటినుంచో ఆఫీసర్లను కోరుతున్నా రేపు, మాపంటూ దాటవేస్తున్నారని ఆ ప్రాంత లబ్ధిదారులు వాపోతున్నారు. కేటాయింపులో డిలే కొనసాగుతుండడంతో ఇటీవల కొందరు ఇండ్లను ఆక్రమించుకోవడంతో పెద్ద గొడవే జరిగింది. ఇండ్లను త్వరగా కేటాయించాలని పలుమార్లు గ్రీవెన్స్​లో కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎక్కడెక్కడంటే..? 

కొత్తగూడెం పట్టణంలో ఐదారేండ్ల కిందట 935 డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన అధికారులు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. నిర్మాణాలు పూర్తి కాకుండానే అధికారుల సమక్షంలో ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు లబ్ధిదారులను సెలెక్ట్​ చేసి ఇండ్లను కేటాయించారు. ఈ పరిస్థితిపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. చుంచుపల్లి మండలంలో 60 డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లకు ప్లాన్​ చేయగా ఇప్పటి వరకు 11 ఇండ్లు పూర్తి అయ్యాయి. 49 ఇండ్లు అండర్​ ప్రాసెస్​లో ఉన్నాయి. ఇక్కడ నిర్మాణాలు పూర్తి అయిన ఇండ్లను కూడా లబ్ధిదారులకు కేటాయించలేదు. 

భద్రాచలం నియోజకవర్గంలో 958 ఇండ్ల నిర్మాణాలకు ప్లాన్​ చేయగా ఇప్పటి వరకు 595 ఇండ్లు కంప్లీట్​అయ్యాయి. ఇందులో 403 ఇండ్లను లబ్ధిదారులకు అలాట్​ చేశారు. భద్రాచలం పట్టణంలో 250 ఇండ్లకు గానూ 117 ఇండ్లు పూర్తి అయినా ఒక్కటి కూడా లబ్ధిదారులకు కేటాయించలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో 1,800 ఇండ్లకు గానూ కేవలం 146 ఇండ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. ఇందులో 115 ఇండ్లను మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. 

ఇల్లెందు నియోజకవర్గంలో 560 ఇండ్లకు గానూ 140 ఇండ్లను మాత్రమే లబ్ధిదారులకు అలాట్​ చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,400 ఇండ్లకు గానూ 860 ఇండ్లను  పంపిణీ చేశారు. పినపాక నియోజకవర్గంలో 1,400 ఇండ్లకు గానూ 887 ఇండ్లు పూర్తి కాగా,  652 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు. దుమ్ముగూడెం మండలం గౌరారంలో దాదాపు 90శాతం ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయినా పెండింగ్ ​పనులు పూర్తి చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. రామవరం ప్రాంతంలోని త్రీ ఇంక్లైన్​లో ఇండ్ల నిర్మాణం మొండి గోడలకే పరిమితమైంది. ఎక్కువ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. 

ఆదేశించినా...  ఆశించిన ఫలితం రాలే.. 

డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను పూర్తి చేయాలని పలుమార్లు సమావేశాలలో ఇంజినీరింగ్​ ఆఫీసర్లపై గత కలెక్టర్లు ఎంవీ రెడ్డి, అనుదీప్​తో పాటు ప్రస్తుత కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల​ ఆగ్రహం వక్తం చేసిన దాఖలాలున్నాయి. కొత్తగూడెంలోని ఇండ్లు గతేడాది అక్టోబర్​లోనే పూర్తి చేయాలని అప్పటి ఎమ్మెల్యే, కలెక్టర్​ పలుమార్లు ఇంజినీరింగ్​ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినా ఫలితం లేకపోయింది. డబ్బులివ్వకుండా ఇండ్లను ఎలా  నిర్మించా లని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. పాత రేట్లతోనే పనులు చేయాలనడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.