కోట్లు పెట్టి మిషన్లు కొని..చీపుర్లతో ఊడుస్తున్రు

భద్రాద్రి, కొత్తగూడెం, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో రూ.1.60 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్, సక్కింగ్ మిషన్ ఏడాదిన్నరకే మూలకు చేరాయి.  పట్టణంలో ప్రధాన రోడ్లను క్లీన్​ చేసేందుకు స్వీపింగ్​ మిషన్​ను, డ్రైనేజీలు క్లీన్​ చేసేందుకు సక్కింగ్ మిషన్​ను కొన్నారు. కానీ వాటిని కేవలం సీఎం కేసీఆర్, లేదా మంత్రులు వచ్చినపుడు మాత్రమే బయటకు తీస్తున్నారు. లేకపోతే మూలకే పడేస్తున్నారు. ప్రధాన రోడ్లు క్లీన్​ చేసేందుకు తీసుకొచ్చిన మిషన్​ రోడ్లపై తిరుగుతుంటే రోడ్లు కరాబ్​ అయుతున్నాయని మళ్లీ ఆఫీసర్లే అంటున్నారు. దీంతో అవి మూలకే పరిమితం అవుతున్నాయి.

మూలకు మిషన్లు..  చీపుర్లే దిక్కు

మిషనరీ మూలకు పడేయడంతో గతంలో లానే పారిశుధ్య సిబ్బందితో రోడ్లను అధికారులు శుభ్రం చేయిస్తున్నారు.  డ్రైనేజీలను శుభ్రం చేసే మిషన్​ తమ ప్రాంతాలకు పంపించాలని పలువురు కౌన్సిలర్లు కోరుతున్నప్పటికీ అధికారులు, పాలకుల్లో ఉలుకూ పలుకూ లేదు. అప్పుడప్పుడు పట్టణంలోని రైల్వే అండర్​ బ్రిడ్జి వద్ద గల డ్రైనేజీలను ఈ మిషన్​లను ఉపయోగిస్తూ మమ అనిపిస్తున్నారు.  మిషన్ల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారినట్లు  ప్రతిపక్ష కౌన్సిలర్లు అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.  మిషనరీలను కొనుగోలు చేసి మూలకు పడేశారంటూ మునిగడప పద్మ, సత్యభామ, కంచర్ల చంద్రశేఖర్​, భూక్యా శ్రీనివాస్​, నేరెళ్ల సమైక్య ఆరోపించారు. 

కౌన్సిలర్ల ఆరోపణలు 

మెరుగైన శానిటేషన్​లో భాగంగా మరో రెండు, మూడు ట్రాక్టర్లు అవసరమని చెప్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ల కొనుగోలుకు ముందుకు రాని అధికారులు, పాలకులు తమ కమీషన్లు ఎక్కువగా వచ్చే మిషనరీపై దృష్టి పెట్టి రూ. కోట్లు ఖర్చు చేసి స్వీపింగ్, క్లీనింగ్​ మిషన్లను కొనుగోలు చేశారని పలువురు కౌన్సిలర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వాడనప్పుడు కొని ఉపయోగం ఏమీ.. 

అధికారులు, పాలకులు కలిసి కమీషన్ల కోసమే కొనుగోలు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిషనరీని  రెగ్యులర్​గా వాడనప్పుడు వాటిని అధికారులు ఎందుకు కొనుగోలు చేశారో చెప్పాలి. ట్రాక్టర్లు అవసరం ఉందంటే వాటిని కొనుగోలు చేయడానికి మాత్రం ఆఫీసర్లు ముందుకు రావడం లేదు.  

_ వై. శ్రీనివాస్​రెడ్డి, సీపీఐ ఫ్లోర్​ లీడర్​