అనర్హులకు దాదాపు రూ. 10కోట్లకు పైగానే రైతుబంధు జమ

అనర్హులకు దాదాపు రూ. 10కోట్లకు పైగానే రైతుబంధు జమ
  • రూ.లక్షల్లో లబ్ధి పొందుతున్న నాన్​ అగ్రికల్చర్​ ల్యాండ్​ యజమానులు
  • వేలల్లో బయటపడుతున్న అనర్హులు
  • రైతుబంధు నిలుపుదలకే అధికారులు పరిమితం..  
  • ఉసేలేని రికవరీ 

భద్రాద్రికొత్తగూడెం : అగ్రికల్చర్​ ల్యాండ్​ కాకున్నా జిల్లాలోని పలు గ్రామాల్లో కొందరు దర్జాగా రైతుబంధు పొందుతున్నారు. గత నాలుగేండ్లలో అనర్హులకు దాదాపు రూ. 10కోట్లకు పైగానే రైతుబంధు జమ అయినట్టు అంచనా. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్​కాలనీ పంచాయతీలో 16 ఎకరాల 4 కుంటల నాన్​ అగ్రికల్చర్​ ల్యాండ్​కు నాలుగేళ్ల పాటు ఏడాదికి దాదాపు రూ. 1.68లక్షల చొప్పున రైతు బంధు అందగా.. విచారించిన అధికారులు ఆ ల్యాండ్​ నాన్​ అగ్రికల్చర్​గా గుర్తించి రైతుబంధు అపేశారు.  అగ్రికల్చర్​ ల్యాండ్​కు కాకుండా ఇతర కమర్షియల్​, రియల్​ ఎస్టేట్​ భూములతో పాటు, అర్హత లేని వారికి రైతుబంధు అందడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

అనర్హులను గుర్తించేందుకు సర్వేలు
అధికారుల నిర్లక్ష్యం, కమీషన్ల దందాతో అనర్హులు రూ. కోట్లలో రైతుబంధు  పొందుతున్నారు. మొదటి నుంచీ ఇలాంటి ఘటనలు బయటపడుతున్నా అధికారులు మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు. 2018లో వానాకాలం పంట సాగులో భాగంగా రైతుబంధుకు దాదాపు లక్షా పది వేల మంది రైతులు ఎంపికయ్యారు. అయితే అందులో సాగులో లేని భూములకు అధికారులు రైతుబంధు మంజూరు చేశారు. ఖాళీ స్థలాలు, అక్రమ వెంచర్లు, ఇండ్లు ఉన్న ప్రాంతాల్లోని ల్యాండ్​కు కూడా రైతుబంధు ఇవ్వడాన్ని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. భూ యాజమానులు, గతంలో ఉన్న అధికారులతో కుమ్మక్కై రైతుబంధు పొందారనే ఆరోపణలున్నాయి. అయితే వీటిపైన తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు రీ వెరిపికేషన్​ చేసి దాదాపు ఏడు వేల మంది అనర్హులను గుర్తించారు. 

రైతుబంధు క్యాన్సిల్​ చేసినా.. పట్టా జోలికి వెళ్లని అధికారులు 
చుంచుపల్లి మండలం విద్యానగర్​ కాలనీ పంచాయతీలో భాస్కర్​ అనే వ్యక్తి తనకున్న 16.4 ఎకరాల భూమిని దశల వారీగా అమ్మేశాడు. ఆ భూమిని కొన్న వాళ్లు అక్కడ 80 శాతం మంది ఇండ్లు నిర్మించుకున్నారు. అయితే భాస్కర్​ చనిపోవడంతో ఆయన కొడుకు రమేశ్​ అధికారులతో కలిసి ఆ 16 ఎకరాల నాలుగు కుంటల ల్యాండ్​కు ధరణి నుంచి పాస్​బుక్​ తీసుకున్నాడు. అక్కడ అగ్రికల్చర్​ ల్యాండ్​ లేకున్నా 2018 నుంచి 2021యాసంగి వరకు రైతుబంధు స్కీం ను పొందాడు.   ఆ భూమి ఇప్పుడు తనదేనంటూ భూమి కొన్న వ్యక్తుల దగ్గరకు వెళ్లి ఖాళీచేయాలనడంతో వారు  వారం   కిందట అధికారులకు   ఫిర్యాదు చేయగా..  అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్పుడో తాము కొన్న భూమికి రమేశ్​ ఇప్పుడు కొత్త పాస్​బుక్​ చూపించడంతో ప్రస్తుత యజమానులు ఆందోళన చెందుతున్నారు. 

అంతటా అదే తీరు.. 
చుంచుపల్లితో పాటు సుజాతనగర్​, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, అశ్వారావుపేట, టేకులపల్లి, ఇల్లెందు, అశ్వాపురం తదితర మండలాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువ ఉన్నాయి. అనర్హులకు ఎక్కువగా రైతుబంధు సాయం అందుతోంది. సుజాతనగర్​, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, అశ్వారావుపేట, పాల్వంచ మండలాల్లో రియల్​ ఎస్టేట్​ భూములకు రైతుబంధు అందడం విచిత్రం. కంప్లైట్​ వచ్చిన తర్వాత విచారణ చేసి అధికారులు రైతుబంధు ఆపేస్తున్నారు తప్ప.. అప్పటి వరకు అక్రమంగా పొందిన రైతుబంధు డబ్బులను రికవరీ చేయడంపై  దృష్టి పెట్టడం లేదు. పట్టాదారు పాస్​ పుస్తకాలు ఇచ్చే టైంలో ల్యాండ్​ నిజంగా సాగులో ఉందా అని పరిశీలించకుండానే  రైతుబంధు ఇస్తున్నట్టు  రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.  కిందటి ఏడాది వరకు దాదాపు ఏడు వేల మందిని రైతుబంధుకు అనర్హులుగా అధికారులు గుర్తించారు. ఇటీవలి కాలంలో మరోసారి నిర్వహించిన సర్వే ప్రకారంగా ప్రస్తుతం దాదాపు 5వేల మంది అనర్హులున్నట్టు అధికారులు ప్రాథమిక సర్వేలో గుర్తించి వారికి సంబంధించిన రూ. 6కోట్లకు పైగా డబ్బులను వారి ఖాతాల్లో వేయకుండా అగ్రికల్చర్​ అధికారులు నిలిపేశారు. 

విచారణ జరపాలి 
గత నాలుగేండ్లలో రమేశ్​​ అనే వ్యక్తి దాదాపు 16 ఎకరాల నాలుగు కుంటల భూమికి  ఏడాదికి రూ. 1.68లక్షల చొప్పున రైతు బంధు పొందాడని చుంచుపల్లి మండలానికి చెందిన అఖిలపక్ష నాయకులు దుర్గరాశి వెంకన్న, బలగాని శ్రీధర్​, శివ, మల్లికార్జున్​, నరసింహరావు, రాంచందర్​ అన్నారు. అగ్రికల్చర్​ ల్యాండ్​ లేకున్నా పట్టాదార్​ పాస్​ పుస్తకాలు పొంది, అక్రమంగా రైతుబంధు డబ్బును తీసుకున్న రమేష్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. డబ్బులను రికవరి చేయాలన్నారు.

రైతుబంధు ఆపేశాం 
చుంచుపల్లి మండలం విద్యానగర్​ కాలనీ పంచాయతీలోని 16 ఎకరాల ల్యాండ్​కు సంబంధించి తనకు కంప్లయింట్​ వస్తే విచారించాను. ఆ ల్యాండ్​కు సంబంధించి రైతుబంధును  గతేడాది ఆపేశాం.  నేను బాధ్యత చేపట్టక ముందే పట్టాదార్​ పాస్​ పుస్తకం ల్యాండ్​ యజమానుల వద్ద ఉంది. ప్రస్తుతం ఆ ల్యాండ్​లో చాలా వరకు ఇండ్లు ఉన్నాయి, అగ్రికల్చర్​ ల్యాండ్​ మాత్రం కాదు. ఇందుకు సంబంధించిన రిపోర్ట్​ను కలెక్టర్​కు ఇచ్చాను. - కృష్ణ ప్రసాద్​, తహసీల్దార్​, చుంచుపల్లి మండలం