- కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో సీడ్ లోపంతో దెబ్బతిన్న వరి పంట
- 300 ఎకరాల వరకు పంట నష్టం
- కోత దశలో తప్పా, తాలు తప్ప గింజ లేని వైనం
- వ్యవసాయాధికారుల పరిశీలన
- ఎకరాకు 28 క్వింటాళ్లు రావాల్సి ఉన్నా.. 3 క్వింటాళ్లే దిగుబడి
- దిక్కుతోచని స్థితిలో అన్నదాత
కామారెడ్డి , బీర్కుర్, వెలుగు : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో నకిలీ విత్తనాల వల్ల యాసంగిలో వరి పంట దిగుబడి పడిపోయింది. బీర్కూర్, తిమ్మాపూర్, వెంకటయ్య క్యాంపు ఏరియాల్లో దాదాపు 300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. బీర్కూర్ లోని గ్రోమోర్ సీడ్స్ షాపులో తాము అడిగిన విత్తనాలు కాకుండా ఆర్కే సోనా రకం సీడ్ ఇచ్చారని వాటిని నారు పోసి పంట వేయగా..
కోత దశలో దిగుబడి రాక తప్పా తాలే వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నాసిరకం విత్తనాలతోనే ఇలా జరిగిందని దీంతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని దిగాలు చెందుతున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు
సీడ్స్, ఫెర్టిలైజర్స్షాపులను అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ వ్యవసాయాధికారులు సీజన్ ఆరంభంలో షాపులను విజిట్‌చేసి సీడ్స్షాంపిల్స్కలెక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పైకి జరుగుతున్నప్పటికీ లోపల మాత్రం నకిలీ సీడ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని దుకాణాల్లో రైతులకు సీడ్స్, ఫెస్టిసైడ్ కొన్నట్లు బిల్లు రశీదులు కూడా ఇవ్వడం లేదు. బీర్కూరు మండలంలో రైతులను ఇదే విధంగా మోసగించారు.
అయితే ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టామని ఇప్పుడు సీడ్ లోపంతో మూడు, నాలుగు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
వ్యవసాయాధికారులు, సైంటిస్టుల పరిశీలన
నకిలీ సీడ్ వల్ల పంట నష్టపోతున్నామని రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం సైంటిస్టులు, స్థానిక అగ్రికల్చర్ ఆఫీసర్లు పంట పొలాలను పరిశీలించారు. రుద్రారం, జగిత్యాల, కూనారం పరిశోధన కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తలు పొలాలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే వరి పంటలో పొల్లు ఎందుకు ఎక్కువ వస్తుందో లోపం ఏంటో తెలిసే అవకాశం ఉందని ఆఫీసర్లు పేర్కొన్నారు.
సన్న రకం ఎకరాకు 28 క్వింటాళ్ల వరకు రావాలని సీడ్ లోపంతో ఎకరాకు మూడు, నాలుగు క్వింటాళ్లకు మించి దిగుబడి రావట్లేదని రైతులు వారి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. అయితే షాపులో తాము ఒక రకం సీడ్ అడిగితే మరో రకం ఇచ్చారని రైతులు వాపోయారు. సైంటిస్టులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్రజినీకాంత్, ఏ.కిషోర్, పి.విజయ్‌కుమార్, బాన్సువాడ ఎడీఏ వీరాస్వామి, ఏవోలు కమల, శ్రావణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. చెబుతున్నారు.
మొత్తం పొల్లు వచ్చింది
నాకున్న ఎకరం భూమితో పాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేసినా. కౌలు కింద ఎకరాకు 9 క్వింటాళ్ల వడ్లు ఇవ్వాలి. తీరా ఇప్పుడు మొత్తం పొల్లు వచ్చింది. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల వడ్లు రాలేని పరిస్థితి ఏర్పడింది.
మురళీకృష్ణ, బీర్కూర్
పరిశీలన తర్వాత చర్యలు
ఇప్పటి వరకు కొంతమేర పంట నష్టం జరిగినట్లు అంచనా వేశాం. పంట దిగుబడి తక్కువ రావటానికి గల కారణాల్ని పరిశీలిస్తున్నాం. ఎక్కడ లోపం ఉందో కనిపెట్టాల్సి ఉంది. వీటన్నింటిపై ఉన్నతాధికారులకు రిపోర్టు ఇస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. రైతులు ఒక కంపెనీ సీడ్ అడిగితే మరో కంపెనీ సీడ్ ఇచ్చారని తెలుస్తోంది.
వీరాస్వామి, ఏడీఏ, బాన్సువాడ
అడిగిన సీడ్ ఇవ్వలే
7 ఎకరాల్లో వరి పంట సాగు చేసిన. బీర్కూర్‌లోని గ్రోమోర్ షాపులో వరి సీడ్ తీసుకెళ్లా. నేను అడిగిన సీడ్ ఇవ్వకుండా మరో రకం సీడ్ ఇచ్చారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసినా పొలం గింజ కట్టలేదు. నాకు నష్టపరిహారం ఇప్పించాలి.
నర్సింలు, బీర్కూర్