బీజేపీ చక్రవ్యూహంలో జనం.. అప్పుడూ.. ఇప్పుడూ ఆరుగురే: రాహుల్ గాంధీ పంచ్ లు

బీజేపీ చక్రవ్యూహంలో జనం.. అప్పుడూ.. ఇప్పుడూ ఆరుగురే: రాహుల్ గాంధీ పంచ్ లు

సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలో ప్రస్తుతం భయానక వాతావరణం ఉందని అన్నారు. యావత్ దేశం ఇవాళ బీజేపీ వేసిన పద్మవ్యూహంలో చిక్కుకుపోయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తన ఛాతీపై ధరించే కమలాన్ని పద్మం అని అంటారని.. ఆ పద్మం చిహ్నం పద్మవ్యూహాన్ని పోలి ఉందని.. ప్రస్తుతం దేశం అందులో చిక్కుకుపోయిందన్నారు. యువకులు అగ్నివీర్ అనే పద్మవ్యూహంలో చిక్కుకున్నారని..  అగ్నివీర్లకు పెన్షన్ కోసం బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు లేవన్నారు.

 వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తులు పద్మవ్యూహంలో బంధించి చంపారు. తాజాగా 21వ శతాబ్దంలో మరో  కొత్త  పద్మవ్యూహం ఏర్పడిందన్నారు. ఆనాడు అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తులు చంపారని తెలిపారు. నేటి  పద్మవ్యూహంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అంబానీ, అదానీ అనే ఆరుగురు వ్యక్తులు ఉన్నారని అన్నారు.  దేశంలోని యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్యతరహా వ్యాపారులతో అందరూ ఆ ఆరుగరి పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు.

ALSO READ | ట్యాక్స్ టెర్రరిజంతో వ్యవస్థ ఆగమైతోంది... రాహుల్ గాంధీ

ఈ పోలికపై స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని వారించడంతో రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై స్పందించారు. మీకు కావాలంటే, నేను NSA దోవల్, అంబానీ, అదానీ పేర్లను వదిలివేసి కేవలం మూడు పేర్లను తీసుకుంటానని చెప్పారు. భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్న పద్మవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయరన్నారు.

అందులో ఒకటి గుత్తాధిపత్య పెట్టుబడి అన్నారు. - మొత్తం భారతీయ సంపదను ఇద్దరు వ్యక్తులు కలిగి ఉండాలనేది ఈ శక్తి ఉద్యేశ్యం అన్నారు.  రెండవది, సంస్థలు, ఏజెన్సీలు - సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఆదాయపు పన్ను శాఖ (IT) అని.. మూడవది, రాజకీయ కార్యనిర్వాహక వర్గం అని తెలిపారు. 

ఈ ముగ్గురూ కలిసి పద్మవ్యూహం నడిబొడ్డున నిలబడి ఈ దేశాన్ని సర్వనాశనం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మీరు నిర్మించిన ఈ  పద్మవ్యూహం కోట్లాది ప్రజలకు హాని కలిగిస్తోందన్నారు. మేము మీ పద్మవ్యూహాన్ని కుల గణన ద్వారా విచ్ఛిన్నం చేయబోతున్నామని తెలిపారు. ఈ సభలో ఇండియా కూటమి హామీ ఇచ్చిన MSPని ఆమోదించారని.. అదేవిధంగా మీకు నచ్చినా..  నచ్చకపోయినా ఈ సభలో మేము హామీ ఇచ్చిన కుల గణనను మేమే ఆమోదిస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు.