ఏడు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో 13 సీట్లకుగాను ఇండియా కూటమి పది సీట్లలో గెలుపొంది విజయభేరి మోగించింది. అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ 11 సీట్లలో ఓటమిపాలైంది. ఉప ఎన్నికలు పశ్చిమబెంగాల్, బిహార్, తమిళనాడు, కర్నాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో జరిగాయి. దేశంలో నలుమూలల నుంచి వెల్లడైన ఉప ఎన్నిక ఫలితాల్లో దాదాపు ఎన్డీఏ అభ్యర్థులను ప్రజలు ఓడించడం జరిగింది.
2024లో లోక్ సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ తన పూర్వ మెజారిటీని కోల్పోయింది. అది మోదీ ప్రభుత్వ ఓటమే కాదు. ఆర్ఎస్ఎస్, బీజేపీ సంప్రదాయ రాజకీయాల ఓటమిగా కూడా పరిగణించాలి. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా కొనసాగిన పాలన దేశంలో హింస, భయాందోళనలను రేకెత్తించింది. మైనారిటీలను భయాందోళనలకు గురి చేసింది.
పేదరికంలోకి ప్రజలను నెట్టివేయడం కేంద్ర ప్రభుత్వ విధానాల లోపం. కార్పొరేట్ అనుకూల ప్రభుత్వ విధానంతో ప్రైవేటైజేషన్ దేశంలో విలయతాండవం చేస్తోంది. కార్పొరేట్ బిలియనీర్ల అభివృద్ధిని దేశాభివృద్ధిగా బీజేపీ ప్రభుత్వం చూపడం దురదృష్టకరం. వ్యాపార రాజకీయాలకు ప్రోత్సహించేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ప్రజల వనరులను కార్పొరేట్లకు అప్ప చెప్పడం విచారకరం. పేదరికం, నిరుద్యోగం దేశవ్యాప్తంగా పెరిగింది. నిరుపేదల జీవితంలో లేని వికాసం భారత్ జాతి వికాసం ఎట్లా అవుతుంది?
మోదీ పాలనలో సామాన్యులకు నిరాదరణ
కార్పొరేట్లకు పెట్టుబడిని బ్యాంకుల రూపంలో సరసమైన వడ్డీలతో బీజేపీ ప్రభుత్వం అందించింది. దాంతోపాటు పలు రకాల రాయితీలను కార్పొరేట్ల పరం చేసింది. అతి ముఖ్యంగా కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేసింది. దీంతోపాటు నోట్ల రద్దు, జీఎస్టీ విధించడంతో సామాన్య వ్యాపారులు రోజువారీ పెట్టుబడి కూడా లేక ఎన్నో ఇబ్బందులను మోదీ పాలనలో ఎదుర్కొన్నారు.
చిన్నపాటి వ్యాపారులే కాకుండా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లు ప్రభుత్వ సానుకూలత లోపించడంతో వర్కింగ్ క్యాపిటల్ కోల్పోయి వేల సంఖ్యలో మూతపడ్డాయి. ఎంతోమంది ఉపాధిని కోల్పోయినారు. కార్పొరేట్లు ఉద్యోగ అవకాశాలను సృష్టించలేకపోవడంతోపాటు ప్రభుత్వం నుంచి కూడా సామాన్య ప్రజలు నిరాదరణకు గురయ్యారు. రెండు వైపుల నుంచి నిరాదరణకు గురైన పేదలు, ఉద్యోగులు, వ్యాపారులు, చిన్న పరిశ్రమల యజమానులు తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు.
ఒకవైపు పట్టణాల్లో ఆర్థిక వ్యవస్థ.. అణగారిన సామాజిక వర్గాలకు అందుబాటులో లేక బతుకులు భారమవుతున్నాయి. మరోవైపు గ్రామీణ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే రైతులు ప్రభుత్వ ప్రోత్సాహం లేక పలు ఇబ్బందులు పాలైనారు. దేశంలో రైతులు పెద్ద ఎత్తున పంట గిట్టుబాటు ధర (చట్టపరమైన ఎంఎస్పీ) కోసం ఉద్యమ బాట పడితే ప్రభుత్వం అణచివేత బాట చేపట్టింది.
మేధావి వర్గంపై కేసులు
మేధావులు మోదీ పాలనను వ్యతిరేకించి మాట్లాడితే వారిపై కేసులు, ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయి. కేసులు, జైళ్ళ భయాలతో దేశంలో మేధావి వర్గం కుంగిపోతున్నది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక స్వేచ్ఛను కోల్పోయే స్థితికి ప్రజలు చేరుకున్నారు. నైతికంగా బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది. అయినా మూడోసారి అధికారంలో కొనసాగుతోంది. ఎన్డీఏ మిత్రపక్షాల బలంతో కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నది.
ఒకటి, రెండు ప్రాంతీయ పార్టీలు , ప్రజాస్వామ్యం కేంద్రంగా, సామాజిక ఉన్నతి, దేశ అభివృద్ధి కేంద్రంగా నిర్ణయం తీసుకుంటే బీజేపీ సర్కారు ఏ క్షణాన్నైనా కూలిపోయే స్థితిలో ఉంది. ఇంత అస్థిరతలో కూడా మత రాజకీయాలను దేశం మీద రుద్దడానికి బీజేపీ వెనుకంజ వేయడం లేదు. ముఖ్యంగా మేధావి వర్గాన్ని సృష్టించే విద్యాసంస్థలలో విద్వేషాలను రెచ్చగొడుతోంది. యూనివర్సిటీలు, కాలేజీలు ఉద్యోగ నియామకాలలో ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేసిన అనుభవాన్ని ఉన్న వ్యక్తులనే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
చివరకు ఢిల్లీ యూనివర్సిటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థలు 'మనువాదం' పై బోధనలు చేయడానికి ప్రయత్నించింది. స్వాతంత్ర్యం అనంతరం కొంతమేరకు రాజ్యాంగ పాలనలో రాజ్యాంగ హక్కులను అనుభవించిన పౌరులు ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. దేశప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అణచివేతకు గురైన సామాజిక వర్గాలు మతాధిపత్య రాజకీయాలను సహించలేకపోవడంవల్లనే 2024 ఎన్నికల్లో బీజేపీ మెజార్టీని కోల్పోయింది. రాజ్యాంగ ఉద్యమం, కుల గణన ఉద్యమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయ ఉద్యమాలు ప్రజలకు వాస్తవాలను చూపించడంతో బీజేపీ ఉప ఎన్నికల్లో ఓటమిపాలైంది.
రైతులను పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం
బీజేపీ ప్రభుత్వం కార్పొరేటీకరణ విధానాలలో భాగంగా వ్యవసాయాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి మూడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చింది. రైతులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. పెట్టుబడి లేక అప్పులతో, పేదరికంతో, బాధలలో నిండిపోయిన రైతులకు ఈ చట్టాలు శరాఘాతంగా మారడంతో వాటిని నిరసిస్తూ తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమించినారు.
చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఉత్తర భారత రైతులు పంజాబ్ రైతుల నాయకత్వంలో నెలలు, సంవత్సరము పైగా ఢిల్లీ బార్డర్లలో రాత్రి పగలనకా, ఎండా, వానకు వెరవకుండా పోరాటం చేశారు. కానీ, బీజేపీ ప్రభుత్వం కనికరించలేదు. పైగా వారిపట్ల హింసాత్మకంగా వ్యవహరించింది. చివరికి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం మూడు చట్టాలను వెనకకు తీసుకోవడంతో రైతు ఉద్యమం గెలుపుగా భారతదేశం గర్వించింది.
కానీ రైతు సమస్యలు మోదీ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నది. ఉద్యోగ అవకాశాల కోసం సంవత్సరాలుగా చూస్తున్న నిరుద్యోగుల ఆశలను బీజేపీ ప్రభుత్వం ఆవిరి చేసింది. ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం భర్తీ చేయడానికి నిరాకరించింది. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతో బాధలు అనుభవిస్తున్న విద్యాధికులు, వారి కుటుంబాలు ఎంతో వేదనకు గురవుతున్నారు.
మణిపూర్లో సామాజిక హింస
మోదీ ప్రభుత్వం ఎన్నడూ సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయలేదు. అంతేకాకుండా పబ్లిక్ సెక్టారులో ఉన్న రైల్వే, పోర్టులను, ఎయిర్పోర్టులు, ఇండస్ట్రీలను, వనరులను ప్రైవేటుపరం చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు రిజర్వేషన్లు కోల్పోయారు.
ఇది గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వ విధానాలలో భాగంగా జరిపిన ఆర్థిక- హింస కాదా? నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ మతవిద్వేషంలో భాగంగా కమ్యూనల్ దాడులతో మణిపూర్ ప్రజలు హింసను అనుభవిస్తున్నారు. రెండు జాతుల మధ్య దాడులు జరుగుతున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ తగినచర్యలు తీసుకోలేకపోయింది.
పార్లమెంటులో మణిపూర్ సమస్యపై చర్చలో విపక్షం పాల్గొంటే ప్రభుత్వం సరైన పాలసీ ఇవ్వలేకపోయింది. వేలమంది పిల్లలు, తల్లులు నిరాశ్రయులయ్యారు. స్త్రీలు విపరీతమైన సామాజిక హింసకు గురయ్యారు. మణిపూర్లో మానవ హక్కుల రక్షణ కోసం ప్రపంచం పరితపిస్తున్నా బీజేపీ ప్రభుత్వం విస్మరించడం చాలా దురదృష్టకరమైన పరిణామం. దేశంలోని పలు సంఘాలు, మేధావులు సామాజిక హింసపై స్పందిస్తే వాళ్లను కేసులలో ఇరికించి జైల్లో పెట్టడం జరుగుతోంది.
‑ ప్రొ. సింహాద్రి సోమనబోయిన, సమాజ్వాది పార్టీ, రాష్ట్ర అధ్యక్షుడు