టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో.. జోగి రమేశ్, అవినాశ్‌కు సుప్రీంలో ఊరట

తదుపరి ఆదేశాలిచ్చే వరకు వారిపై చర్చలొద్దని ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: టీడీపీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వారు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్లను కొట్టేస్తూ ఈ నెల 9న హైకోర్టు ఇచ్చిన తీర్పును దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాముడు, ఒగ్గు గవాస్కర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 

ఈ పిటిషన్లపై జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాల బెంచ్‌ శుక్రవారం విచారణ జరిపింది. పిటిషన్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, నీరజ్ కిషన్ కౌశల్, అల్లంకి రమేశ్, ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూథ్ర వాదనలు వినిపించారు. 

వైసీపీ నేతలు చేసిన దాడికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీలను న్యాయస్థానానికి అందించారు. అయితే ఆ ఫుటేజీలను తర్వాత పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. అయితే, దేవినేని అవినాశ్ గతంలో విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారని కోర్టు దృష్టికి ముకుల్ రోహత్గీ తీసుకెళ్లారు. 

ఇరువాదలను విన్న ధర్మాసనం.. విచారణను 4 వారాలు వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. నిందితులు దర్యాప్తునకు సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. 48 గంటల్లో పాస్ పోర్టులు దర్యాప్తు అధికారులకు అంద జేయాలని స్పష్టం చేసింది.